Cyber Scam: రూ.5 వేలకు ఆశ పడ్డాడు.. కట్ చేస్తే రూ.2 కోట్లు పోగొట్టుకున్న టెకీ.. హైదరాబాద్ లో ఘరానా సైబర్ మోసం
షేర్ల గురించి తన దగ్గర సలహాలు తీసుకుని ఎంతోమంది డబ్బు సంపాదించారని కబుర్లు చెప్పాడు. అంతేకాదు.. నిజం అనిపించేలా అందుకు ఆధారంగా స్క్రీన్ షాట్స్ కూడా పోస్ట్ చేసే వాడు.
Cyber Crime Representative Image (Image Credit To Original Source)
- భారీ లాభాల పేరుతో ఘరానా మోసం
- 300 శాతం ప్రాఫిట్స్ అంటూ బురిడీ
- రూ.2.9 కోట్లు పోగొట్టుకున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్
- అత్యాశకు పోతే అంతే సంగతి అంటున్న పోలీసులు
Cyber Scam: సైబర్ నేరాల గురించి పోలీసులు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. సైబర్ మోసాలు ఏ విధంగా జరుగుతున్నాయో తెలియజేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని నెత్తి నోరు బాదుకుంటున్నారు. అత్యాశకు పోతే అడ్డంగా బుక్కైపోతారని హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. చదువుకోని వారే కాదు బాగా చదువుకున్న వారు, మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్న వారు సైతం సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. వారి మాయ మాటలు నమ్మి కష్టపడి సంపాదించిన డబ్బు పోగొట్టుకుంటున్నారు. వందలు, వేలు, లక్షలు కాదు.. ఏకంగా కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ ఐటీ ఉద్యోగి అడ్డంగా మోసపోయాడు. ఏకంగా 2 కోట్ల రూపాయలు కోల్పోయాడు.
బాధితుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్. శేరిలింగంపల్లిలో ఉంటాడు. 2025 నవంబర్ 12న వాట్సాప్ లో అతడికి ఒక లింక్ వచ్చింది. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ మెంట్స్ కు సంబంధించి సలహాలు ఇస్తాము అని అందులో ఉంది. అంతేకాదు.. పెట్టుబడి పెడితే దానిపై 300 శాతం లాభాలు పొందొచ్చని కబుర్లు చెప్పాడు. అంతే.. ఐటీ ఉద్యోగి టెంప్ట్ అయ్యాడు. డబ్బులు డబుల్ చేసుకోవడానికి మంచి ఛాన్స్ వచ్చిందని సంబరపడ్డాడు.
మరో ఆలోచన లేకుండా లింక్ క్లిక్ చేసి వాట్సాప్ గ్రూపులో జాయిన్ అయిపోయాడు. గ్రూపులో అనిల్ గోయల్ అనే వ్యక్తి ఐటీ ఉద్యోగిని పరిచయం చేసుకున్నాడు. ఇక బిల్డప్స్ మొదలుపెట్టాడు. షేర్ల గురించి తన దగ్గర సలహాలు తీసుకుని ఎంతోమంది డబ్బు సంపాదించారని కబుర్లు చెప్పాడు. అంతేకాదు.. నిజం అనిపించేలా అందుకు ఆధారంగా స్క్రీన్ షాట్స్ కూడా పోస్ట్ చేసే వాడు.
అంతేకాదు.. గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరు గ్యారెంటీగా 300 శాతం ప్రాఫిట్స్ పొంద వచ్చని నమ్మబలికాడు. అతడి మాయమాటలను గుడ్డిగా నమ్మేసిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. అదంతా నిజమే అని భావించాడు. అతడు చెప్పినట్లే యాప్ డౌన్‌లోడ్ చేసి రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాడు. ఇక ఇన్వెస్ట్ మెంట్ చేయడం స్టార్ట్ చేశాడు.
పలు విడతల్లో మొత్తం రూ.2.9 కోట్లు బదిలీ..
ముందుగా 2025 డిసెంబర్ 15వ తేదీన తొలిసారిగా 50 వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టాడు. వెంటనే 5 వేల రూపాయల లాభం వచ్చింది. అంతే అతడు మరింత అట్రాక్ట్ అయిపోయాడు. మరింత డబ్బు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా పలు మార్లు మొత్తం 2.9 కోట్ల రూపాయలు బదిలీ చేశాడు. పెట్టుబడి, లాభం కలిపి రూ.3.47 కోట్లకు చేరినట్లు యాప్‌లో వర్చువల్‌గా కనిపించేది. దాంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి తెగ మురిసిపోయాడు. అయితే, అతడి ఆనందం ఎంతో సేపు నిలవలేదు.
ఇంకా డబ్బు చెల్లించాలని డిమాండ్..
అప్పులు ఎక్కువ కావడంతో.. తన షేర్లలో కొన్నింటిని అమ్మేసి అప్పు తీర్చాలని అనుకున్నాడు. దీని గురించి వాట్సాప్ గ్రూపులో తనకు సలహాలిచ్చిన అనిల్‌ను ఫోన్‌లో కాంటాక్ట్ అయ్యాడు. షేర్ల విక్రయం గురించి అడిగాడు. అయితే, షేర్లు విక్రయించడం సాధ్యం కాదని అనిల్ చెప్పాడు. దాంతో ఐటీ ఉద్యోగి షాక్ తిన్నాడు. అంతేకాదు.. అదనంగా డబ్బు చెల్లించాలని అనిల్ సూచించాడు. దాంతో ఐటీ ఉద్యోగికి మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. నకిలీ యాప్‌లో తనతో పెట్టుబడులు పెట్టించి డబ్బు కొట్టేశారని గుర్తించాడు. తాను మోసపోయానని తెలుసుకుని లబోదిబోమని గుండె బాదుకున్నాడు.
వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఘరానా మోసంసై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ ఘరానా సైబర్ మోసం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఐటీ ఉద్యోగి పట్ల అంతా జాలి చూపుతున్నారు. భారీ లాభాలు అనగానే అత్యాశకు పోతే.. ఇదిగో ఇలానే అడ్డంగా బుక్కైపోతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Also Read: ఈ ట్రైన్లలో ఆర్‌ఏసీ ఉండదు.. ఓన్లీ కన్ఫార్మ్ స్లీపర్ క్లాస్.. చార్జీలు ఎంతో తెలుసా?
