క్రికెట్ ఫ్యాన్స్ కోసం ఐసీసీతో ఫేస్‌బుక్‌ ఒప్పందం

  • Publish Date - September 27, 2019 / 07:32 AM IST

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఆసియాలో జరిగే ఐసీసీ గ్లోబల్ ఈవెంట్స్‌కు సంబంధించిన డిజిటల్ కంటెంట్ రైట్స్ ను ఫేస్ బుక్ దక్కించుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 2023 వరకు మ్యాచ్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం ఫేస్‌బుక్‌లో దొరకనుంది.

అంటే వచ్చే నాలుగేళ్లలో మొత్తం 12 టోర్నమెంట్ లకు సంబంధించిన మ్యాచుల వీడియో కంటెంట్ డిజిటల్ హక్కులను ఫేస్ బుక్ ప్రచారం చేసుకోనుంది. మ్యాచ్ పూర్తయ్యాక రీప్లేలు, ఆటలో కీలకమైన ఘట్టాలను ఆసియాలో ప్రసారం చేసుకునేందుకు డిజిటల్ హక్కులను ఫేస్ బుక్ కైవసం చేసుకుంది.

వీటిలో మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2020, 2021  సంవత్సరాల టోర్నమెంట్లతోపాటు ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2020, 2022, ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2021, మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2023 కూడా ఉన్నాయి. భారత్‌లో డిజిటల్ కంటెంట్‌కు బాగా డిమాండ్ పెరగగా ఫేస్‌బుక్ ఐసీసీతో ఈ మేరకు డీల్‌ను దక్కించుకుంది. ఈ డిజిటల్ హక్కుల కోసం పలు కంపెనీలు పోటీ పడగా.. పోటీలో జుకర్‌బర్గ్ కంపెనీ అత్యధిక ధరకు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఈ సంధర్భంగా మాట్లాడిన ఫేస్‌బుక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్.. ఐసీసీతో ఇటువంటి ఒప్పందం చేసుకోవడం తమకెంతో సంతోషంగా ఉందని,  క్రికెట్‌ ప్రియులను అలరించడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని అన్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా క్రిడాభిమానులకు క్రికెట్ విశేషాలను దగ్గర చేస్తామని అన్నారు అజిత్.