Indian Bank Representative Image (Image Credit To Original Source)
Bengaluru Bank: అదో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. అతడు అసిస్టెంట్ మేనేజర్. మంచి పొజిషన్. శాలరీ కూడా బాగానే వస్తుంది. అయినా అతడి బుద్ధి పక్క దారి పట్టాడు. దొంగ అవతారం ఎత్తాడు. కస్టమర్ల గోల్డ్ పై కన్నేశాడు. అంతే.. 2.7 కిలోల బంగారం కొట్టేశాడు. దీని విలువ 4 కోట్ల రూపాయలపైనే ఉంటుంది. కొన్నాళ్లు అతడి బాగోతం నడిచింది. చివరికి పాపం పండి అతడి బాగోతం బట్టబయలైంది. భారీ మోసం వెలుగులోకి వచ్చింది.
ఈ షాకింగ్ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ కు అలవాటు పడ్డ ఓ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ కస్టమర్లకు చెందిన 2.7 కిలోల బంగారాన్ని (దాదాపు రూ.4 కోట్లు) కొట్టేశాడు. ఇండియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ కిరణ్.. మేనేజర్ లేని సమయంలో తన లాకర్ యాక్సెస్‌తో కస్టమర్ల గోల్డ్ కొట్టేశాడని విచారణలో తేలింది. అలా కొట్టేసిన గోల్డ్ ను తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో అతడు బెట్టింగ్ ఆడేవాడు. ఓ మహిళా కస్టమర్ తన బంగారం కోసం బ్యాంకుకి రావడంతో అతగాడి బండారం బయటపడింది. పోలీసులు కిరణ్‌ను అరెస్ట్ చేశారు. అతి నుంచి 700 గ్రాముల గోల్డ్ రికవరీ చేశారు.
నిందితుడు కిరణ్ కుమార్. గిరినగర్ బ్రాంచ్ లోని ఇండియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్. ఫిబ్రవరి 2న ఒక కస్టమర్ తనఖా పెట్టిన బంగారాన్ని తిరిగి తీసుకోవడానికి బ్యాంకును సందర్శించినప్పుడు ఈ నేరం వెలుగులోకి వచ్చింది. లోన్ తీర్చేసిన మహిళ.. బ్యాంకులో తాకట్టు పెట్టిన తన గోల్డ్ ఆభరణాలను విడిపించుకుంది. అయితే, అందులో అనేక ఆభరణాలు కనిపించకుండా పోయాయి. దీంతో ఆమె షాక్ కి గురైంది. వెంటనే మేనేజర్ దృష్టికి తీసుకెళ్లింది. ఆయన వెంటనే విచారణకు ఆదేశించారు. విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. అసిస్టెంట్ మేనేజర్ చోరీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
“గత ఒక సంవత్సరం నుండి మా వద్ద రుణాల కోసం తాకట్టు పెట్టిన 207 బంగారు ఆభరణాల ప్యాకెట్లపై వెంటనే స్టాక్ వెరిఫికేషన్ నిర్వహించాము. వాటిలో 24 ప్యాకెట్లు తారుమారు అయ్యాయి. పరీక్షలో మూడు ప్యాకెట్లలోని బంగారం పూర్తిగా మాయమైందని గుర్తించారు. మిగిలిన 21 ప్యాకెట్లలోని బంగారు ఆభరణాలు పాక్షికంగా కనిపించలేదు. అంతర్గత విచారణ నిర్వహించగా జూన్ 2025-జనవరి 2026 మధ్య వాటిని దొంగిలించినట్లు కిరణ్ అంగీకరించాడు” అని మేనేజర్ తెలిపారు.
ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో కిరణ్ తన నేరాన్ని ఒప్పుకున్నాడు. మొత్తం 2.787 కిలోగ్రాముల బంగారాన్ని దొంగిలించినట్లు అంగీకరించాడు. దీని విలువ 4 కోట్ల 12 లక్షలు. దొంగలించిన ఆభరణాలను అతడు మణప్పురం ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్‌లలో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. కాగా, తన పై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా కిరణ్ ప్లాన్ చేశాడు. చాలా కాలంగా కస్టమర్లు టచ్ చేయని లాకర్ల నుండి అతడు ఎక్కువగా గోల్డ్ చోరీ చేసినట్లు తేలింది.
అలా పొందిన డబ్బును ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లు, జూదం కార్యకలాపాలకు ఖర్చు చేశాడు. దీంతో ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయాడు. పోలీసులు కిరణ్ కుమార్‌ను అరెస్టు చేసి కీలకమైన ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఉద్యోగే భారీ చోరీకి పాల్పడటం సంచలనంగా మారింది. ఈ విషయం బటయకు రావడంతో ఆ బ్యాంకులో గోల్డ్ ను తనఖా పెట్టిన కస్టమర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
తనఖా పెట్టిన బంగారు ఆభరణాలను వేర్వేరు లాకర్లలో ఉంచుతారు. మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ దగ్గర మాత్రమే వాటి కీస్ ఉంటాయి. కిరణ్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. తన దగ్గర ఉన్న కీస్ తో లాకర్లలోకి ప్రవేశించి ఒక్కొక్కటిగా దొంగిలించాడు. ఈ ఘటన తర్వాత పోలీసులు కస్టమర్లను అలర్ట్ చేశారు. బ్యాంకులో లాకర్ సౌకర్యాలు (వ్యక్తిగత ఉపయోగం కోసం లేదా రుణాలపై తాకట్టు పెట్టడానికి) పొందుతున్న కస్టమర్లు తమ స్టాక్‌ను క్రమంగా తనిఖీ చేసుకుంటూ ఉండాలన్నారు.
Also Read: 15 రోజుల్లో 12 మరణాలు.. మృతుల్లో ఐదుగురు స్కూల్ పిల్లలు.. గ్రామంలో కలకలం