Jupally Rameswar Rao : ఫోర్బ్స్-2026 రియల్ ఎస్టేట్ బిలియనీర్ల జాబితాలో జూపల్లి రామేశ్వరరావు
Jupally Rameswar Rao : మైహోమ్ గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు అరుదైన ఘనత సాధించారు. ఆ వివరాలు..
- Dharani Pilli
- Updated on- May 26, 2026 / 09:02 PM IST
jupally Rameswar Rao Features in Forbes 2026 Real Estate Billionaires List
Jupally Rameswar Rao : వ్యాపార రంగంలో వేలాది మందికి ఉపాధినందిస్తూ ప్రశంసలు అందుకుంటోన్న మైహోమ్ గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావుకు మరో అరుదైన ఘనత లభించింది. ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్-2026 రియల్ ఎస్టేట్ బిలియనీర్ల జాబితాలో జూపల్లి రామేశ్వరరావు ఆరో స్థానంలో నిలిచారు. రియాల్టీతో పాటు ఆధ్యాత్మిక, సేవల రంగంలో ఘనకీర్తి సంపాదించుకున్న జూపల్లి రామేశ్వరరావు.. ఫోర్బ్స్ జాబితాలో మరోసారి స్థానం సంపాదించి తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచారు.
ఎంతో కఠినమైన వడపోత, పారదర్శకతతో ప్రకటించే ఫోర్బ్స్ జాబితా విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచింది. సరళంగా చెప్పాలంటే సినిమా రంగానికి “ఆస్కార్” ఎంతో ప్రతిష్ఠాత్మకమో.. వ్యాపార, వ్యవస్థాపకత, లీడర్‌షిప్ రంగాలకు “ఫోర్బ్స్” అంత ప్రెస్టిజియస్‌గా చెప్పొచ్చు. ఫోర్బ్స్ జాబితాలో స్థానం అంటే వ్యక్తి కష్టానికి, ప్రతిభకు దక్కే అత్యున్నత ప్రపంచ స్థాయి సర్టిఫికెట్ అన్నమాట.
ఫోర్బ్స్ 2026 బిలియనీర్ల జాబితాలో భారత రియల్ ఎస్టేట్ రంగం ప్రత్యేక గుర్తింపు పొందింది. దేశంలోని ప్రముఖ రియల్టీ వ్యాపారవేత్తలు ప్రపంచ స్థాయి ధనవంతుల జాబితాలో చోటు సంపాదించారు. ఈ జాబితాలో డీఎల్‌ఎఫ్ మాజీ ఛైర్మన్, సీఈఓ కుశాల్ పాల్ సింగ్ మొదటి స్థానంలో నిలిచారు. ఇక నాలుగు దశాబ్దాలకు పైగా రియాల్టీ రంగంలో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధినందిస్తోన్న హైదరాబాద్‌కు చెందిన మైహోమ్ గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు మరోసారి ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు.
సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి..
తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా కుడికిళ్ల అనే ఓ చిన్న గ్రామం నుంచి వచ్చిన జూపల్లి రామేశ్వరరావు.. అతి తక్కువ సమయంలోనే అత్యున్నత స్థాయికి ఎదిగారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన జూపల్లి రామేశ్వరరావు 1979లో హోమియో డాక్టర్‌గా ప్రయాణం ప్రారంభించి, 1981లో రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించారు. విలువలే పునాదిగా 1986లో మైహోమ్ పేరుతో కేవలం 50 వేల రూపాయలతో నిర్మాణ సంస్థను ప్రారంభించి అంచలంచెలుగా మహా సామ్రాజ్యంగా తీర్చిదిద్దారు. నిర్మాణంతో పాటు మహా సిమెంట్స్ పేరుతో సిమెంటు పరిశ్రమను స్థాపించారు. కష్టపడేతత్వం, దూరదృష్టితో వ్యాపార రంగంలో అడుగు పెట్టి.. వేల కోట్ల టర్నోవర్‌తో మై హోమ్ గ్రూప్ సంస్థను తీర్చిదిద్దారు. ఒక సాదాసీదా డాక్టర్.. దేశం గర్వించే పారిశ్రామికవేత్తగా ఎదగడం ఆయన పట్టుదలకు నిదర్శనంగా చెప్పొచ్చు.
