రోడ్డు ప్రమాదం : మెట్రో స్టేషన్ రెయిలింగ్ లో తల ఇరుక్కుని యువకుడి మృతి
- murthy
- Published On : December 11, 2020 / 11:58 AM IST
Ammerpet Accident
ameerpet road accident, young man died :హైదరాబాద్ అమీర్ పెట చౌరస్తాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కేపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన గిరీష్ గుప్తా(24), అతని స్నేహితుడు రవితేజ ఇద్దరూ ద్విచక్రవాహనంపై పంజాగుట్ట నుంచి కూకట్‌పల్లి వైపు బయల్దేరారు.
బైక్ నడిపే క్రమంలో వేగం పెంచటంతో అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్దకు రాగానే ద్విచక్రవాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో గిరీష్ గుప్తా తల మెట్రో స్టేషన్ రైలింగ్‌లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రవితేజను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు గ్యాస్‌కట్టర్‌తో ఇనుప కడ్డీలను తొలగించి గుప్తాను బయటకు తీశారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పంజాగుట్ట అడ్మిన్ ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.
కాగా …..మెట్రో రెయిలింగ్ లో గిరీష్ గుప్త తల ఇరుక్కొని చనిపోవటం విస్మయం కలిగిస్తోంది. ప్రమాదం జరిగిన తీరు మాత్రం అంతు చిక్కడం లేదు. యువకుడి తల అత్యంత సన్నగా ఉండే రెయిలింగ్‌లో ఎలా ఇరుక్కుంది అనే దానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు. ప్రమాదం జరగ్గానే ఇలా ఎలా జరిగిందన్న అంశంపై పోలీసులు శోధిస్తున్నారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
