IRDAI Insurance Rules : ఇన్సూరెన్స్ తీసుకున్నారా? ఇక పాలసీ వివరాలన్నీ ఒకేచోట.. క్లెయిమ్‌లపై కొత్త రూల్స్!
IRDAI Insurance Rules : బీమా నిబంధనలు మారబోతున్నాయి. ఇక పాలసీదారులకు నో టెన్షన్.. పాలసీకి సంబంధించి పూర్తి సమాచారం ఒకేచోట లభించనుంది. క్లెయిమ్‌లపై కూడా కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.. పూర్తి వివరాలివే..
- Sreehari A
- Updated on- September 4, 2026 / 01:18 PM IST
IRDAI Insurance Rules
- ఇన్సూరెన్స్ కొత్త రూల్స్ రాబోతున్నాయి
- పాలసీ సమాచారం అంతా ఒకేచోట లభించనుంది
- క్లెయిమ్స్ విషయంలో కూడా నిబంధనలివే
IRDAI Insurance Rules : ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారా? లేదా కొత్తగా తీసుకోవాలని చూస్తున్నారా? ఒకవేళ బీమా పాలసీ తీసుకుంటే కవరేజ్ ఎంత? ఏయే పరిస్థితుల్లో బీమా పాలసీ డబ్బు వస్తుంది? అసలు క్లెయిమ్ ఎలా చేయాలి? ఏయే ఆసుపత్రుల్లో క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ అందుతుంది? వంటి వివరాలను తెలుసుకోవడం పాలసీదారులకు కష్టంగా మారుతోంది.
ప్రతిదానికి ఇన్సూరెన్స్ కంపెనీలకు ఫోన్ కాల్ చేసి తెలుసుకోవడం కష్టమే. చాలాసార్లు పాలసీదారులు బీమా కంపెనీ వెబ్‌సైట్, యాప్, పాలసీ డాక్యుమెంట్లు అంటూ చాలా చోట్ల తెగ వెతికేస్తుంటారు. అయినా సరైన సమాచారం దొరుకుతుందనే గ్యారెంటీ లేదు. ఇకపై ఈ సమస్యకు చెక్ పెట్టే దిశగా ఐఆర్‌డీఏఐ (IRDAI) కీలక ప్రతిపాదనతో ముందుకొచ్చింది.
పాలసీ సమాచారం ఒకేచోట.. :
బీమా పాలసీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ప్రజలందరికి ఒకే చోట అందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పబ్లిక్ ఇన్సూరెన్స్ రిజిస్ట్రీ (PIR) అనే డిజిటల్ సిస్టమ్ తీసకురావాలని ఐఆర్డీఏఐ ప్రతిపాదించింది.
ఒకవేళ ఈ డిజిటల్ సిస్టమ్ అమల్లోకి వస్తే.. పాలసీదారులు వివిధ ఇన్సూరెన్స్ సంస్థల వెబ్‌సైట్లలో వెతకాల్సిన అవసరం తగ్గుతుంది. పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు, కవరేజ్, క్లెయిమ్‌కు సంబంధించిన పూర్తి సమాచారం ఒకే చోట పొందవచ్చు.
ఇందులోని ముఖ్యమైన అంశాలను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సిస్టమ్ ప్రతిపాదన దశలోనే ఉంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనిపై ప్రజలు, సంబంధిత వర్గాల నుంచి ఐఆర్డీఏఐ కూడా అభిప్రాయాలను కోరుతోంది.
మీ డేటా సురక్షితమేనా? :
బీమా పాలసీలకు సంబంధించి ఒకే చోట సమాచారం లభిస్తే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అదే సమయంలో వ్యక్తిగత సమాచారం, పాలసీ వివరాల భద్రత కూడా తప్పనిసరి. అందుకే, PIRలో కస్టమర్ల సమ్మతి, డేటా ప్రైవసీ, సాంకేతిక భద్రత వంటి అంశాలపై ఐఆర్డీఏఐ ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది.
3 గంటల క్లెయిమ్ రూల్ :
ఆరోగ్య బీమా పాలసీదారులకు కూడా ఐఆర్డీఏఐ ఇప్పటికే కీలక మార్పులు తీసుకొచ్చింది. నగదు రహిత (Cashless) క్లెయిమ్‌లను వేగంగా పూర్తి చేయడమే దీని ఉద్దేశం. కొత్త నిబంధనల ప్రకారం.. ఆస్పత్రి నుంచి అవసరమైన అభ్యర్థన అందాక ఒక గంటలోపు క్యాష్‌లెస్ ప్రీ-ఆథరైజేషన్ రిక్వెస్ట్‌పై నిర్ణయం తీసుకోవాలి.
అలాగే పేషెంట్ డిశ్చార్జ్ సమయంలో 3 గంటల్లోపు ఫైనల్ అప్రవూల్ ఇవ్వాలి. తద్వారా ఆస్పత్రిలో చికిత్స పూర్తయిన తర్వాత క్లెయిమ్ అప్రూవల్ కోసం పేషెంట్లు, ఫ్యామిలీ మెంబర్లు ఎక్కువసేపు ఎదురుచూడాల్సిన పరిస్థితి తగ్గుతుంది.
పాలసీదారులకు బెనిఫిట్ ఏంటి? :
సింపుల్‌గా చెప్పాలంటే.. బీమా సమాచారం ఒకేచోట లభించడం అనేది పారదర్శకంగా ఉంటుంది. ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు వేగంగా పూర్తి అవుతాయి. ముఖ్యంగా అత్యవసర వైద్య పరిస్థితుల్లో పాలసీదారులకు సమయం, ఇబ్బంది రెండూ తగ్గుతాయి.
అయితే, పీఐఆర్ ఇంకా ప్రతిపాదన దశలో ఉంది. అది ఎప్పుడు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుంది? అందులో ఏయే వివరాలు అందుబాటులో ఉంటాయి? అనే విషయాలపై ఐఆర్డీఏఐ ఫైనల్ డిసిసెన్ తర్వాతే ఫుల్ క్లారిటీ రానుంది.
