Egg Prices Hike: సామాన్యులకు కోడిగుడ్డు షాక్.. భారీగా పెరిగిన ధరలు.. ఏకంగా రూ.16కి చేరింది
కోడిగుడ్డు ధరలు (Egg Prices Hike)మళ్లీ భగ్గుమంటుండగా, అతితక్కువ కాలంలోనే ఏకంగా రూ.16 పెరగడంతో సామాన్యులు షాక్ అవుతున్నారు.
- V Santhosh Kumar
- Updated on- November 13, 2026 / 12:12 PM IST
Egg prices surge sharply in telugu states dozen reaches rs 96
Egg Prices Hike: ఇప్పటికే నిత్యావసర సరుకులు, కూరగాయల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కోడిగుడ్డు ధరలు మరోసారి గట్టి షాక్ ఇస్తున్నాయి. గత మూడు నెలలుగా స్థిరంగా కొనసాగుతూ పేదవాడి పౌష్టికాహారానికి కాస్త ఊరటనిచ్చిన గుడ్డు (Egg Prices Hike)ధర, గత కొద్ది రోజులుగా మళ్లీ అమాంతం ఎగబాకుతూ సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుతోంది. ఆగస్టు మొదటి వారంలో తగ్గి డజన్ రూ.80 వద్ద నిలకడగా కొనసాగిన హోల్‌సేల్ ధర, నాలుగైదు రోజుల క్రితం రూ.90కి చేరి, ప్రస్తుతం ఏకంగా రూ.96 వద్దకు దూసుకెళ్లింది. ఇలా అత్యంత స్వల్ప వ్యవధిలోనే డజన్‌పై రూ.16 మేర ధర పెరగడంతో సామాన్య వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Nestle CEO Fired: ఆఫీస్ రొమాన్స్‌లతో ఊడిపోతున్న సీఈఓల పదవులు.. కార్పొరేట్ ప్రపంచంలో సరికొత్త చర్చ!
రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు రూ.8.. తలకిందులవుతున్న కుటుంబ బడ్జెట్:
హోల్‌సేల్ మార్కెట్లో పెరిగిన ధరల ప్రభావం స్థానిక రిటైల్ దుకాణాలపై స్పష్టంగా కనిపిస్తోంది. మొన్నటి వరకు బహిరంగ మార్కెట్లో రూ.6 నుంచి రూ.7 మధ్య పలికిన ఒక్కో కోడిగుడ్డు ధర, ప్రస్తుతం రూ.7.50 నుంచి రూ.8 వరకు విక్రయిస్తున్నారు. రోజువారీ ఆహారంలో గుడ్డును భాగం చేసుకునే పేద, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్ ఈ పెరుగుదలతో పూర్తిగా తలకిందులవుతోంది.
ఎల్‌నినో ప్రభావంతో బియ్యం, కూరగాయల ధరలకు రెక్కలు.. అందుకే గుడ్డు ధర కూడా!
మరోవైపు ఎల్‌నినో ప్రభావం కారణంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసరాల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. నెల క్రితం క్వింటాల్ రూ.5,600 నుంచి రూ.6,400 పలికిన సన్న బియ్యం ధర ప్రస్తుతం రూ.6,600 నుంచి ఏకంగా రూ.8,000 వరకు చేరుకుంది. అలాగే కిలో రూ.20 ఉన్న కూరగాయల ధరలు రూ.60కి ఎగబాకాయి. పప్పులు, వంట నూనెల ధరలు కూడా ఇదే స్థాయిలో భగ్గుమంటున్న నేపథ్యంలో దాణా ఖర్చులు పెరిగి పౌల్ట్రీ ఉత్పత్తుల ధరలు కూడా పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
