EDLI Insurance Scheme
EDLI Insurance Scheme : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కింద ఇప్పుడు ఉచిత బీమాను కూడా పొందవచ్చు. కేవలం పీఎఫ్ అనేది రిటైర్మెంట్ ఫండ్ మాత్రమే కాదు.. రూ. 7 లక్షల వరకు ఉచిత బీమాను కూడా అందిస్తుంది. అయితే, పీఎఫ్ అకౌంట్ ఉచిత జీవిత బీమా కవరేజ్‌తో కూడా వస్తుందని చాలామందికి తెలియకపోవచ్చు.
వాస్తవానికి, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) అనే పథకం అందుబాటులో ఉంది. ఈ పథకం కింద ఒక ఉద్యోగి అకాల మరణం చెందితే వారి కుటుంబం రూ. 7 లక్షల వరకు బీమా కవరేజీని పొందుతుంది. ప్రత్యేక విషయం ఏమిటంటే.. ఉద్యోగి ఇందుకోసం ఎలాంటి అదనపు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.
పథకం ముఖ్య ప్రయోజనాలేంటి? :
ఈడీఎల్ఐ పథకం కింద మీ బీమా మొత్తాన్ని ఉద్యోగి గత 12 నెలల సగటు జీతం, డియర్‌నెస్ అలవెన్స్ (DA) ఆధారంగా నిర్ణయిస్తారు. కనీస బీమా మొత్తం రూ. 2.5 లక్షలు, గరిష్ట పరిమితి రూ. 7 లక్షలు. యజమాని మొత్తం ప్రీమియం చెల్లించాలి. అంటే.. ఉద్యోగి ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
Read Also : Apple iPhone Air : వాలెంటైన్స్ డే ఆఫర్.. ఈ ఆపిల్ ఐఫోన్ ఎయిర్‌పై ఏకంగా రూ. 25వేలు డిస్కౌంట్, ఇలా కొన్నారంటే?
ఎవరికి ప్రయోజనం ఎక్కువంటే? :
ఒక ఈపీఎఫ్ సభ్యుడు ఉద్యోగం చేస్తున్నప్పుడు మరణిస్తే వారి నామినీ లేదా చట్టపరమైన వారసుడు ఈ బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. పీఎఫ్ పొందే అన్ని వ్యవస్థీకృత రంగ ఉద్యోగులకు ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. అంటే.. మీకు ప్రతినెలా పీఎఫ్ అమౌంట్ కట్ అయితే చాలు.. ఆటోమాటిక్‌గా మీరు ఈ ఉచిత బీమా పథకానికి అర్హులు అవుతారు.
ఇన్సూరెన్స్ మొత్తాన్ని పొందడానికి నామినీ ఫారమ్ 5IFని నింపి సమర్పించాలి. ఈ ఫారమ్ ఎంప్లాయిర్ ద్వారా ఈపీఎఫ్ఓ కార్యాలయానికి పంపుతారు. డెత్ సర్టిఫికేట్, నామినీ ఐడింటెటీ ప్రూఫ్ డాక్యుమెంట్లను కూడా జతచేయాలి. ప్రాసెస్ పూర్తయిన తర్వాత బీమా మొత్తం నేరుగా నామినీ బ్యాంకు అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది.
ఎందుకు ముఖ్యమంటే? :
భారత్‌లో లక్షలాది మంది తమ పీఎఫ్ అకౌంట్ సేవింగ్, రిటైర్మెంట్ ఫండ్‌గా మాత్రమే భావిస్తారు. అయితే, ఈడీఎల్ఐ పథకం ద్వారా పీఎఫ్ ఖాతాదారుల కుటుంబాలకు అదనపు భద్రతా కవరేజీని అందిస్తుంది. ఈ బీమా అకాల మరణం సమయంలో కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. అలాగే క్లిష్ట సమయాల్లో కూడా అత్యంత ప్రయోజనాలను అందిస్తుంది.
ఈపీఎఫ్ఓ ఈడీఎల్ఐ స్కీమ్ కింద ఉద్యోగులకు అద్భుతమైన బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ పథకం ఉద్యోగిని మాత్రమే కాకుండా వారి కుటుంబాన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకే మీ పీఎఫ్ మినహాయింపు గడువు ముగిసి ఉంటే.. వెంటనే నామినీని అప్‌డేట్ చేసుకోండి. ఎందుకంటే.. ఈ ఫీచర్ మీ కుటుంబానికి అండగా నిలుస్తుంది.