డబ్బు కోసం ఫ్రెండ్ ని మూడు ముక్కలుగా నరికాడు

  • Publish Date - August 19, 2020 / 09:27 AM IST

ధనంమూలం మిదం జగత్ అనేది నానుడి. బతకటానికి డబ్బు కావాలి… కష్టపడి డబ్బు సంపాదించుకుంటే వచ్చే ఆనందం, తృప్తి వేరు. దాన్ని వక్రమార్గంలో సంపాదించాలనుకునే సరికే ఇబ్బందులు తలెత్తి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు జనాలు.



అప్పుగా తనకు డబ్బులివ్వలేదని ఒక వ్యక్తిని అతడి స్నేహితుడే ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా లో చోటు చేసుకుంది. జిల్లాలోని కాస్లాబాద్ గ్రామానికి చెందిన తట్టెపల్లి రాజు(35) అనే వ్యక్తి 3 రోజులనుంచి కనపడట్లేదు. మంగళవారం ఆగస్ట్18 న  గ్రామంలోని ఓ వ్యవసాయ భూమిలో గుర్తు తెలియని మృతదేహానికి సంబంధించి  కాళ్లను రైతులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటనా స్ధలానికి వచ్చిన  పోలీసులు గ్రామస్తుల సహకారంతో అవి ఎవరి కాళ్లో గుర్తించేందుకు  గాలింపు చేపట్టారు. సమీపంలోని వ్యవసాయ భూమిలో మొండెం వరకు ఉన్న భాగాన్ని గుర్తించి కాళ్లు మొండెం ఒక చోట చేర్చి చూశారు. హతుడిగా భావిస్తున్న వ్యక్తిని గుర్తించారు. అతడ్ని హత్య చేసే అవసరం ఎవరికుంది అనే కోణంలో…విచారిస్తుండగా అనుమానితుడు దొరికాడు.



పోలీసులు తమదైన స్టైల్లో ప్రశ్నించేసరికి అనుమానిత నిందితుడు వివరాలు చెప్పాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు మురుగుకాల్వలో పడేసిన తలను గుర్తించారు. మూడు భాగాలను ఒక చోట చేర్చి హత్య మిస్టరీని చేధించారు.

హత్యకు గురైన రాజు 
కాగా… పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని షాద్ నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించటానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో గ్రామ సర్పంచ్ మోకర్ల గోపాల్ , పంచాయతీ ట్రాక్టర్ తో ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు.



కాగా… అనుమానిత నిందితుడు, మృతుడు రాజు స్నేహితులు. మృతుడు రాజు జులాయిగా తిరుగుతూ ఉండేవాడు. ఏ పనీ చేసేవాడు కాదు. ఇటీవల తనకున్న వ్యవసాయ భూమిని అమ్మడంతో భారీగా డబ్బులు వచ్చాయి. గత కొద్ది రోజులుగా రాజు, అనుమానిత నిందితుడు ఇద్దరూ కలిసి గ్రామంలో మద్యం సేవించి తిరుగుతూ ఉన్నట్లు గ్రామస్తులు చెప్పారు.

భూమి అమ్మగా వచ్చిన దాంట్లోనుంచి కొంతడబ్బు తనకు అప్పుగా ఇవ్వమని నిందితుడు రాజును కోరాడు. రాజు అందుకు నిరాకరించటంతో పగ పెంచుకున్న స్నేహితుడే హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడి ఇంటినుంచి హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్యలో మరిన్నినిజాలు వెలికి తీసేందుకు పోలీసులు కేసు విచారణ కొనసాగిస్తున్నారు.