ITR Deadline : ITR డెడ్‌లైన్‌పై డౌట్ క్లియర్! జూలై 31నా? ఆగస్టు 31నా? మీ ఆదాయం బట్టి మీ గడువు ఇదే!
ITR Deadline : పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్ -1 గడువు జూలై 31 వరకు ఉంటే.. ఐటీఆర్-3 ఫైల్ చేసే వారికి ఆగస్టు 31 వరకు గడువు ఉంటుంది. ఒక్క నెల వ్యవధి ఎందుకు ఇచ్చారంటే? పూర్తి వివరాలతో ఇప్పుడు తెలుసుకుందాం..
- Sreehari A
- Updated on- July 24, 2026 / 02:49 PM IST
ITR Deadline
- ITR డెడ్‌లైన్ మిస్ అయితే కష్టమే, జూలై 31, ఆగస్టు 31లో మీది ఏది?
- గడువు తేదీ కాకుండా ఆదాయం ఆధారంగా ఐటీఆర్ ఫారమ్‌ను ఎంచుకోండి.
- తప్పుడు ఐటీఆర్ ఫారం దాఖలు చేస్తే పెనాల్టీలు, రిటర్న్ రిజెక్ట్ అవ్వొచ్చు
ITR Deadline : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. ఐటీఆర్ డెడ్‌లైన్ పొడిగించారా? లేదా? మీకూ ఇదే సందేహం ఉందా? వాస్తవానికి ఐటీఆర్ దాఖలుకు గడువు తేదీ జూలై 31వరకు అని అందరికి తెలిసిందే.. కానీ, ఇప్పుడు ఐటీఆర్ గడువు పొడిగించినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఐటీఆర్ ఎప్పుడు దాఖలు చేయాలి? జూలై 31 డెడ్ లైన్ ఉందా? లేదా ఆగస్టు 31 వరకు ఆగి ఐటీఆర్ ఫైల్ చేయొచ్చా? ప్రస్తుతం చాలామంది పన్ను చెల్లింపుదారులకు ఇదే గందరగోళం కనిపిస్తోంది.
ఐటీఆర్-1 ఫైల్ చేసేందుకు జూలై 31 వరకు గడువు ఉండగా, ఐటీఆర్-3కి ఆగస్టు 31 వరకు టైమ్ ఇచ్చారు. ఇలా ఎందుకు ఇచ్చారో తెలియక అనేక మంది టాక్స్ పేయర్లకు అర్థం కావడం లేదు. అంటే.. ఒక నెల అదనపు గడువు కోసం ఎవరైనా ITR-3 ఎంచుకోవచ్చా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అయితే, పన్ను నిపుణుల ప్రకారం.. గడువు ఆధారంగా ఐటీఆర్ ఫారం ఆప్షన్ అసలు మంచిది కాదంటున్నారు. ఆదాయం వచ్చే విధానం, పన్ను చెల్లింపుదారుడి అర్హత ఆధారంగానే సరైన ఫారం ఎంచుకోవాలని సూచిస్తున్నారు.
ఒకవేళ, తప్పుగా ఐటీఆర్ ఫారం దాఖలు చేస్తే.. ఆ రిటర్న్‌ను చెల్లని (Defective Return) రిటర్న్‌గా పరిగణించవచ్చు. ఆ తర్వాత సరైన ఫారంలో రిటర్న్ మళ్లీ చేయాల్సి రావచ్చు. అసలు గడువు తేదీ దాటాక సవరించిన రిటర్న్ ఫైలింగ్ చేస్తే అది ఆలస్యమైన రిటర్న్‌గా పరిగణిస్తారు. తద్వారా వడ్డీ, ఆలస్య రుసుములు, కొన్ని పన్ను ప్రయోజనాలు కూడా కోల్పోవాల్సి రావచ్చు.
Read Also : Vivo S2 Launch Date : వివో లవర్స్ రెడీనా? కొత్త వివో S2 ఫోన్ వస్తోందోచ్.. ఫీచర్లు, ధరపై భారీ అంచనాలివే!
ఐటీఆర్ గడువు తేదీలివే :
ఈసారి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు గడువు పెరిగింది. సాధారణంగా జీతం వంటి ఆదాయ వ్యక్తులు ITR-1, ITR-2 ఫైల్ చేసేందుకు జూలై 31 వరకు గడువు ఉంటుంది. వ్యాపారం లేదా వృత్తి ఆదాయం ఉన్న నాన్-ఆడిట్ టాక్స్ పేయర్లు మాత్రం ITR-3, ITR-4 ఫైల్ చేసేందుకు ఆగస్టు 31 వరకు టైం ఉంటుంది. ఈ ఆగస్టు 31 గడువు అనేది కేవలం పొడిగింపు సమయం కాదని గమనించాలి. ఫ్రీలాన్సర్లు, కన్సల్టెంట్లు, వృత్తి నిపుణులు చిన్న వ్యాపారులు వంటి వ్యాపార లేదా వృత్తి ఆదాయం ఉన్నవారికి ఈ గడువు వర్తిస్తుంది.
