SBI Credit Card : మీకు SBI క్రెడిట్ కార్డు ఉందా? డిసెంబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు.. ఈ లావాదేవీలు చేస్తే జేబుకు చిల్లు!
SBI Credit Card : ఎస్బీఐ క్రెడిట్ కార్డులు వాడేవారికి బిగ్ అలర్ట్.. డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.. ఇంధనం, రవాణా ఛార్జీలకు పరిమితికి మించి క్రెడిట్ వాడితే అదనంగా 1 శాతం ఛార్జీ పడనుంది..
- Sreehari A
- Published on- October 29, 2026 / 05:50 PM IST
SBI Credit Card Charges
- ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు అలర్ట్..
- పెట్రోల్, డీజిల్పై కార్డుతో అదనపు బాదుడు
- ఏయే లావాదేవీలపై 1శాతం ఛార్జీ పడొచ్చంటే?
SBI Credit Card New Rules : ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే ఇది మీకోసమే.. ఈ క్రెడిట్ కార్డుతో పెట్రోల్, డీజిల్ కొట్టించడం, రవాణా ఖర్చులు ఎక్కువగా చెల్లించే వారికి అదనపు ఛార్జీల భారం పడనుంది. డిసెంబర్ 1 నుంచి కొత్త రుసుముల నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్బీఐ కార్డు వినియోగదారులు తప్పనిసరిగా కొన్ని విషయాలను తెలుసుకోవాలి.. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..
ఇంధన ఖర్చులు పెరిగితే అదనపు బాదుడు :
ఎస్బీఐ కార్డు నిబంధనల ప్రకారం.. ఒక బిల్లింగ్ సైకిల్లో ఫ్యూయల్ లావాదేవీల మొత్తం రూ.50వేలు దాటితే, మొత్తం ఇంధన ఖర్చుపై ఒక శాతం అదనపు రుసుము వర్తిస్తుంది. ఉదాహరణకు.. ఒక నెలలో పెట్రోల్, డీజిల్ కోసం రూ.55వేలు ఖర్చు చేస్తే రూ.550 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. రూ. 60వేలకు రూ. 600 అదనపు ఛార్జీ, రూ.75వేలు ఖర్చు చేస్తే ఈ రుసుము రూ.750కు చేరుతుంది.
Read Also : YS Jagan-Arnab Cyclone : తుపాను బాధిత రైతుల కన్నీళ్లు కనిపించడం లేదా? చంద్రబాబు సర్కారుపై వైఎస్ జగన్ ఫైర్!
ముఖ్యంగా ప్రతిరోజూ వాహనాలు నడిపేవారు, ట్యాక్సీ డ్రైవర్లు, ఎక్కువ దూరం ప్రయాణించేవారు ఈ మార్పును గుర్తుంచుకోవాలి. అయితే, ఈ ఛార్జీ అన్ని చిన్న ఇంధన లావాదేవీలకు వర్తిస్తుందని కాదు. నిర్ణీత పరిమితి, సంబంధిత లావాదేవీ కేటగిరీల ఆధారంగా రుసుము లెక్కిస్తారు.
ట్రాన్స్పోర్ట్ ఛార్జీలపైనా 1 శాతం ఫీజు :
రవాణా సంబంధిత లావాదేవీల్లో ఒక్కో ట్రాన్సాక్షన్ వాల్యూ రూ.30వేలు దాటితే, ఆ లావాదేవీ మొత్తంపై ఒక శాతం అదనపు ఛార్జీ పడుతుంది. ఉదాహరణకు.. రూ.35వేల విలువైన ట్రాన్స్ పోర్టు లావాదేవీ చేస్తే రూ.350 అదనంగా చెల్లించాలి. సరకు రవాణా, టోల్ ఛార్జీలు, బ్రిడ్జి ఫీజులు, బస్సు సేవలు వంటి కొన్ని కేటగిరీలు ఇందులోకి రావచ్చు.
ఎవరిపై ఎక్కువ ప్రభావం? :
సాధారణంగా తక్కువ మొత్తాల్లో క్రెడిట్ కార్డు వాడేవారిపై ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉండొచ్చు. కానీ, వ్యాపార అవసరాలు, అధిక ప్రయాణాలు, భారీ ఇంధన ఖర్చుల కోసం వ్యక్తిగత క్రెడిట్ కార్డులను వాడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్డు ద్వారా పేమెంట్ చేసే ముందు లేటెస్ట్ ఛార్జీల వివరాలు, మీ కార్డుకు వర్తించే నిబంధనలు, ఎస్బీఐ కార్డ్ అధికారిక వెబ్సైట్లో చెక్ చేయడం బెటర్.. చిన్న నిర్లక్ష్యం కూడా భారీ ఖర్చుకు దారితీస్తుంది జాగ్రత్త..
