Modi Gold Ban Reason : మోదీ బంగారం కొనొద్దు అనడానికి అసలు కారణాలు ఇవన్నమాట.. పెద్ద ప్లానే

Modi Gold Ban Reason :

These are the reason behind PM Modi asked Indian families not to buy gold for a year

Modi Gold Ban Reason : బంగారం అంటే భారతీయులకు ఎంత అభిమానమో వర్ణించడానికి మాటలు చాలవు. అప్పు చేసైనా సరే బంగారం కొనాలని భావిస్తారు. ఇక పెళ్లిళ్లు వంటి శుభకార్యాల్లో అయితే బంగారం తప్పనిసరి. ఆడపిల్ల పెళ్లిలో తులాలు మొదలు కేజీల వరకు బంగారం పెట్టుకుని మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. పెళ్లనగానే ముందుగా గుర్తుకు వచ్చేది బంగారమే. ధర ఎంత పెరిగినా సరే మన దేశంలో బంగారం కొనుగోళ్లు తగ్గడం లేదు. ఈ క్రమంలోనే ఆదివారం నాడు మోదీ ఏడాది పాటు భారతీయులు ఎవరూ బంగారం కొనవద్దంటూ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సాక్షాత్తు దేశ ప్రధాని బంగారం కొనవద్దంటూ ప్రజలను అభ్యర్థించడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. నేడు దేశవ్యాప్తంగా మోదీ వ్యాఖ్యలపైనే చర్చ జరుగుతోంది. మరి మోదీ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.. అసలు కారణాలు ఏంటని లోతుగా విశ్లేషిస్తే.. విస్తుపోయే విషయాలు తెరమీదకు వస్తున్నాయి.

చమురు ధరలే ప్రధాన కారణం

ఏడాది పాటు పెళ్లిళ్లకు బంగారం కొనవద్దంటూ మోదీ చేసిన అసాధారణ అభ్యర్థన వెనుక దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడే ఒక పెద్ద వ్యూహం దాగి ఉంది. ప్రస్తుతం పశ్చిమాసియా (Middle East) లో నెలకొన్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వంటి కీలక చమురు రవాణా మార్గాల్లో నెలకొన్న ఆందోళనల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొన్ని వారాల క్రితం బ్యారెల్‌కు 70 డాలర్లుగా ఉన్న ధర ఏకంగా 126 డాలర్లకు చేరుకుంది.

*గోల్డ్ బ్యాన్, ఖర్చులు తగ్గించుకోండి, త్యాగాలకు సిద్ధంకండి.. ప్రధాని మోదీ సంచలన పిలుపు

భారతదేశం తన చమురు అవసరాలలో సుమారుగా 85 శాతం దిగుమతుల పైనే ఆధారపడుతుంది. చమురు ధర పెరిగినప్పుడల్లా భారత్ తన వద్ద ఉన్న విదేశీ మారక ద్రవ్యాన్ని (డాలర్లను) భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే, పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించి, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాలని ప్రధాని కోరారు.

బంగారం, చమురు మధ్య సంబంధం

ఆర్థిక పరంగా చూస్తే, చమురుకు, బంగారానికి ఒక ప్రధానమైన పోలిక ఉంది. అది ఏంటంటే.. ఈ రెండింటినీ దిగుమతి చేసుకోవాలంటే మనం అమెరికన్ డాలర్లలోనే చెల్లించాలి. భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశాలలో ఒకటి. ఒకవైపు ముడి చమురు ధరలు పెరిగి దేశంపై భారం పడుతున్నప్పుడు, మరోవైపు ప్రజలు భారీగా బంగారం కొనుగోలు చేస్తూ ఉంటే.. దేశం నుంచి డాలర్లు పెద్ద మొత్తంలో ఖర్చవుతాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ రోజురోజుకూ పెరిగి.. రూపాయి విలువ దారుణంగా పడిపోతుంది.

బంగారం కొంటే జరిగేది ఇదే..

