Banks Strike Postponed: బ్యాంకుల దేశవ్యాప్త సమ్మె వాయిదా.. యూనియన్ల ప్రకటన.. బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్
దేశ వ్యాప్తంగా మూడు రోజుల బ్యాంకుల సమ్మె(Banks Strike Postponed) వాయిదా పడింది.
- V Santhosh Kumar
- Published on- September 28, 2026 / 07:54 AM IST
Nationwide Banks postpone three-day strike.
Banks Strike Postponed: దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 28 నుండి 30 వరకు జరగాల్సిన మూడు రోజుల బ్యాంకుల సమ్మె వాయిదా పడింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రతినిధుల మధ్య జరిగిన కీలక సమావేశంలో ప్రధాన అంశాలపై పరస్పర అవగాహన కుదరడంతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు యూనియన్ ప్రకటించింది. నెలాఖరు సేవలు, అర్ధవార్షిక క్లోజింగ్ (సప్టెంబర్ 30) సమయంలో సమ్మె విరమణ ప్రకటన వెలువడటంతో సాధారణ బ్యాంకింగ్ వినియోగదారులకు పెద్ద ఊరట లభించింది.
5 రోజుల వర్కింగ్ డేస్‌పై కమిటీ – శనివారాల సెలవులపై చర్చలు:
సమావేశ నిర్ణయం ప్రకారం ఐబీఏ, యూఎఫ్‌బీయూ ప్రతినిధులతో ఒక ఉన్నత స్థాయి కమిటీని వెంటనే ఏర్పాటు చేయనున్నారు. అన్ని శనివారాలను బ్యాంకులకు(Banks Strike Postponed) సెలవు దినాలుగా ప్రకటించే డిమాండ్‌పై ఈ కమిటీ వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలించి, కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొంటుంది. ప్రసుతం నెలకు రెండు, నాలుగు శనివారాలు మాత్రమే సెలవులు ఉండగా, అన్ని శనివారాలనూ సెలవులుగా మార్చాలని యూనియన్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి.
పింఛను, పీఎల్‌ఐ సమస్యలపై హామీ – సమ్మె ఉపసంహరణ:
శనివారాల సెలవులతో పాటు స్కేల్ IV, ఆపైన అధికారులకు వర్తించే పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్‌లో మార్పులు చేయడంపై ఇరు వర్గాలు చర్చించనున్నాయి. అలాగే నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) పరిధిలోని ఉద్యోగుల పింఛను ప్రయోజనాలు, వేతన సంబంధిత పెండింగ్ అంశాల పరిష్కారానికి ఐబీఏ అంగీకరించింది. ఈ సానుకూల పరిణామాల నేపథ్యంలో ప్రతిపాదిత నిరసన కార్యక్రమాలు, మూడు రోజుల సమ్మె చర్యలను వాయిదా వేస్తున్నట్లు యూనియన్ స్పష్టం చేసింది.
