Draft Income Tax Rules 2026 : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. కారు కొనడం నుంచి క్యాష్ డిపాజిట్ల వరకు పాన్ కార్డ్ కొత్త రూల్స్ ఇవే..
Draft Income Tax Rules 2026 : డ్రాఫ్ట్ ఇన్కమ్ టాక్స్ రూల్స్ 2026లో పాన్ కార్డు అవసరమయ్యే అంశాల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. పాన్ మినహాయింపులు, నగదు లావాదేవీలు, కంపెనీ కారు పన్నుకు సంబంధించి ముఖ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Draft Income Tax Rules
- ఆదాయపు పన్ను ముసాయిదా నిబంధనలు 2026లో కీలక మార్పులు ఏంటి?
- కొత్త ఆర్థిక సంవత్సరంలో రాబోయే ఆదాయపు పన్ను నియమాలు ఏంటి?
- ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఆదాయపు పన్ను చట్టం 2025
Draft Income Tax Rules 2026 : పన్నుచెల్లింపుదారులు, సాధారణ పౌరులకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఆదాయపు పన్ను నియమాలు కూడా మారబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ డ్రాఫ్ట్ ఇన్కమ్ టాక్స్ రూల్స్ 2026ను డ్రాఫ్ట్ టాక్స్ రిటర్న్ ఫారమ్‌లతో పాటు విడుదల చేసింది.
దీనికి సంబంధించి ప్రజల అభిప్రాయాన్ని కోరింది. పన్ను వ్యవస్థను సులభతరం చేయడమే కాకుండా అందరికీ అర్థమయ్యే భాషలో పారదర్శకంగా మార్చడమే ఉద్ధేశ్యం. డ్రాఫ్ట్ ఇన్కమ్ టాక్స్ రూల్స్ 2026 పాన్ కార్డ్‌కు సంబంధించిన కొన్ని మార్పులను తీసుకురానుంది. పాన్ కార్డు అవసరమయ్యే అంశాలను కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) మార్చి మొదటి వారం నాటికి ముసాయిదా ఆదాయపు పన్ను నియమాలను ప్రకటించనుంది. అసెస్మెంట్ ఇయర్ (AY) 2026–27 కోసం ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసే పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారమే రిటర్న్ ఫారమ్‌లు, నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అయితే పెద్ద లావాదేవీల విషయంలో నిబంధనలు కఠినంగా మారతాయి. పాన్ కార్డులకు సంబంధించి రాబోయే మార్పులను ఓసారి వివరంగా తెలుసుకుందాం..
క్యాష్ డిపాజిట్లు, విత్‌డ్రాకు అధిక పరిమితులు :
బ్యాంకుల్లో నగదు లావాదేవీలకు సంబంధించి అతిపెద్ద మార్పు ఒకటి రాబోతుంది. క్యాష్ డిపాజిట్లు లేదా విత్ డ్రాలకు తప్పనిసరి పాన్ కార్డు పరిమితి పెరగనుంది.
ముసాయిదా నిబంధనల ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్ల నుంచి రూ. 10 లక్షలు డిపాజిట్ లేదా విత్ డ్రా చేస్తే పాన్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుత నిబంధనలకు భిన్నంగా ఉంటుంది. బ్యాంకు లేదా సహకార బ్యాంకులో ఒకే రోజులో రూ. 50వేల కన్నా ఎక్కువ క్యాష్ డిపాజిట్ల కోసం పాన్ కార్డును సబ్మిట్ చేయాలి.
కారు, బైక్ కొంటే పాన్ ఎప్పుడు అవసరమంటే? :
మోటార్ సైకిళ్ళు సహా ఫోర్ వీలర్స్ కొనేటప్పుడు వాహనం ధర రూ. 5 లక్షలు దాటితేనే పాన్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వాహనం ధరతో సంబంధం లేకుండా వెహికల్ కొనేందుకు పాన్ కార్డ్ అవసరం ఉండేది.
తక్కువ ధర వాహనాలు, ద్విచక్ర వాహనాల కొనుగోలుదారులకు ఇకపై పాన్ కార్డు అవసరం ఉండదు. కొనుగోలు విలువ ఆధారంగా పాన్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే టీవీలర్ వాహనాలకు పాన్ అవసరం లేదు.
చిన్న హోటల్, ఈవెంట్ పేమెంట్లకు రిలీఫ్ :
ముసాయిదా నిబంధనలను అమోదిస్తే.. ఇకపై హాస్పిటాలిటీ, ఈవెంట్స్ రంగంలో కూడా భారీ మార్పులు రానున్నాయి. హోటల్, రెస్టారెంట్, బాంకెట్ హాల్, కన్వెన్షన్ సెంటర్ లేదా ఈవెంట్ మేనేజర్‌కు చెల్లింపు రూ. 1 లక్ష దాటితేనే పాన్ కార్డ్ అవసరం.
ప్రస్తుత నిబంధనల ప్రకారం.. రూ. 50వేలు దాటిన హోటల్ లేదా రెస్టారెంట్ బిల్లులకు పాన్ అవసరం. పరిమితిని రెట్టింపు చేయడం వల్ల కస్టమర్లు అదనపు డాక్యుమెంటేషన్ లేకుండా చిన్న మొత్తంలో బిల్లులను ఈజీగా పేమెంట్ చేయొచ్చు.
రియల్ ఎస్టేట్ డీల్స్ కోసం కొత్త పాన్ లిమిట్ :
మీరు కొనుగోలు చేసే, విక్రయించే, గిఫ్ట్‌గా ఇచ్చే లేదా ఏదైనా సంబంధిత జాయింట్ డెవలప్ మెంట్ డీల్ వాల్యూ రూ. 20 లక్షలు దాటితే, పాన్ కార్డ్‌ను తప్పనిసరిగా సమర్పించాలి. ప్రస్తుతం, ఈ పరిమితి రూ. 10 లక్షలుగా ఉంది.
బీమా సంబంధిత మార్పులివే :
కొత్త ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం.. ఇన్సూరెన్స్ రంగంలో కూడా భారీగా మార్పులు రానున్నాయి. బీమా కంపెనీతో అకౌంట్ ఆధారిత పాన్ తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో జీవిత బీమా ప్రీమియం రూ. 50వేలు దాటితేనే పాన్ అవసరం. ఇకపై అలా కాదు.
బీమా కంపెనీ నుంచి పాలసీ తీసుకోవడం, ప్రీమియం చెల్లించడం, క్లెయిమ్ డబ్బులు పొందడం వంటి అన్ని లావాదేవీల కోసం ఒక అధికారిక అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఆ అకౌంట్ ద్వారానే అన్నీ బీమా లావాదేవీలు జరుగుతాయి అనమాట.
ఇంటి అద్దె భత్యం :
ఇంటి అద్దె భత్యం (HRA) క్లెయిమ్ చేసే వారికి కేటగిరీ-1 మెట్రోపాలిటన్ సిటీల జాబితాను విస్తరించారు. బెంగళూరు, పూణే, అహ్మదాబాద్, హైదరాబాద్ ఈ విభాగంలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలతో చేరాయి. దాంతో ఎక్కువ నగరాలకు చెందిన నివాసితులు హెచ్ఆర్ఏ సంబంధింత ప్రయోజనాలను ఎక్కువగా పొందవచ్చు.
