EPF Scheme 2026 Rules: ఈపీఎఫ్ రూల్స్ మారాయి.. విత్‌డ్రా పై ఆంక్షలు.. గెజిట్ విడుదల చేసిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన సామాజిక భద్రత కోడ్‌లో భాగంగా ఉద్యోగుల భవిష్యనిధి(EPF New Rules) , పింఛను, డిపాజిట్ బీమా పథకాల నియమాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
- V Santhosh Kumar
- Updated on- July 2, 2026 / 11:41 AM IST
The Central Government has formulated new regulations regarding the EPF.
- ఈపీఎఫ్ కొత్త నిబంధనలు అమల్లోకి
- ఏడాదికి రెండుసార్లే విత్‌డ్రా అవకాశం
- ఖాతాలో కనీస నిల్వ తప్పనిసరి
EPF Rules: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన సామాజిక భద్రత కోడ్‌లో భాగంగా ఉద్యోగుల భవిష్యనిధి (EPF New Rules), పింఛను (EPS), డిపాజిట్ బీమా (EDLI) పథకాల నియమాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పాత చట్టాల స్థానంలో ఉద్యోగుల భవిష్యనిధి పథకం-2026, ఉద్యోగుల పింఛను పథకం-2026, ఉద్యోగుల డిపాజిట్ బీమా పథకం-2026లను తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, పీఎఫ్ ఖాతాల నుండి నగదు ఉపసంహరణ ప్రక్రియను మరింత క్రమబద్ధీకరిస్తూ కొన్ని నిబంధనలను కఠినతరం చేశారు.
Also Read – WhatsApp Username: ఇంకా లాంచ్ చేయలేదట.. కేంద్రం నోటీసులపై క్లారిటీ ఇచ్చిన వాట్సాప్
పీఎఫ్ ఉపసంహరణలపై పరిమితులు: ఏడాదికి రెండుసార్లే ఛాన్స్:
నూతన నిబంధనల ప్రకారం, పీఎఫ్ ఖాతా నుండి ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రెండు సార్లు మాత్రమే పాక్షిక ఉపసంహరణలు (Partial Withdrawals) చేసుకోవడానికి అనుమతిస్తారు. గతంలో అనారోగ్యం పేరిట ఎన్నిసార్లయినా డబ్బులు తీసుకునే వీలుండగా, ఇకపై ఆ సౌకర్యాన్ని ఏడాదికి రెండు సార్లకే పరిమితం చేశారు. ఒకవేళ వేరే అవసరాల కోసం ఒకసారి డబ్బులు డ్రా చేస్తే, అదే ఏడాది అనారోగ్యం కింద మరో ఒకసారి మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఉన్నత విద్య కోసం సర్వీసు మొత్తంలో 10 సార్లు, ఇల్లు కొనుగోలు లేదా మరమ్మతుల కోసం గతంలో 2 సార్లే ఛాన్స్ ఉండగా, ఇకపై 5 సార్ల వరకు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారు.
25% కనీస నిల్వ తప్పనిసరి: ఏడాది సర్వీస్ ఉంటేనే విత్‌డ్రా:
ఈపీఎఫ్-2026 నిబంధనల ప్రకారం పాక్షిక ఉపసంహరణ చేసుకునే సమయానికి పీఎఫ్ ఖాతాలో 25 శాతం కనీస నిల్వ ఉండటం తప్పనిసరి. ఉద్యోగి వాటా, యజమాని వాటా, ఆ మొత్తంపై వచ్చిన వడ్డీ.. ఈ మూడింటినీ కలిపి ఈ 25 శాతం కనీస నిల్వను లెక్కిస్తారు. అలాగే, ఒక ఉద్యోగి ఈపీఎఫ్ చందాదారుడిగా చేరి, కనీసం ఒక సంవత్సరం సర్వీసు కాలం పూర్తి చేసుకున్న తర్వాతే పీఎఫ్ ఖాతా నుండి ఎలాంటి పాక్షిక ఉపసంహరణలకైనా దరఖాస్తు చేసుకోవడానికి అర్హత సాధిస్తారు.
