Bengaluru Cop Wife : పోలీసు కానిస్టేబుల్ భార్య మృతి.. అంతకు ముందే చెల్లికి వాట్సాప్ లో ఫోన్ పాస్వర్డ్ మెసేజ్.. కట్ చేస్తే..
Bengaluru Cop Wife : బెంగళూరు కానిస్టేబుల్ భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
- Dharani Pilli
- Updated on- May 24, 2026 / 10:08 PM IST
Bengaluru police constable wife dies ends life dowry harassment case filed
Bengaluru Cop Wife : కుమార్తె జీవితం బాగుండాలని.. ప్రభుత్వ ఉద్యోగం చేసే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. వారికి 8 నెలల కుమార్తె కూడా ఉంది. డెలివరీ తర్వాత పుట్టింటికి వెళ్లి 6 నెలల తర్వాత అత్తింటికి వచ్చింది. రెండు నెలలు గడిచాయో లేదో.. దారుణం సంభవించింది. పసిబిడ్డతో సంతోషంగా గడపాల్సిన తల్లి అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆమె చనిపోవడానికి కొన్ని గంటల ముందే తన ఫోన్ పాస్ వర్డ్ ని చెల్లికి వాట్సాప్ చేసింది. అనుమానం వచ్చిన చెల్లి కాల్ చేసినా లాభం లేకపోయింది. చివరకు తన अका చనిపోయిందనే వార్త తెలిసింది. మరో విషయం ఏంటంటే.. చనిపోయిన మహిళ భర్త పోలీసు కానిస్టేబుల్ కావడం గమనార్హం. ఈ దారుణ సంఘటన కర్ణాటక, బెంగళూరులో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన లక్ష్మీ ప్రియ (26)కు.. మైసూర్ ప్రాంతానికి చెందిన పోలీసు కానిస్టేబుల్ రాజేష్‌తో మూడు సంవత్సరాల క్రితం అనగా మే 11, 2023న పెళ్లి జరిగింది. ప్రస్తుతం రాజేష్ బెంగళూరులోని హెచ్ఏఎల్ (HAL) పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో రాజేష్, లక్ష్మీ దంపతులు బెంగళూరులోని కేఆర్‌పురం ఏరియాలో ఉన్న పోలీస్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. అయితే పెళ్లైన కొన్ని రోజుల నుంచే రాజేష్, అతడి తల్లిదండ్రులు లక్ష్మీని అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించారు.
ఈ క్రమంలో ఎనిమిది నెలల క్రితం లక్ష్మీ ప్రియ ఆడపిల్లకు జన్మనిచ్చింది. డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన లక్ష్మీ ప్రియ.. దాదాపు ఆరు నెలల పాటు అక్కడే ఉంది. రెండు నెలల క్రితమే తిరిగి బెంగళూరులో వారు నివాసం ఉంటున్న పోలీస్ క్వార్టర్స్‌కు వచ్చింది. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం అంటే మే 22, 2026 మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో లక్ష్మీ ప్రియ తన చెల్లెలికి వాట్సాప్‌లో ఒక మెసేజ్ పంపింది. అందులో తన మొబైల్ ఫోన్ ‘పాస్‌వర్డ్’ను షేర్ చేసింది.
ఈ మెసేజ్ చూసి లక్ష్మీ ప్రియ సోదరికి ఏమీ అర్థం కాలేదు. ఇంత అకస్మాత్తుగా తన ఫోన్ పాస్‌వర్డ్ పంపడంతో.. ఆమె చెల్లెలికి అనుమానం వచ్చింది. వెంటనే అక్కకు కాల్ చేసింది. కానీ ఎన్ని సార్లు కాల్ చేసినా లక్ష్మీ ప్రియ ఫోన్ ఎత్తలేదు. ఈ విషయం గురించి వెంటనే బాధితురాలి తల్లిదండ్రులకు చెప్పడంతో, వారు వెంటనే లక్ష్మీ ప్రియ భర్త రాజేష్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆ తర్వాత కాసేపటికే లక్ష్మీ ప్రియ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని రాజేష్ ఆమె తల్లిదండ్రులకు కాల్ చేసి సమాచారం అందించాడు.
అయితే, చనిపోయే ముందు ఫోన్ పాస్‌వర్డ్ చెల్లికి పంపడం, అప్పటికే ఇంట్లో భర్త, అత్తమామలు తనను అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో.. లక్ష్మీ ప్రియది ఆత్మహత్య కాదని, ఆమె మృతి వెనుక భర్త, అత్తమామల హస్తం ఉందంటూ పుట్టింటి వారు ఆరోపించారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేఆర్‌పురం పోలీసులు కానిస్టేబుల్ రాజేష్, అతని తల్లిదండ్రులపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
