LPG ATM : గ్యాస్ టెన్షన్‌కు చెక్.. దేశంలోనే ఫస్ట్ LPG ఏటీఎం.. జస్ట్ 2 నిమిషాల్లోనే సిలిండర్ ఇంటికి..!
LPG ATM : దేశంలోనే మొట్టమొదటి ఎల్పీజీ ఏటీఎం గురుగ్రామ్‌లో ప్రారంభమైంది. ఈ ఎల్పీజీ వెండింగ్ మెషీన్ ఏటీఎం మాదిరిగానే పనిచేస్తుంది. తద్వారా ప్రజలు కేవలం 2నుంచి 3 నిమిషాల్లో గ్యాస్ సిలిండర్లను పొందవచ్చు.
LPG ATM ( Image Credit to Original Source )
- ఎల్పీజీ ఏటీఎం ఎంట్రీ.. 2 నిమిషాల్లో గ్యాస్ సిలిండర్ మీ చేతిలో
- గ్యాస్ కోసం ఇక క్యూలే వద్దు.. దేశంలో తొలి ఎల్పీజీ ఏటీఎం
- ఇక వేచి ఉండాల్సిన పని లేదు.. ఎల్పీజీ ఏటీఎంతో ఇన్స్టంట్ గ్యాస్
- కొత్త యుగం.. గ్యాస్ కోసం ఏటీఎంకు వెళ్లే రోజులు వచ్చేశాయి
LPG ATM : మీ ఇంట్లో గ్యాస్ అయిపోయిందా? డోంట్ వర్రీ.. కొన్ని నిమిషాల వ్యవధిలోనే మీ ఇంటికి వంటగ్యాస్ తెచ్చుకోవచ్చు. గురుగ్రామ్‌లో కొత్త ఎల్పీజీ ఏటీఎం వెంటనే గ్యాస్ అందిస్తుంది. ఏటీఎం మాదిరిగా పనిచేసే ఈ సిస్టమ్‌తో ఎక్కువ సమయం వేచి ఉండకుండా మీ అవసరానికి సరిపడ గ్యాస్ పొందొచ్చు అనమాట.
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రికత్తల నేపథ్యంలో వంటగ్యాస్ సంక్షోభం తలెత్తింది. భారత్ ఎల్పీజి అవసరాలలో సుమారు 60శాతం దిగుమతి చేసుకుంటోంది. ఈ యుద్ధ వాతావరణం కారణంగా గ్యాస్ సరఫరా గొలుసులో అంతరాయాలు ఎదురయ్యాయి.
గ్యాస్ రవాణాలో జాప్యం, భయాందోళనలతో కొనుగోళ్లు చేయడం వల్ల గ్యాస్ సిలిండర్లకు అధిక డిమాండ్ ఏర్పడింది. ఈ సవాళ్లను పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా దేశంలోనే మొట్టమొదటి ఎల్పీజీ ఏటీఎం గురుగ్రామ్‌లో ప్రారంభమైంది. ఈ ఎల్పీజీ వెండింగ్ మెషిన్ ఏటీఎం మాదిరిగానే పనిచేస్తుంది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
బీపీసీఎల్ ఎల్పీజీ ఏటీఎం ఏర్పాటు :
గురుగ్రామ్‌లోని సోహ్నా, సెక్టార్ 33లో సెంట్రల్ పార్క్ ఫ్లవర్ వ్యాలీలో భారత్ పెట్రోలియం (BPCL) ఈ స్మార్ట్ LPG వెండింగ్ మెషీన్‌ను ఒక పైలట్ ప్రాజెక్ట్‌గా ఏర్పాటు చేసింది. మీరు కేవలం 2నుంచి 3 నిమిషాల్లో గ్యాస్ సిలిండర్ ఇంటికి తెచ్చుకోవచ్చు. గ్యాస్ వస్తుందో రాదో అనే టెన్షన్ ఉండదు. డెలివరీ కోసం వేచి చూడాల్సిన పనిలేదు. ఈ మెషీన్ ఎలాంటి ఫోన్ కాల్స్, బుకింగ్ స్లాట్లు లేదా డెలివరీ విండో లేకుండానే సిలిండర్‌ను ఇంటికి తీసుకెళ్లొచ్చు.
