రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేష్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. 65శాతం కాలిన గాయాలతో ఉస్మానియా
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేష్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. 65శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేష్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. సురేష్ కండీషన్ ఇంకా సీరియస్ గానే ఉందన్నారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేంద్ర తెలిపారు. సురేష్ దేహం చికిత్సకు సహకరించడం లేదన్నారు. మరో 48 గంటలు గడిస్తే కానీ సురేష్ ఆరోగ్య పరిస్థితి గురించి ఏమీ చెప్పలేము అంటున్నారు. ప్రస్తుతం అతడిని ప్లాస్టిక్ సర్జరీ వార్డులో అబర్జేషన్ లో ఉంచామన్నారు. 65శాతం కాలిన గాయాలతో నవంబర్ 4న సురేష్ ఆస్పత్రిలో చేరాడు.
తహశీల్దార్ హత్య కేసులో సురేశ్ నుంచి పోలీసులు ఇప్పటికే వాంగ్మూలం నమోదు చేశారు. తహశీల్దార్ ని రక్షించడానికి ప్రయత్నించిన డ్రైవర్ గురునాథం చికిత్స పొందుతూ మంగళవారం(నవంబర్ 5,2019) మృతి చెందిన సంగతి తెలిసిందే.
తహశీల్దార్ విజయారెడ్డిపై సురేశ్ పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన విజయారెడ్డి స్పాట్ లోనే చనిపోయారు. సోమవారం(నవంబర్ 4,2019) మధ్యాహ్నం తహశీల్దార్ కార్యాలయంలో విజయారెడ్డి ఛాంబర్‌లోనే ఈ దారుణం జరిగింది. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో తహశీల్దార్ ను కలిసేందుకు కార్యాలయానికి వచ్చిన సురేష్.. మాట్లాడాలని చెప్పి నేరుగా తహశీల్దార్ ఛాంబర్‌కు వెళ్లాడు.
తలుపులు వేసి విజయపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో సురేష్ తో పాటు తహశీల్దార్ డ్రైవర్, అటెండర్ కి కూడా మంటలు అంటుకుని గాయాలు అయ్యాయి. ఆ తర్వాత చికిత్స పొందుతూ డ్రైవర్ చనిపోయాడు. భూ వివాదమే మర్డర్ కి కారణం అని పోలీసుల విచారణలో తేలింది.