తల్లి రెండో పెళ్లి – కుమారులు ఆత్మహత్య

  • Publish Date - June 14, 2020 / 04:03 AM IST

తల్లి వివాహేతర సంబంధం పెట్టుకుని ప్రియుడితో వెళ్లిపోయిందనే బాధతో ఆమె ఇద్దరు కుమారులు ఆత్మహత్య చేసుకున్నసంఘటన తమిళనాడులో జరిగింది. పుదుక్కోట, నామన సముద్రానికి చెందిన వెంకటాచలం(47) కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య జయదీప(40), విఘ్నేశ్వరన్ (20), యోగేశ్వరన్(18) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

పెద్ద కుమారుడు విఘ్నేశ్వరన్ పుదుక్కోటై ప్రభుత్వకాలేజీలో  బీకాం ఫైనల్ ఇయర్ చదువుతుండగా, యోగేశ్వరన్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. వెంకటాచలానికి ఆరోగ్యం సరిగా లేకపోవటంతో కుటుంబం నుంచి విడిపోయి ఒంటరిగా జీవిస్తున్నాడు.

ఇద్దరు కుమారులతో జయదీప వేరుగా జీవనం సాగిస్తోంది. ఈక్రమంలో ఆమెకు ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో జయదీప  రెండు రోజుల క్రితం తాను ప్రేమించిన వ్యక్తితో  పిల్లలను వదిలిపెట్టి వెళ్లిపోయింది.

దీంతో ఆందోళన చెందిన ఆమె కుమారులు ఇద్దరూ శుక్రవారం నాడు  తల్లి చీరతో, ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్నహత్య చేసుకున్నారు. శుక్రవారం ఉదయం వీరిద్దరూ ఇంటి తలుపులు తీసి బయటకు రాకపోవటంతో  ఇరుగు పొరుగు వారు తలుపులు పగల గొట్టి చూడగా ఈ విషాదం వెలుగు చూసింది. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.