మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో దారుణం జరిగింది. జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో డెంటల్ కాలేజీ వెనుకున్న డంపింగ్ యార్డు దగ్గర మృతదేహాలు కలకలం రేపాయి.
మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో దారుణం జరిగింది. జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో డెంటల్ కాలేజీ వెనుకున్న డంపింగ్ యార్డు దగ్గర మృతదేహాలు కలకలం రేపాయి. అనుమానాస్పద స్థితిలో మూడు(ఇద్దరు యువతులు, ఒక చిన్నారి) మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇద్దరు యువతులు వేర్వేరు చెట్లకు ఉరేసుకున్నారు. ఘటనా స్థలానికి సమీపంలోనే 12ఏళ్ల వయసున్న పాప మృతదేహం పడి ఉంది. ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిది హత్యా? ఆత్మహత్యా? అనే మిస్టరీ నెలకొంది. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలో రెండు గ్లాసులు, మాత్రలు, కూల్‌డ్రింక్ బాటిల్ లభ్యమయ్యాయి. దీంతో అందులో ఏదైనా విష పదార్థం కలుపుకుని తాగి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా పాపకు విషం తాగించి.. ఆ పాప చనిపోయిన తర్వాత వారిద్దరూ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరు యువతుల్లో ఒకరు పాపకు తల్లిగా పోలీసులు గుర్తించారు. వీరి ఆత్మహత్యకు కుటుంబ కలహాలు లేదా ఆర్థిక సమస్యలు కారణమై ఉండొచ్చన్న అనుమానం వ్యక్తమవుతోంది.
స్పాట్ లో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మృతుల వివరాలను తెలుసుకోవడం పోలీసులకు సవాల్ గా మారింది. జవహర్‌నగర్ ప్రాంతంలో మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి అనేక కుటుంబాలు వలస వచ్చి జీవిస్తుంటారు. దీంతో మృతులు స్థానికులా? లేదా ఇతర ప్రాంతాలకు చెందిన వారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. (అమెరికాలో నల్లజాతీయుడి కాల్పుల్లో గాయపడ్డ నెల్లూరు యువకుడు కోలుకుంటున్నాడు)
అసలు వారు ఎవరు? డంపింగ్ యార్డ్ దగ్గరికి వచ్చి ఎందుకు మరణించారు? అనేది తెలియాల్సి ఉంది. డెంటల్ కాలేజీ ప్రాంగణంలో అమర్చిన సిసి కెమెరాల దృశ్యాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని చూస్తున్నారు. అభం శుభం తెలియని ముగ్గురు ఆడపిల్లలు దయనీయమైన స్థితిలో విగత జీవులుగా కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ ఈ మరణాల వెనుక ఎవరిదైనా హస్తం ఉందని తెలిస్తే వారికి కఠిన శిక్షించాలని కోరుతున్నారు. ఈ ట్రిపుల్ మరణాల మిస్టరీని త్వరలోనే చేధిస్తామని పోలీసులు తెలిపారు.