TS RERA: తెలంగాణలో ప్లాట్లు, ఇళ్ల కొనుగోలుదారులకు రెరాతో రక్షణ.. ఎలాగో తెలుసా?

ప్లాట్లు, గృహ కొనుగోలుదారుల హక్కుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ తెలంగాణ రాష్ట్రంలో బాగా పనిచేస్తోంది.

TS RERA aims to bring transparency in realty sector

TS RERA Hyderabad: ఇళ్ల కొనుగోలుదారులకు భద్రత, రక్షణ కల్పించేందుకు ఏర్పాటు చేసిన రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (Real Estate Regulatory Authority) కార్యకలాపాలు తెలంగాణ రాష్ట్రంలో జోరందుకున్నాయి. ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో మోసాలు జరుగుతున్న నేపథ్యంలో రెరాలో నమోదు చేసుకున్న రియల్ ప్రాజెక్టుల్లో మాత్రమే ఇళ్లను కొనుగోలు చేయాలని, అలాగైతేనే కొనుగోలుదారుల పెట్టుబడికి పూర్తి రక్షణ ఉంటుందని రెరా చెబుతోంది. రెరాలో నమోదవ్వని ప్రాజెక్టుల్లో ప్లాట్లు, అపార్ట్ మెంట్స్, విల్లాలు కొని మోసపోవద్దని హెచ్చరిస్తోంది.

తెలంగాణలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయి. ప్లాట్లు, గృహ కొనుగోలుదారుల హక్కుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ తెలంగాణ రాష్ట్రంలో బాగా పనిచేస్తోంది. ప్లాట్లు, ఇళ్ల కొనుగోలుదారులకు భరోసా కల్పించడం, వారి పెట్టుబడికి రక్షణ కల్పించడం, నిర్మాణరంగ సంస్థలు సకాలంలో ఇంటిని అప్పగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో రెరా కీలక పాత్ర పోషిస్తోంది. నిబంధనలను పాటించే రియల్ ప్రాజెక్టులకే రెరా అనుమతులు ఇస్తోంది. నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే ఆయా రియాల్టీ, నిర్మాణరంగ సంస్థలపై కేసులు నమోదు చేయడంతో పాటు, భారీ జరిమానాలు విధిస్తోంది.

తెలంగాణ రెరాలో నిర్మాణ రంగ సంస్థలు తమ ప్రాజెక్టులను భారీగా నమోదు చేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర పరిధిలోని రెరా కింద నమోదైన ప్రాజెక్టుల పరంగా చూస్తే దేశంలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. తెలంగాణలో 2017లో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అమల్లోకి వచ్చినా, మొన్నటి వరకు ఇంటర్మ్ రెరా అథారిటీనే కార్యకలాపాలు సాగించింది. వినియోగదారులతో పాటు రియల్ రంగ సంస్థల విజ్ఞప్తితో తెలంగాణ ప్రభుత్వం గత నెలలో శాశ్వత రెరా అథారిటీని ఏర్పాటు చేస్తూ.. చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎన్ సత్యనారాయణను నియమించింది. దీంతో తెలంగాణలో జరిగే రియల్ ఎస్టేట్ కార్యకలాపాలపై రెరా పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తోంది.

Also Read: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో కొత్త పోకడలు.. వెల్‌నెస్ హోమ్స్ కు పెరిగిన డిమాండ్

ఇక తెలంగాణ రెరాలో 2018 ఆగష్టు 31 నుంచి జులై 6, 2023 వరకు మొత్తం 6 వేల 704 రియల్టీ ప్రాజెక్ట్‌లు నమోదవ్వగా, 2 వేల 912 మంది ఏజెంట్లు రిజిస్టరయ్యారు. తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకోని ప్రాజెక్టుల్లో ఎలాంటి కొనుగోళ్లు చేయవద్దని రెరా హెచ్చరిస్తోంది. రెరా అనుమతి ఉన్న ఇళ్ల స్థలాలు, అపార్ట్ మెంట్లలో ఫ్లాట్‌లు, విల్లాలు మాత్రమే కొనుగోలు చేయాలని సూచిస్తోంది. రెరా వద్ద రిజిస్ట్రేషన్‌ అయిన అన్ని స్థిరాస్తి ప్రాజెక్టుల వివరాలు రెరా వెబ్‌సైట్‌లో నమోదై ఉంటాయి. కొనుగోలుదారులు ఎవరైనా అయా ప్రాజెక్టుల వివరాలను rerait.telangana.gov.in వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. రెరాతో పాటు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమతులు పొందిన ప్లాట్లను, అపార్ట్ మెంట్లను, విల్లాలను మాత్రమే కొనుగోలు చేయాలని, రియల్ ఎస్టేట్ మార్కెట్ లో కొందరు చేస్తున్న మోసాలకు గురికావద్దని రియల్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read: హోమ్ లోన్ కస్టమర్లకు ఆర్బీఐ రిలీఫ్.. ఫ్లోటింగ్ వడ్డీ నుంచి ఫిక్స్డ్ వడ్డీకి మారొచ్చు..

రేరాలో నమోదు చేసుకోకుండా స్థిరాస్తి అమ్మకాలు జరిపితే సదరు సంస్థపై అథారిటీ చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. అంతే కాకుండా ఇల్లు లేదా ఇంటి స్థలం కొనుగోలు చేసినప్పుడు.. సదరు నిర్మాణ సంస్థ లిఖితపూర్వకంగా ఇచ్చిన వాగ్దానాలలో ఏ ఒక్కటి నెరవేర్చకపోయినా, గడువు సమయంలో ఇంటిని అప్పగించకపోయినా రెరా ఆ బిల్డర్ కు జరిమానా విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. ప్లాటు, ఇల్లు, విల్లా ఏది కొనాలనుకున్నా ప్రభుత్వ అనుమతులుతో పాటు సదరు నిర్మాణ సంస్థ ట్రాక్ రికార్డును పరిశీలించడంతో పాటు ఆ బిల్డర్ నిర్మించిన గత ప్రాజెక్టులను, వెంచర్లను పరిశీలించి, అవసరమైతే న్యాయనిపుణులను సంప్రదించాకే స్థిరాస్తులను కొనుగోలు చేయాలని మరిచిపోవద్దు.

ట్రెండింగ్ వార్తలు