Gold Rates Today ( Image Credit : Google Gemini AI )
Gold Rates : బంగారం.. భారతీయులకు భారీ సెంటిమెంట్.. అలాంటి బంగారం తగ్గిందంటే వెంటనే కొనేద్దామని చూస్తుంటారు. బంగారం కేవలం ఆభరణంగా కాకుండా భవిష్యత్తుకి భద్రమైన పెట్టుబడి కూడా భావిస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండుగలతో పాటు ఆర్థిక భద్రత కోసం చాలామంది బంగారాన్ని తెగ కొనేస్తుంటారు.
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ సమయంలో బంగారం ధరలు మరింత తగ్గుతాయా? అంతకంతకూ పెరుగుతూ పోతాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది. బంగారం ధరలు ఇప్పుడు బులియన్ మార్కెట్లో నిజంగానే రూ. 2 లక్షల మైలురాయిని చేరుకుంటాయా? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రపంచ మార్కెట్లలో మారే పరిస్థితులను ఒకసారి పరిశీలిస్తే.. బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవలే మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో కూడా బంగారం ధరలు దిగివస్తాయని కొనుగోలుదారులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. అమెరికా డాలర్ బలహీనపడటం కూడా బంగారానికి ఫుల్ డిమాండ్ పెరిగింది. దాంతో దేశీయ మార్కెట్లో 10 గ్రాములకు గోల్డ్ ధర సుమారు రూ. 1,62,000కు చేరుకుంది.
అయినప్పటికీ, జీవితకాల గరిష్ట స్థాయి రూ. 1,80,779 కన్నా దాదాపు రూ. 18,000 ఇంకా తక్కువగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం కొనాలని చూస్తున్న సాధారణ ప్రజలు, బంగారాన్ని కేవలం పెట్టుబడిగా చూసే ఇన్వెస్టర్లు సైతం బులియన్ మార్కెట్‌ను నిశితంగా గమనిస్తున్నారు. ఇంతకీ బంగారం ఇప్పుడే కొనాలా? లేదా ఇంకొంచెం వేచి చూడాలా? అనే సందేహం చాలామందిలో వ్యక్తమవుతోంది.
ఇరాన్‌తో వివాదం అతి త్వరలోనే ముగిసే ఛాన్స్ ఉందంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో బులియన్ మార్కెట్లలో భారీ చర్చకు దారితీసింది. సాధారణంగా యుద్ధం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి పెరిగితే పెట్టుబడిదారులు ‘సేఫ్ హేవెన్’గా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే ఉద్రిక్తతలు తగ్గి డాలర్ బలహీనపడితే బంగారం ఇతర కరెన్సీల పెట్టుబడిదారులకు అత్యంత చౌకగా లభిస్తుంది. దీని కారణంగా బంగారం ధరలకు మళ్లీ పెరగొచ్చు.
డాలర్ బలహీనతతో బంగారానికి బలం :
అమెరికా డాలర్ బలహీనపడటం వల్ల కూడా బంగారం ధరలు పెరగడానికి మరో ముఖ్య కారణంగా చెప్పవచ్చు. డాలర్ విలువ ఎప్పుడైనా తగ్గితే బంగారం కొనేందుకు ప్రపంచ పెట్టుబడిదారులకు చాలా ఈజీ అవుతుంది.
అదేవిధంగా, చమురు ధరలు కూడా తగ్గడంతో ద్రవ్యోల్బణ భయాలు కొంతవరకు తగ్గాయి. ఈ నేపథ్యంలో కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు కూడా భారీగా తగ్గుతాయి. వడ్డీ రాబడి లేని బంగారం ఒక్కసారిగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
స్వల్పకాలంలో స్థిరమైన ధరలు :
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుతం బంగారం బలంగా ఉన్నా తక్షణమే కొత్త రికార్డులను సృష్టించే అవకాశం చాలా తక్కువే. ఇదే బంగారం ధరలు ఒకేమాదిరిగా కొంతకాలం కదిలే అవకాశం లేకపోలేదు. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ఔన్సుకు 5,250 డాలర్ల నుంచి 5,300 డాలర్ల మధ్యకు వెళ్లే అవకాశం ఉందని అంచనా. అదే సమయంలో 5వేల డాలర్ల స్థాయి వద్ద బంగారం మరింత బలపడేలా కనిపిస్తోంది.
దీర్ఘకాలికంగా పరిశీలిస్తే.. బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడంతో పాటు ప్రపంచ రుణాలు పెరగడం, డాలర్‌పై ఆధారపడకుండా చేయొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం ధరలకు మరింత బలాన్ని ఇస్తాయి.
ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే మాత్రం అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఔన్సుకు 5,600 డాలర్లు దాటవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో భారత మార్కెట్లో కూడా 10 గ్రాముల ధర రూ. 2 లక్షలకు చేరుకుంటుందని అంచనా.
మొత్తంగా పరిశీలిస్తే.. బంగారం ధరలు పెంపు ఇక్కడితో ఆగదు. మళ్లీ ఎగబాకే ముందు కొంతవరకు ధరల్లో హెచ్చుతగ్గులు ఉండొచ్చు. అమెరికా డాలర్ ప్రభావం, ప్రపంచ వడ్డీ రేట్లు, మధ్యప్రాచ్యంలో యుద్ధ, రాజకీయ పరిస్థితులు కూడా బంగారం భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.
బంగారంపై పెట్టుబడిదారులు కూడా తొందరపడకుండా బులియన్ మార్కెట్ సంకేతాలను అంచనా వేయడం ఎంతైనా మంచిది. ఏది ఏమైనా సరైన సమయం వస్తే మాత్రం బంగారం నిజంగానే రూ. 2 లక్షల హిస్టరీని క్రియేట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.