Starlink-Grok AI : స్టార్‌లింక్ ఎంట్రీకి అడుగడుగునా అడ్డంకులు.. మస్క్ సొంత గ్రోక్ ఏఐ చెప్పిన షాకింగ్ విషయాలివే!
Starlink-Grok AI : స్టార్‌లింక్ భారత్‌లోకి రావడానికి ఎందుకు ఆలస్యమవుతోంది? మస్క్‌కు చెందిన గ్రోక్ ఏఐ చెప్పిన జాతీయ భద్రతా ఆందోళనలు, డేటా సార్వభౌమత్వం, అధిక ధరలు, ప్రభుత్వ అనుమతుల వివరాలపై ఓసారి లుక్కేయండి..
- Sreehari A
- Published on- October 9, 2026 / 04:22 PM IST
Starlink-Grok AI
- భారత్‌లో స్టార్‌లింక్‌కు ఎందుకింత అడ్డంకులు?
- జాతీయ భద్రతపై గ్రోక్ ఏఐ హెచ్చరికలు!
- స్టార్‌లింక్‌తో డేటా భద్రతకు ప్రమాదమా?
- భారత్‌లో స్టార్‌లింక్ ఎంట్రీ ఎప్పుడు?
Starlink-Grok AI : ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఇంకా అడ్డంకులు తొలగడం లేదు. ఏదో ఒక కారణంతో ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల ప్రారంభం వాయిదా పడుతూనే ఉంది.
తాజాగా మస్క్ సొంత సంస్థ xAI రూపొందించిన గ్రోక్ ఏఐ చాట్‌బాట్ కూడా స్టార్‌లింక్ భారత్‌లోకి వస్తే ఎదురయ్యే కొన్ని ప్రమాదాలను లేవనెత్తడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా జాతీయ భద్రతకు ముప్పు, డేటా సార్వభౌమత్వం, అధిక ఖర్చులు వంటి అంశాలను ఈ ఏఐ ప్రస్తావించింది.
స్టార్‌లింక్‌తో జాతీయ భద్రతకు ముప్పు ఉందా? :
అక్టోబర్ 9న ఎక్స్ (X) వేదికగా స్టార్‌లింక్‌ను భారత్‌లో అనుమతించడం వల్ల కలిగే నష్టాలను వివరించాలని గ్రోక్‌ను కోరారు. దీనిపై స్పందించిన ఏఐ చాట్‌బాట్.. జాతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనలను ప్రధానంగా ప్రస్తావించింది.
స్టార్‌లింక్ అమెరికాకు చెందిన సంస్థ కావడం, ఆ సంస్థ కార్యకలాపాలపై విదేశీ సంస్థకు నియంత్రణ ఉంటుంది. సంక్షోభ సమయాల్లో సేవలను నిలిపివేయడం లేదా పర్యవేక్షించడం వంటి అంశాల్లో భారత్‌కు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. శాటిలైట్ల మధ్య సమాచార మార్పిడి కారణంగా డేటా భారతీయ గేట్‌వేల వెలుపలికి వెళ్లే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది.
Read Also : Garuda Map App : తిరుమలలో దారి తెలియదా? ‘గరుడ మ్యాప్’ యాప్ ఉంటే చాలు.. పూర్తి గైడ్ మీకోసం..!
సున్నిత ప్రాంతాల్లోనూ సమస్యలే :
మణిపూర్, అండమాన్ వంటి సున్నిత ప్రాంతాల్లో శాటిలైట్ ఇంటర్నెట్ వినియోగం భద్రతాపరమైన ప్రశ్నలను లేవనెత్తవచ్చని గ్రోక్ పేర్కొంది. గతంలో అక్కడ పరికరాల స్వాధీనం, సరిహద్దులకు సమీపంలో అనధికార వినియోగం వంటి అంశాలను ప్రస్తావించింది. అయితే, గ్రోక్ వెల్లడించిన ఆందోళనలు మాత్రమే. స్టార్‌లింక్‌పై ప్రభుత్వం అధికారికంగా నిర్ధారించిన భద్రతా ముప్పులుగా భావించకూడదు.
ధరలు ఎక్కువ.. డేటాపైనా ఆందోళనలు :
స్టార్‌లింక్ డివైజ్‌ల కొనుగోలు ఖర్చు, నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ధరలు సంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ సేవల కన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో గ్రామీణ ప్రాంతాలకు ఫాస్ట్ ఇంటర్నెట్ అందించాలన్న లక్ష్యం ఉన్నప్పటికీ, సామాన్యులకు ఈ సేవలు అందుబాటులో ఉండటం కష్టమవచ్చు.
అంతేకాదు.. భారతీయుల డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? దానిపై కంట్రోలింగ్ ఎవరిది? అనే డేటా సార్వభౌమత్వ అంశాలనూ గ్రోక్ ప్రస్తావించింది. దేశీయ ప్రత్యామ్నాయాలు ఉండగా, ఒకే విదేశీ సంస్థపై ఎక్కువగా ఆధారపడటం కూడా మరో ఆందోళనగా పేర్కొంది.
అనుమతులు పొందడం కష్టమే :
స్టార్‌లింక్ అనేది మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ కాగా, గ్రోక్‌ను డెవలప్ చేసింది ఆయన స్థాపించిన xAI. అక్టోబర్ 8న భారత ప్రభుత్వం మస్క్‌కు స్పందిస్తూ, శాటిలైట్ సమాచార సేవలకు సంబంధించిన నియంత్రణ విధానం నిష్పక్షపాతంగా, వివక్ష లేకుండా ఉంటుందని స్పష్టం చేసింది. స్టార్‌లింక్‌తో పాటు ఇతర శాటిలైట్ సేవల సంస్థలూ భద్రతా పరిశీలనలను ఎదుర్కొంటున్నాయని తెలిపింది.
అంటే.. స్టార్‌లింక్ రాకకు సంబంధించి లైసెన్సులు, భద్రతా అనుమతులు, నియంత్రణ నిబంధనలు కీలకంగా మారాయి. గ్రోక్ చెప్పినవి సంభావ్య ప్రమాదాలపై ఏఐ రూపొందించిన విశ్లేషణ మాత్రమే. ప్రభుత్వ అధికారిక రిపోర్టు కాదు, స్టార్‌లింక్ చేసిన ప్రకటన కూడా కాదు. భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? అనేది అవసరమైన అనుమతుల ప్రక్రియపైనే ఆధారపడి ఉంది.
