×
Ad

Union Budget 2026: ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి? మీ జేబుకు చిల్లు ఎక్కడ పడుతుందంటే?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఏయే వస్తువుల ధరలపై ప్రభావం పడుతుంది?

Nirmala Sitharaman (Image Credit To Original Source)

  • మధుమేహం, క్యాన్సర్ మందుల ధరలు తగ్గుతాయ్
  • మొబైల్ ఫోన్ల ధరలు ఈ సారి తగ్గే అవకాశం
  •  సిగరెట్లు, పాన్ మసాలా ధరలు పెరుగుతాయ్ 

Union Budget 2026: దేశంలో పలు వస్తువుల ధరలు తగ్గనున్నాయి.. మరికొన్ని పెరుగుతాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్‌లో కేంద్ర వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఈ కింద వస్తువుల ధరలపై ఏ విధంగా ప్రభావం పడుతుందో చూడండి..

బేసిక్ కస్టమ్స్ డ్యూటీ సడలింపులు, ఇతర పన్ను మినహాయింపుల కారణంగా కింది వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది.

అత్యవసర మందులు: మధుమేహం, క్యాన్సర్ చికిత్సలో వినియోగించే 17 ప్రాణరక్షక ఔషధాలు కొత్త కస్టమ్స్ డ్యూటీ సడలింపుతో వాటి ధరలు తగ్గుతాయి. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ అంటే దిగుమతి వస్తువులపై విధించే ప్రాథమిక సుంకం.

మొబైల్ ఫోన్లు: తయారీ ప్రక్రియలో ఉపయోగించే భాగాలు, క్యాపిటల్ గూడ్స్‌పై ప్రభుత్వ సడలింపుల కారణంగా ధరలు తగ్గే సూచనలు ఉన్నాయి.

ఈవీ బ్యాటరీలు: లిథియం-అయాన్ సెల్స్‌పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు కారణంగా తగ్గుతాయి.

లెదర్, వస్త్ర రంగం: వెట్ బ్లూ లెదర్ వంటి ముడి పదార్థాలు, నిర్దిష్ట టెక్స్‌టైల్ ఇన్‌పుట్స్‌పై డ్యూటీ తగ్గింపు కారణంగా లెదర్ ఉత్పత్తులు, దుస్తుల ధరలు తగ్గుతాయి.

సముద్ర ఉత్పత్తులు: రొయ్యల ఫీడ్ వంటి సీఫుడ్ ప్రాసెసింగ్ ఇన్‌పుట్స్‌పై డ్యూటీ-ఫ్రీ దిగుమతి పరిమితి ఎఫ్‌ఓబీ విలువలో 1% నుంచి 3%కి పెరిగింది. ఎఫ్‌ఓబీ విలువ అంటే సరుకు నౌకలో ఎక్కించే వరకు ఉన్న ఎగుమతి ధర.

క్రీడా పరికరాలు: క్రీడల్లో పాల్గొనడాన్ని ప్రోత్సహించేందుకు క్రీడా వస్తువుల ధరలు మరింత తగ్గిస్తామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.

వేటి ధరలు పెరుగుతాయి?
మేక్ ఇన్ ఇండియాకు ప్రోత్సాహం దృష్ట్యా దేశీయ తయారీదారుల కోసం కొన్ని వస్తువులపై మినహాయింపులు తొలగించారు. దాంతో ధరలు పెరుగుతాయి.

తక్కువ దిగుమతులు ఉన్న వస్తువులు: దేశీయ ఉత్పత్తి సరిపడా ఉన్న చోట్ల లేదా దిగుమతులు అతి తక్కువగా ఉన్న వస్తువులపై మినహాయింపులు తొలగించారు.

పలు పారిశ్రామిక వస్తువులు: పారిశ్రామిక సరుకులపై కస్టమ్స్ టారిఫ్ రేట్లు సవరించడం వల్ల కొన్ని యంత్రాలు, భాగాల ధరలు పెరిగే అవకాశం ఉంది.

పొగాకు ఉత్పత్తులు: సిగరెట్లు, పాన్ మసాలా వంటి పొగాకు వస్తువులపై ఎక్సైజ్ డ్యూటీ, హెల్త్ సెస్ పెంపుతో ధరలు అధికం అవుతాయి.

మరోవైపు, ఆదాయపు వివరాలు సరిగ్గా చూపనివారికి జరిమానా 100 శాతం పెరిగింది.

పూర్తి వివరాలు

వర్గం వస్తువు ప్రభావం బడ్జెట్ మార్పు
ఆరోగ్యం మధుమేహం, క్యాన్సర్ మందులు (17 ఔషధాలు) తగ్గింపు కస్టమ్స్ డ్యూటీ సడలింపు
ఎలక్ట్రానిక్స్ మొబైల్ ఫోన్లు తగ్గింపు భాగాలు, క్యాపిటల్ గూడ్స్‌పై డ్యూటీ తగ్గింపు
ఎలక్ట్రిక్ వాహనాలు ఈవీ బ్యాటరీలు (లిథియం-అయాన్ సెల్స్) తగ్గింపు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు
విమానయానం పౌర విమాన భాగాలు తగ్గింపు బీసీడీ మినహాయింపు
రక్షణ రంగం విమాన ఎంఆర్ఓ ముడి పదార్థాలు తగ్గింపు కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు
వ్యక్తిగత దిగుమతులు వ్యక్తిగత వినియోగానికి దిగుమతి చేసే వస్తువులు తగ్గింపు డ్యూటీ 20% నుంచి 10%కు తగ్గింపు
లెదర్, వస్త్ర రంగం లెదర్ ఉత్పత్తులు, టెక్స్‌టైల్ ఇన్‌పుట్స్ తగ్గింపు ముడి పదార్థాలపై డ్యూటీ తగ్గింపు
సముద్ర ఎగుమతులు సీఫుడ్ ప్రాసెసింగ్ ఇన్‌పుట్స్ తగ్గింపు డ్యూటీ-ఫ్రీ పరిమితి ఎఫ్‌ఓబీ విలువలో 3%కు పెంపు
క్రీడలు క్రీడా పరికరాలు తగ్గింపు డ్యూటీ సవరింపు
దిగుమతులు ఇప్పుడు భారత్‌లో తయారవుతున్న వస్తువులు పెరుగుదల కస్టమ్స్ మినహాయింపుల ఉపసంహరణ
పరిశ్రమ ఎంచుకున్న పారిశ్రామిక యంత్రాలు పెరుగుదల టారిఫ్ పునర్వ్యవస్థీకరణ
పొగాకు సిగరెట్లు, పాన్ మసాలా పెరుగుదల ఎక్సైజ్ డ్యూటీ, హెల్త్ సెస్ పెంపు