నాణ్యతకు పెద్ద పీట..
మైహోమ్ గ్రూప్ సాధించిన విజయాల వెనుక హార్డ్ వర్క్‌తో పాటు ప్యాషన్ ఉందంటారు డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు. లక్ష్యాలను అందుకోవడంలో సహచరులు, ఉద్యోగుల పాత్ర కీలకమని ఆయన చెబుతారు. తెలుగు రాష్ట్రాల్లో నాణ్యమైన నిర్మాణ సంస్థ ఉండాలన్న సంకల్పంతో, దానికి తానే ముందడుగు వేయాలన్న దృఢనిశ్చయంతో మైహోమ్ గ్రూప్‌ని స్థాపించారు. నాలుగు దశాబ్దాలకు పైగా నిర్మాణ రంగమైనా, సిమెంట్ సెక్టార్ అయినా.. క్వాలిటీ, సేఫ్టీ, సస్టైనబిలిటీకి పెద్దపీట వేస్తూ సంస్థను అంచలంచెలుగా తీర్చిదిద్దారు. నిర్మాణంలో నాణ్యత, నివాసంలో భద్రతకు పెద్ద పీట వేయడంతో భారత నిర్మాణరంగంలో అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటిగా మైహోమ్ గ్రూప్‌ను నిలబెట్టారు.
ఇప్పుడు మైహోమ్ నిర్మాణం ఎల్లలుదాటి “మై కంట్రీ ఈజ్ మై హోమ్” అనే నినాదంతో ఇప్పటి వరకు ఎలాంటి విలువలు పాటించారో.. వాటిని నిలబెట్టుకుంటూ మరింత వేగంగా విస్తరిస్తోంది. దేశీయ రియాల్టీ రంగంలో మైహోమ్ ప్రాజెక్ట్స్ అంటే ఒక నమ్మకం. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకపోవడం డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు నైజం. హామీ ఇచ్చిన సమయంలోగా ప్రాజెక్టులను పూర్తి చేసి కస్టమర్లకు హ్యాండోవర్ చేయడం ఆయన స్పెషాలిటీ. అందుకే ఆయన రియాల్టీ రంగంలో తిరుగులేని నమ్మకాన్ని సంపాదించుకుని ప్రత్యర్థులతో కూడా శభాష్ అనిపించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో యువ వ్యాపారవేత్తలకు ఆయన ఒక రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు.
1991లో మంజరితో ప్రారంభమై..
రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ సెగ్మెంట్లలో 21 భారీ ప్రాజెక్టులను మైహోమ్ గ్రూప్ విజయవంతంగా పూర్తిచేసింది. ఈ నిర్మాణాలతో 26 మిలియన్ స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియాతో చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం 11 మిలియన్ స్క్వేర్ ఫీట్ విస్తీర్ణం నిర్మాణంలో ఉంది. మరో 10 మిలియన్ స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణం ప్లానింగ్ దశలో ఉంది. సంస్థ చేపట్టిన ప్రాజెక్టుల విషయానికి వస్తే మైహోమ్ కన్‌స్ట్రక్షన్స్ ప్రస్థానం 1991లో మైహోమ్ మంజరితో ప్రారంభమైంది. 1993లో మై హోమ్ లక్ష్మీ నివాస్, మైహోమ్ గార్డెనియాని నిర్మించారు. 1997లో మైహోమ్ జూపల్లి, 1998లో మైహోమ్ ఫెర్న్‌హిల్, ఆ తరువాత మై హోమ్ సరోవర్, మై హోమ్ మధుబన్.. ఇలా హైదరాబాద్ అంతటా మై హోమ్ విస్తరించి నాణ్యతకు, నమ్మకానికి మారుపేరుగా నిలిచింది. 2005లో మైహోమ్ నవద్వీప నిర్మాణంతో హైటెక్ సిటీకే కొత్త ఐకాన్‌గా నిలిచింది. 2010లో మైహోమ్ హబ్, మదీనాగూడలో మైహోమ్ జెవెల్‌లతో హైదరాబాద్ రియల్ రంగంలో జోష్ పెంచింది మైహోమ్.