ఆర్థికవేత్తల ప్రకారం చూసుకుంటే.. వారి దృష్టిలో బంగారం అనేది రవాణా, పరిశ్రమలకు అవసరమైన అత్యంత వినియోగ వస్తువు కాదు. అది ఒక విలాసవంతమైన లేదంటే పొదుపు కోసం చేసే ఖర్చు.

  • ప్రజలు భారీగా బంగారం కొంటే దేశం నుంచి డాలర్లు బయటకు వెళ్తాయి.

  • దీనివల్ల ‘కరెంట్ అకౌంట్ డెఫిసిట్’ (దిగుమతులు-ఎగుమతుల మధ్య వ్యత్యాసం) పెరుగుతుంది.

  • లోటు పెరిగితే రూపాయి బలహీనపడుతుంది.

  • రూపాయి బలహీనపడితే మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్రతి వస్తువు.. చమురుతో సహా అన్నింటి ధరలు మరింత పెరుగుతాయి. ఇది ద్రవ్యోల్బణానికి దారితీసి సామాన్యుల నడ్డి విరుస్తుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మోదీ ఏడాది పాటు బంగారం కొనవద్దని కోరారు.

గతంలో కూడా ఇవే పరిస్థితులు

గతంలో ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు భారత ప్రభుత్వం బంగారం దిగుమతులను తగ్గించే ప్రయత్నం చేసింది:

  • బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచడం.

  • దిగుమతులపై ఆంక్షలు విధించడం.

  • బంగారానికి బదులుగా ‘సావరిన్ గోల్డ్ బాండ్ల’ను ప్రోత్సహించడం.

మరో కీలక సందేశం.. ‘పొదుపు’

మోదీ కేవలం బంగారం కొనుగోళ్లు ఆపమని చెప్పడం మాత్రమే కాక.. సంక్లిష్ట సమయాల్లో విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడటానికి మరికొన్ని సూచనలు చేశారు. వీటిలో ముఖ్యమైనవి:

  • వీలైనంత వరకు మళ్ళీ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ పద్ధతిని పాటించడం.

  • అనవసరమైన ప్రయాణాలు తగ్గించడం.

  • ఇంధనాన్ని పొదుపు చేయండి అని పిలుపునిచ్చారు.

ఒక్క కుటుంబం బంగారం కొనకపోతే రూపాయి విలువ పెరుగుతుందా అనే అనుమానం చాలా మందిలో ఉంది. కానీ, ఇలా ఒక్కొక్కరు అనుకుంటూ పోతే.. కోట్లాది కుటుంబాలు కలిపి చేసే డిమాండ్ టన్నుల కొద్దీ బంగారం దిగుమతికి దారితీస్తుంది. మరీ ముఖ్యంగా ఈ పెళ్లిళ్ల సీజన్‌లో ఈ డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏడాది పాటు సాధ్యమైనంత వరకు బంగారం కొనుగోళ్లు ఆపాలని మోదీ విన్నవించారు.

మోదీ సర్కార్‌ను పీడిస్తున్న అతి పెద్ద సమస్య ఏంటంటే.. ఈ కింది అంశాల కలయిక దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉంది:

  • అమాంతం పెరిగిన ముడి చమురు ధరలు

  • భారీగా పెరుగుతున్న దిగుమతి బిల్లులు

  • రోజురోజుకూ బలహీనపడుతున్న రూపాయి విలువ

  • నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల (ద్రవ్యోల్బణం)

  • విదేశీ మారక నిల్వలపై పడుతున్న తీవ్ర ఒత్తిడి

ఈపరిస్థితులన్నీ కలిసి దేశ ఆర్థిక వృద్ధిని నెమ్మదింపజేయడమే కాకుండా, సామాన్యులపై ఖర్చుల భారాన్ని పెంచుతాయి. అందుకే మోదీ బంగారం కొనవద్దని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న ఈ క్లిష్ట సమయంలో భారతదేశపు బాహ్య ఆర్థిక స్థిరత్వాన్ని (External Financial Stability) కాపాడటమే ఆయన ప్రధాన లక్ష్యం.