Smartphone Screen Protectors : కేంద్రం కొత్త రూల్స్.. ఇక నాసిరకం స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ గార్డులకు చెక్.. BIS సర్టిఫికేట్ మస్ట్!
Smartphone Screen Protectors : స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లకు 2027 ఏప్రిల్ నుంచి BIS రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. నాణ్యతా ప్రమాణాలు, దేశీయ తయారీకి ఊతమిచ్చే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది.. పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published on- September 22, 2026 / 07:27 PM IST
Smartphone Screen Protectors
- స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లకు బీఐఎస్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
- స్క్రీన్ ప్రొటెక్టర్లకు కొత్త రూల్.. బీఐఎస్ లేకుంటే అమ్మకాలు బంద్
- 2027 నుంచి స్క్రీన్ ప్రొటెక్టర్లకు కొత్త రూల్స్.. ఏమిటవి?
- మీ ఫోన్ స్క్రీన్ గార్డుకూ ఇక ప్రభుత్వ సర్టిఫికేట్ తప్పనిసరి
Smartphone Screen Protectors : స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై మీ ఫోన్ స్క్రీన్ గార్డు మరింత ప్రొటెక్ట్ కానుంది. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్ల నాణ్యతపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2027, ఏప్రిల్ 1 నుంచి స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేట్ తప్పనిసరి చేస్తూ కేంద్రం సెప్టెంబర్ 21న నోటిఫికేషన్ జారీ చేసింది.
దీని ప్రకారం.. భారత్‌లో స్క్రీన్ ప్రొటెక్టర్లను విక్రయించే ముందు సంస్థలు తప్పనిసరిగా (IS 19348:2025) అనే భారతీయ ప్రమాణానికి అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేసి, రిజిస్ట్రేషన్ పొందాల్సి ఉంటుంది.
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గూడ్స్ (కంపల్సరీ రిజిస్ట్రేషన్) ఆర్డర్, 2021 కింద ఇప్పటికే స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, చార్జర్లు, ఎల్‌ఈడీ టీవీలు వంటి 65 ప్రొడక్టులు ఉండగా, తాజాగా స్క్రీన్ ప్రొటెక్టర్లను 66వ అంశంగా చేర్చారు.
ప్రభుత్వం అసలు టార్గెట్ ఇదే :
ఈ నిబంధన తీసుకురావడం వెనుక ప్రధాన లక్ష్యం నాసిరకం, తక్కువ నాణ్యత గల స్క్రీన్ ప్రొటెక్టర్ల అమ్మకాలను అరికట్టడమే. తద్వారా మార్కెట్లో వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
అంతేకాదు.. నోయిడాలో తయారీ యూనిట్ ఏర్పాటు చేసిన ఆప్టిమస్ ఇన్‌ఫ్రాకామ్ వంటి దేశీయ తయారీదారులకు మద్దతుగా నిలుస్తుందని భావిస్తోంది. అమెరికాకు చెందిన కార్నింగ్ టెక్నాలజీతో టెంపర్డ్ గ్లాస్ ప్రొటెక్టర్లను ఆప్టిమస్ తయారు చేస్తోంది. ఈ రిజిస్ట్రేషన్ నిబంధన కారణంగా అదనంగా 2 కోట్ల యూనిట్ల సామర్థ్యం పెంచుకోవాలని యోచిస్తోంది.
మొబైల్ తయారీదారుల సంఘం (ICEA) ఛైర్మన్ పంకజ్ మొహింద్రూ మాట్లాడుతూ.. ప్రతి ఏటా 50 కోట్లకు పైగా యూనిట్ల మార్కెట్‌తో ఈ చర్య రూ. 12వేల నుంచి రూ.16వేల కోట్ల నాణ్యతాధారిత పరిశ్రమను ప్రోత్సహిస్తుందని, సుమారు 60వేలు ఉద్యోగాలు సృష్టించడంతో పాటు రూ. 2వేల కోట్ల జీఎస్టీ ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు.
కొత్త స్క్రీన్ ప్రొటెక్టర్లకు వర్తింపు :
ఇక ప్రస్తుత ఫోన్ల విషయానికొస్తే.. ఈ నిబంధన 2027 ఏప్రిల్ 1 నుంచి కొత్తగా విక్రయించే స్క్రీన్ ప్రొటెక్టర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే వాడుతున్న ఫోన్లు, వాటిపై ప్రొటెక్టర్లపై ఎలాంటి ప్రభావం ఉండదు. దేశీయ మార్కెట్ 2025 నాటికి 40 కోట్ల యూనిట్లు, రూ. 20వేల కోట్ల విలువతో ఉందని అంచనా.