మీరు చేయాల్సిందల్లా ఈజీ డిజిటల్ ప్రాసెస్ పూర్తి చేయడమే. భారత్‌గ్యాస్ ఇన్‌స్టా ఎల్ పీజీ పేరుతో ఈ LPG ATM అధికారికంగా రెండు నెలల క్రితమే ప్రవేశపెట్టింది. కానీ, ఇప్పుడు సాధారణ ప్రజల కోసం కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏటీఎం మెషీన్ రోజుకు 24 గంటలు తెరిచే ఉంటుంది.
ఏటీఎం మిషన్ ఎలా పనిచేస్తుంది? :
- ముందుగా, మెషిన్ స్క్రీన్‌పై మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
- మీ మొబైల్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేసి మీ ఐడెంటిటీని వెరిఫై చేయండి.
- మీ ఖాళీ సిలిండర్‌పై ఉన్న క్యూఆర్ కోడ్ లేదా బార్‌కోడ్‌ను మెషిన్ స్కానర్ ముందు ఉంచండి.
- ఆ సిలిండర్ వ్యాలీడ్ అవుతుందో లేదో మెషిన్ చెక్ చేస్తుంది.
- వెరిఫికేషన్ సక్సెస్ తర్వాత విండో ఓపెన్ అవుతుంది.
- మీ ఖాళీ సిలిండర్‌ను స్లాట్‌లో ఉంచాలి.
- మిషన్ దానంతట అదే స్వచ్ఛత, బరువును చెక్ చేసి వెంటనే సిలిండర్ లోపలికి పంపుతుంది
- మీరు స్క్రీన్‌పై కనిపించే గ్యాస్ ధర ఎంత ఉందో యూపీఐ ద్వారా చెల్లించాలి.
- పేమెంట్ సక్సెస్ అయితే మిషన్ డెలివరీ విండో నుంచి సీల్ చేసి నింపిన సిలిండర్ బయటకు వస్తుంది.
- ఈ మొత్తం ప్రక్రియకు 2 నుంచి 3 నిమిషాల సమయం పడుతుంది.
కాంపోజిట్ సిలిండర్ ప్రత్యేకతలివే :
మీకు ఐరన్ సిలిండర్ల కన్నా వెయిట్ లెస్ 10 కిలోల కాంపోజిట్ సిలిండర్లు లభిస్తాయి. ఏటీఎం మిషన్‌లో ఒకేసారి 10 సిలిండర్లను మాత్రమే లోడ్ చేయవచ్చు. ఒకవేళ స్టోరేజీలో కేవలం రెండు సిలిండర్లు మాత్రమే మిగిలి ఉంటే మిషన్ రీఫిల్ కోసం సమీపంలోని గ్యాస్ ఏజెన్సీకి అలర్ట్ పంపుతుంది.
కాంపోజిట్ సిలిండర్‌గా ఎలా మార్చాలి? :
14.2 కేజీల ఐరన్ గ్యాస్ సిలిండర్ డాక్యుమెంట్లు (పాస్‌బుక్) భారత్ గ్యాస్ ఏజెన్సీకి వెళ్లండి.
మీ పాత ఐరన్ సిలిండర్‌కు బదులుగా 10 కేజీల కాంపోజిట్ సిలిండర్ మార్చమని అడగండి.
మీరు పాత సిలిండర్ సుమారు రూ. 1,450 సెక్యూరిటీ డిపాజిట్, కొత్త కాంపోజిట్ సిలిండర్ సుమారు రూ. 3,350 సెక్యూరిటీ డిపాజిట్ మధ్య సుమారు రూ.1,990 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
ఏజెన్సీ మీకు కొత్త తేలికైన కాంపోజిట్ సిలిండర్‌ను ఇస్తుంది. మీరు ఎల్పీజి ఏటీఎమ్‌కి వెళ్లి 2 నిమిషాల్లో రీఫిల్ చేయించుకోవచ్చు. కాంపోజిట్ సిలిండర్ల ధర కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. 14.2 కేజీల ఐరన్ సిలిండర్ ధర సుమారు రూ. 1450 ఉండగా, కాంపోజిట్ సిలిండర్ ధర సుమారు రూ. 3350 ఉంటుంది.
