Palnadu Female Employee : మహిళా ఉద్యోగినిపై దారుణం.. పాపమని మంచి నీళ్లిచ్చినందుకు.. కాళ్లు, చేతులు కట్టేసి.. నరకం చూపాడు
Palnadu Female Employee : దాహంగా ఉంది మంచి నీళ్లు ఇవ్వమని అడిగాడు. పాపమని జాలిపడినందుకు ఆ మహిళా ఉద్యోగినిపై దారుణంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేసేందుకు యత్నించాడో దుండగుడు.
- Dharani Pilli
- Published On : April 3, 2026 / 03:57 PM IST
Palnadu macherla female government employe brutally assulted
Palnadu Female Employee : ఆమె ఓ ప్రభుత్వ ఉద్యోగిని.. అనారోగ్యం కారణంగా ఇంటి వద్దే ఉంటుంది. ఈ క్రమంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి ఆమె ఇంటికి వచ్చి.. దాహమేస్తుంది.. తాగడానికి కాసిన్ని మంచి నీళ్లివ్వమని అడిగాడు. పాపం ఎండలో గొంతెండుకుపోతే ఇబ్బందని భావించి.. సదరు ఉద్యోగిని దుండగుడికి మంచి నీళ్లు తేవడానికి ఇంట్లోకి వెళ్లింది. ఇదే అదునుగా ఆమె వెనకే ఇంట్లోకి వెళ్లిన ఆ దుండగుడు.. పాపమని దయతలచిన మహిళపైనే దారుణానికి ఒడిగట్టాడు. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి.. కత్తితో బెదిరించి.. అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలు నోరు విప్పితే తనకు ప్రమాదం అని భావించి.. ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఈ దారుణ సంఘటన పల్నాడు జిల్లా, మాచర్ల పట్టణంలో వెలుగు చూసింది.
ఒంటరిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం చేయడమే కాక.. ఆపై ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించాడు ఓ దుర్మార్గుడు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం… సదరు మహిళ మాచర్ల పట్టణంలోని ఓ స్థానిక ప్రభుత్వ కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె ఇంటికి వచ్చి.. దాహం ఉంది.. కాసిన్నీ మంచి నీళ్లు ఇవ్వమని అడిగాడు. దీంతో పాపమని జాలి పడి దుండగుడికి మంచి నీళ్లు ఇచ్చేందుకు ఆ మహిళ ఇంట్లోకి వెళ్లింది.
ఇదే అదునుగా దుండగుడు ఆమెను అనుసరిస్తూ.. వెనకే ఇంట్లోకి వెళ్లాడు. ఆ తర్వాత అతడి వద్ద ఉన్న కత్తితో.. ఉద్యోగినిని బెదిరించి.. ఆమె చున్నీతోనే కాళ్లు చేతులు కట్టివేసి అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలు నోరు విప్పితే తనకు ప్రమాదం అని భావించి.. ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అత్యంత పాశవికంగా బాధితురాలి సున్నిత ప్రదేశంలో ఇనుప రాడ్లతో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. గాయాల ధాటికి తాళలేక ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో ఆమె చనిపోయిందని భావించిన దుండగుడు.. అక్కడ నుంచి పరారయ్యాడు. కాసేపటికి స్పృహలోకి వచ్చిన బాధితురాలు.. తన తల్లికి కాల్ చేసి సమాచారం అందించింది. విషయం విన్న వెంటనే బాధితురాలి తల్లి కొడుక్కి కాల్ చేసి.. కుమార్తె పరిస్థితి వివరించి.. అక్కను కాపాడమని కోరింది.
అతడు మాచర్ల పట్టణంలో తనకు తెలిసిన స్నేహితులకు విషయం చెప్పగా.. వారు స్థానికుల సాయంతో బాధితురాలి కట్లు విప్పి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని గుర్తించేందుకు ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
బాధితురాలి తండ్రి చనిపోవడంతో.. కారుణ్య నియామకం కింద ఆమెకి ఉద్యోగం వచ్చింది. సంవత్సర కాలంగా ఆమె అటెండర్ ఉద్యోగం చేస్తుంది. ఇదిలా ఉంటే నెల రోజుల క్రితం ఆమెకు గుంటూరు బదిలీ అయ్యింది. అయితే బాధితురాలికి అనారోగ్య సమస్యలు ఉండటంతో.. మాచర్లలోనే కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉన్నతాధికారులను కోరింది. అయితే వారి వద్ద నుంచి ఉత్తర్వులు రాకపోవడంతో గత నెల రోజులుగా ఆమె విధులకు హాజరుకావడం లేదు. ఇంటి దగ్గరే ఉంటున్న క్రమంలో ఇంత దారుణం చోటు చేసుకుంది.
