UPI Payments : UPI మాయాజాలం.. ఎంత సంపాదించినా.. నెలాఖరులో అప్పు.. అసలేం జరుగుతుందో తెలుసా..!
UPI Payments : ఎంత సంపాదించిన చేతిలో డబ్బులు మిగలడం లేదా.. నెలాఖరులో బడ్జెట్ టైట్ అయ్యిందా.. మరి దీని వెనక కారణం ఎంటంటే.. UPI మాయాజాలం అంటున్నారు.
- Dharani Pilli
- Updated on- April 26, 2026 / 04:51 PM IST
Using UPI daily makes your monthly budget tighter here are some reasons
UPI Payments : నెలకు భారీగానే సంపాదన ఉంది. జీతం చేతిలో పడగానే.. ఈ నెల ఇంత పొదుపు చేయాలని అనుకుంటాం.. రోజులు గడుస్తుంటాయి.. నెలాఖరు వచ్చేస్తుంది. తీరా చూస్తే అకౌంట్లో డబ్బులు నిల్లు.. మళ్లీ అప్పు చేసే పరిస్థితి. అదేంటి ప్రారంభంలో డబ్బులు బాగానే ఉన్నాయి పొదుపు చేద్దామనుకున్నాం కదా.. మరి ఇదేంటి అంటే.. అసలు డబ్బులు ఎక్కడ ఎలా ఖర్చవుతున్నాయి.. అసలు సమస్య ఎక్కడ ఉంది.. ఖాతాలో డబ్బులు ఎక్కడికి పోతున్నాయంటే.. ఇదంతా UPI మాయాజాలం అంటున్నారు ఆర్థిక నిపుణులు. చేతిలో స్మార్ట్ ఫోన్.. ఖాతాలో డబ్బు.. ఇంకేముంది ప్రతి చోటా స్కాన్ చేయడం.. డబ్బులు చెల్లించడం. తీరా చూస్తే నెలాఖరుకి చేతిలో డబ్బులు మాయం. ఈ పరిస్థితి వెనక ఉన్న ప్రధాన కారణం UPI చెల్లింపులు అంటున్నారు.
దేశంలో యూపీఐని వేగవంతం, సులభతరం చేసినప్పటికీ.. ఖర్చు చేయడం కూడా అలానే మారింది. చూడ్డానికి ఈజీగా కనిపించే ఈ యూపీఐ పేమెంట్స్.. నిశ్శబ్దంగా మీ నెలవారీ బడ్జెట్‌ను దెబ్బతీస్తున్నాయి అంటున్నారు ఆర్థిక నిపుణులు.
UPI వల్ల చేతిలో నగదు తీసుకెళ్లాల్సిన పని లేదు. ఒక చిన్న స్కాన్ చేస్తే పని అయిపోతుంది. ఇక్కడ భౌతికంగా డబ్బు చేతులు మారడం లేదు, నోట్లు లెక్కించే అవకాశం ఉండదు, అందుకే ఖర్చు చేసేటప్పుడు పెద్దగా ఆలోచన రాదు. చివరకి ఇది ప్రణాళిక లేని ఖర్చులకు దారితీస్తుంది. రోజంతా మనం చేసే ఈ చిన్న చిన్న కొనుగోళ్లు విడివిడిగా చూస్తే తక్కువగానే అనిపించవచ్చు, కానీ అవన్నీ కలిస్తే నెల చివరికి పెద్ద మొత్తంగా మారుతాయి. ఈ చిన్న చిన్న ఖర్చులు మన మెదడులో పెద్దగా నమోదు కావు. కానీ ఈ అదృశ్య ఖర్చులు అన్నీ కలిసి.. మీ నెలవారీ పొదుపును హరిస్తున్నాయి అంటున్నారు.
మీరు చేతి నుంచి నగదు రూపంలో డబ్బులు చెల్లిస్తే.. అప్పుడు మీ చేతి నుంచి డబ్బు స్వయంగా ఖర్చవ్వడం మీరు ప్రత్యక్షంగా చూస్తారు. ఇది మీ మెదడుకు హెచ్చరికలా పని చేస్తుంది. దీంతో డబ్బులు ఖర్చు చేసే విషయంలో అప్రమత్తం అవుతాం. కానీ అదే UPI డిజిటల్ కావడంతో ఆ మానసిక భయం కలగదు. దీంతో జనాలు తాము ఎంత ఖర్చు చేస్తున్నామనే అంశం అర్థం కాదు. ఫలితంగా తెలియకుండానే డబ్బులు ఖర్చవుతాయి.
మరి ఎలా బయటపడాలి
- UPI ఖర్చులను మేనేజ్ చేయడం అంటే వాటిని పూర్తిగా వినియోగించకుండా ఉండటం కాదు. కాకపోతే వాటి మీద నియంత్రణ అవసరం.
- నెలవారీ బడ్జెట్‌ను ముందే నిర్ణయించుకోండి.
- రోజువారీ ఖర్చులను గమనించుకోండి.
- అనవసరమైన కొనుగోళ్లకు ముందు ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి.
- వీలైతే రోజువారీ ఖర్చుల కోసం ఒక ప్రత్యేక అకౌంట్‌ను నిర్వహించండి.
- తరచుగా మీరు చేసే ఖర్చులను గమనించుకోవాలని సూచిస్తున్నారు.
