Warangal : మామూలు స్కెచ్ కాదుగా.. భర్తను చంపేసేందుకు.. రూ.5 లక్షల సుపారీ.. కట్ చేస్తే
Warangal : వరంగల్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. కట్టుకున్న భర్తను హత్య చేయించేందుకు రూ.5 లక్షల సుపారీ ఇచ్చిందో మహిళ.
- Dharani Pilli
- Updated on- April 16, 2026 / 08:52 AM IST
woman give rs 5 lakh contract to kill her husband in warangal district
Warangal : నేటి కాలంలో వివాహేతర సంబంధాలు.. అందుకోసం చేసే దారుణాలు పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నాళ్లుగా వెలుగు చూస్తోన్న ఘటనలను పరిశీలిస్తే.. వివాహేతర బంధాల కోసం ఆడవారు హత్యలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. కట్టుకున్నవాడిని, కడుపున పుట్టిన పిల్లలను కడతేర్చడానికి ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. తాజాగా ఈ కోవకు చెందిన దారుణం వెలుగు చూసింది. వివాహేతర బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ మహిళ.. రూ. 5 లక్షల సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ దారుణం బుధవారం హనుమకొండ జిల్లాలో వెలుగు చూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా, పరకాల పట్టణంలోని సీఎస్ఐ కాలనీకి చెందిన మడికొండ సుమన్ అనే వ్యక్తికి కొన్నాళ్ల క్రితం లావణ్యతో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సుమన్ స్థానికంగా మెకానిక్ గా పని చేస్తుండగా.. లావణ్య పరకాలలో మున్సిపల్ కార్మికురాలిగా పని చేస్తోంది. ఈ క్రమంలో పరకాల ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో లావణ్యకు ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర బంధంగా మారింది. అయితే భర్త సుమన్ తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన లావణ్య ఎలాగైనా అతడిని చంపేయాలని నిర్ణయించుకుంది.
ఈ క్రమంలో ఏప్రిల్ 3న సుమన్, లావణ్యలు ఇద్దరూ వరంగల్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత రోజు నుంచి అంటే ఏప్రిల్ 4 నుంచి సుమన్ కనిపించకుండా పోయాడు. ఈ విషయం గురించి లావణ్య తన భర్త సుమన్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. రెండు రోజుల తర్వాత సుమన్ తల్లిదండ్రులు పరకాలలో లావణ్య ఇంటికి వచ్చి అతడి గురించి ఆరా తీశారు. అయితే అతడు ఇంకా కనిపించలేదని లావణ్య చెప్పడంతో.. సుమన్ తండ్రి సాంబయ్య 8వ తేదీన పరకాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రత్యేక టీమ్స్‌తో విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో సుమన్ సెల్‌ఫోన్ చివరి సిగ్నల్ ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో చూపించింది. అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆ ప్రాంతంలో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఒక మృతదేహాన్ని గుర్తించారు. అది సుమన్‌దే అని తెలుసుకున్నారు. కొందరు వ్యక్తులు సుమన్‌ను వరంగల్ నుంచి తీసుకెళ్లి గోవిందరావుపేట శివారులో మద్యం తాగించిన అనంతరం బీరు బాటిళ్లతో పొడిచి హత్య చేశారని.. మృతదేహాన్ని గుర్తు పట్టకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి కాల్చినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు.
ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుమన్‌ను లావణ్యే హత్య చేయించిందని వెల్లడయ్యింది. పరకాలలో పని చేస్తున్న లావణ్యకు అక్కడే పని చేసే మరో మహిళ సాయంతో గోవిందరావుపేటకు చెందిన ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. అతడితోనే సుమన్‌ను హత్య చేయించింది. ఇందుకు గాను రూ. 5 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం జరిగినట్లు సమాచారం. సుమన్‌ను హతమార్చేందుకు లావణ్య గతంలోనే రెండు సార్లు ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ రెండు ప్రయత్నాలు విఫలం కావడంతో సుపారీ ఇచ్చి అతడిని మర్డర్ చేయించిందని నిర్ధారించారు. ఈ మేరకు లావణ్యతో పాటు సుపారీ తీసుకుని సుమన్‌ను హత్య చేసిన గోవిందరావుపేటకు చెందిన వ్యక్తిని పరకాల పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