ITR-1 (సహజ్) ఎవరికంటే? :
శాలరీ లేదా పెన్షన్ ద్వారా ఆదాయం పొందే సాధారణ వ్యక్తులు ITR-1 ఫైల్ చేయాలి. మొత్తం ఆదాయం రూ.50 లక్షల వరకు ఉండాలి.
ITR-1 వర్తించే వారైతే :
* ఉద్యోగులు
* రెండు వరకు ఇళ్ల ఆస్తుల ద్వారా ఆదాయం
* పెన్షన్ పొందేవారు
* వడ్డీ వంటి ఇతర ఆదాయాలు పొందేవారు
* రూ.5వేల వరకు వ్యవసాయ ఆదాయం ఉంటే
గడువు తేదీ: జూలై 31
ITR-2 ఎవరికంటే? :
వ్యాపారం లేదా వృత్తి ఆదాయం లేని వ్యక్తులు, కానీ ఇతర ఆదాయ మార్గాలు ఉన్నవారు ఐటీఆర్-2 ఫైల్ చేయాలి.
ITR-2 వర్తించే వారైతే :
* షేర్లు, మ్యూచువల్ ఫండ్ల ద్వారా క్యాపిటల్ గెయిన్స్ పొందేవారు
* రెండు కన్నా ఎక్కువ ఇళ్ల నుంచి ఆదాయం పొందేవారు
* విదేశీ ఆస్తులు లేదా విదేశీ ఆదాయం పొందడం
* రూ.50 లక్షలకు పైగా ఆదాయం ఉంటే
* కంపెనీ డైరెక్టర్లు
* వర్చువల్ డిజిటల్ ఆస్తుల ద్వారా ఆదాయం పొందేవారికి వర్తిస్తుంది
గడువు తేదీ: జూలై 31
ITR-3 ఎవరికంటే? :
వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందేవారు ITR-3 ఫైల్ చేయాల్సి ఉంటుంది.
ITR-3 వర్తించే వారైతే :
* ఫ్రీలాన్సర్లు
* వ్యాపారులు
* కన్సల్టెంట్లు
* కమిషన్ ఏజెంట్లు
* భాగస్వామ్య సంస్థల్లో పార్టనర్లు
* డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తి నిపుణులు
వ్యాపార ఆదాయంతో పాటు జీతం, ఇంటి ఆస్తి, క్యాపిటల్ గెయిన్స్, ఇతర ఆదాయాలను కూడా ఈ ఫారంలో చూపించాలి.
గడువు తేదీ : ఆగస్టు 31 (నాన్-ఆడిట్ కేసులు)
ITR-4 ఎవరికంటే? :
చిన్న వ్యాపారులు, వృత్తి నిపుణులు ఊహాత్మక పన్ను విధానం (Presumptive Tax Scheme) కింద రిటర్న్ దాఖలు చేసేవారు ITR-4 ఎంచుకోవచ్చు.
ITR-4 వర్తించే వారైతే :
* సెక్షన్ 44AD కింద చిన్న వ్యాపారులు
* సెక్షన్ 44ADA కింద ప్రొఫెషనల్స్
* సెక్షన్ 44AE కింద రవాణా వ్యాపారులు
అయితే, ఆదాయం రూ.50 లక్షల లోపు ఉండాలి. నిబంధనలకు సరిపోని వారు అయితే ఐటీఆర్-3 దాఖలు చేయక తప్పదు.
గడువు తేదీ : ఆగస్టు 31
ఫారం ఎంచుకుంటే జాగ్రత్త :
ఐటీఆర్ ఫారం ఎంపికలో పన్ను చెల్లింపుదారులు పొరపాట్లు చేస్తుంటారు. గడువు తేదీ ఒక్కటే చూడొద్ద.. ఆదాయ వనరులను కూడా లెక్కలోకి తీసుకోవాలి. కేవలం నెల అదనపు గడువు పెంచుకోవడం కోసం ITR-3 లేదా ITR-4 దాఖలు చేయడం సరికాదు..
అలాగే, తప్పు ఫారం దాఖలు చేస్తే.. మీ రిటర్న్ రిజెక్ట్ అవ్వడమే కాదు.. ఆలస్య రుసుములు, వడ్డీ ఛార్జీలు, పన్ను ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుంది. లేదంటే ఐటీ నోటీసులు అందుకోవాల్సి వస్తుంది. అందుకే టాక్స్ పేయర్లు ముందుగా తమ ఆదాయ వివరాలను పరిశీలించుకోవాలి. తమకు వర్తించే సరైన ఐటీఆర్ ఫారాన్ని మాత్రమే ఎంచుకుని నిర్ణీత గడువులోగా ఐటీ రిటర్న్ దాఖలు చేయడమే బెటర్.