ఇక గచ్చిబౌలిలో నిర్మితమైన మైహోమ్ విహంగ దాదాపు రెండు వేల అపార్ట్‌మెంట్ రెసిడెన్షియల్ సెగ్మెంట్‌లో ఐకాన్‌గా నిలిచింది. 2016లో మైహోమ్ అభ్ర లాంచ్ చేసి హైటెక్ సిటీకే ల్యాండ్‌మార్క్‌గా నిలిచింది. ఇక గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మించిన మైహోమ్ క్రిషె హ్యాపీ లివింగ్‌కు కేరాఫ్‌గా నిలిచింది. అదే సంవత్సరం పుప్పాలగూడలో లాంచ్ చేసిన మైహోమ్ అవతార్ భారీ ప్రాజెక్టును 2019లో పూర్తి చేసి దేశమంతా హైదరాబాద్ వైపు చూసేలా చేసింది మై హోమ్ సంస్థ. మోడ్రన్ హోమ్స్, ప్రీమియం కంఫర్ట్స్ అందించడంలో తిరుగులేని బ్రాండ్‌గా నిలిచింది. ఆ తరువాత హైటెక్ సిటీలో నిర్మాణం జరుపుకున్న మైహోమ్ భూజా.. దేశంలోనే గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఇక కమర్షియల్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే మైహోమ్ స్కైవ్యూ, మైహోమ్ ట్విజా ఆసియాలోనే అద్భుత ప్రాజెక్టులుగా పేరు తెచ్చుకున్నాయి.
ఆధ్యాత్మిక, సేవా రంగాల్లో
నిర్మాణ రంగానికే పరిమితం కాకుండా ఆధ్యాత్మికతతో పాటు సేవా రంగాల్లో తనదైన ముద్రవేస్తూ వస్తున్నారు డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు.. ఆకాశాన్నంటే భవంతులు నిర్మించడమే కాదు, ఆధ్యాత్మికతను పంచుతూ ఆలయాలను నిర్మించడం మైహోమ్ ప్రత్యేకత. ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉన్న డా.జూపల్లి రామేశ్వరరావు, చినజీయర్ స్వామి వారితో కలిసి ఎన్నో సేవా, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. “సమతా మూర్తి’ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆయన అందించిన సహకారం విశేషమైనది. ఒకవైపు బిజినెస్‌లో బిజీగా ఉంటూనే హోమియో వైద్యంపై మక్కువతో ముచ్చింతల్‌లో ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. 2019 నుంచి 2021 వరకు టీటీడీ ట్రస్ట్ మెంబర్‌గా కొనసాగారు.
వ్యాపారమే పరమావధి కాకుండా, సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో “మై హోమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ” ద్వారా విద్యాసంస్థలను నడుపుతున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలకు మై హోమ్ గ్రూప్ ద్వారా ఉపాధి లభిస్తోంది. బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్ వేదికగా మైహోమ్ గ్రూప్‌నకు ప్రతిష్ఠాత్మక జీఎస్‌ఎస్ గ్లోబల్ సేఫ్టీ అవార్డు కూడా లభించింది. తాజాగా ప్రకటించిన ఫోర్బ్స్ రియల్ ఎస్టేట్ జాబితాలో ఆరో స్థానంలో నిలిచారు.
నాణ్యత, విశ్వసనీయత, సమగ్రత ఇదే మైహోమ్ ఫిలాసఫీ. కస్టమర్ల నమ్మకం, అంచనాలకు అనుగుణంగా రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ సెగ్మెంట్లలో వండర్స్ సృష్టించింది మైహోమ్ సంస్థ. రాబోయే కాలంలో మరిన్ని ప్రణాళికలతో ఇదే జోష్‌తో ముందుకు వెళ్లనున్నట్లు మై హోమ్ గ్రూప్ ధీమాగా చెబుతోంది.
