Heal Admissions : ఇంటర్ లో చేరాలా.. ఈ కాలేజ్ లో సీటు వచ్చిందంటే పండగే.. ఉచితంగా చదువు, హాస్టల్.. కార్పొరేట్ వసతులతో
Heal Paradise Admissions : ఇంటర్ లో అత్యుత్తమ కాలేజీలో ఉచితంగా చదువుతో పాటు హాస్టల్, భోజన వసతి కూడా కల్పించే కళాశాల అయితే బాగుండు అనుకుంటున్నారా.. అయితే మీ కోసమే ఇది
- Dharani Pilli
- Updated on- April 12, 2026 / 11:57 AM IST
heal paradise admission 2026 27 academic year admissions for intermediate
Heal Admissions : నేటి కాలంలో సామాన్య జనాలు భయపడేది చదువు, వైద్యం ఖర్చులకే. గవర్నమెంట్ ఆస్పత్రులు, విద్యా సంస్థల్లో సరైన విద్యా బోధన ఉండదని భావించి.. అప్పులు చేసైనా సరే ప్రైవేటు సంస్థలకే వెళ్తుంటారు. అక్కడేమో వారు ప్రతి దానికి భారీగా వసూలు చేస్తుంటారు. అయితే రాష్ట్రంలో కొన్ని విద్యాసంస్థల్లో ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కాలేజీ కూడా ఆ కోవలోకే వస్తుంది. సుమారు 90 ఎకరాలకు పైగా సువిశాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కాలేజీ ప్రాంగణంలో విద్యార్థులకు కార్పొరేట్ వసతులతో కూడిన విద్య, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. అది కూడా పూర్తి ఉచితంగా. మరి ఇంటర్ లో జాయిన్ అవ్వాలనుకునే విద్యార్థులు, తల్లిదండ్రులు ఒక్కసారి ఈ కాలేజీ మీద లుక్కేయండి.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆ కాలేజీ హీల్ ప్యారడైజ్ (Heal Paradise) పాఠశాల. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా, ఆగిరిపల్లి మండలం, తోటపల్లిలో ఉంది. సుమారు 90 ఎకరాల సువిశాల ప్రాంగణంలో విస్తరించి ఉన్న ఈ కాలేజీని డాక్టర్ కోనేరు సత్యప్రసాద్ ఏర్పాటు చేశారు. ఈ కాలేజీలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 11వ తరగతి (ఇంటర్మీడియట్) ఇంగ్లీష్ మీడియంలో పలు గ్రూపుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కాలేజీలో ఇంటర్ లో ఎంపీసీ (MPC), బైపీసీ (BiPC), ఎంఈసీ (MEC) గ్రూపులు ఉన్నాయి.
పేద విద్యార్థులకు కూడా ఉచితంగా నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో హీల్ ప్యారడైజ్ కాలేజీని ఏర్పాటు చేశారు. ఇందులో సీటు పొందిన విద్యార్థులకు రెండేళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వీరికి ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడంతో పాటుగా.. హాస్టల్, భోజన సౌకర్యం కూడా కల్పిస్తారు. ఈ కాలేజీలో సీటు పొందాలని భావించే విద్యార్థులు అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. హీల్ ప్రవేశ పరీక్ష 2026 మరియు ఇంటర్వ్యూ ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు.
అనాథలు, అభాగ్యుల కోసం
ముఖ్యంగా అనాథల కోసం ఇది ఏర్పాటు చేయబడింది. తల్లిదండ్రులు ఇద్దరూ లేని వారు.. లేదా ఎవరో ఒకరిని కోల్పోయిన విద్యార్థులకు ఇందులో ప్రవేశం కల్పిస్తారు. ఈ హీల్ ప్యారడైజ్‌లో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఇంగ్లీష్ మీడియంలో.. అది కూడా సీబీఎస్ఈ (CBSE) నిబంధనల మేరకు.. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఇక్కడ విద్యా బోధన ఉంటుంది. ప్రస్తుతం ఇంటర్ లో చేరాలని భావించే విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేయాలంటే:
10వ తరగతిలో 480 మార్కులు లేదా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ విద్యార్థులు 400 పైన మార్కులు సాధించిన వారు అర్హులు.
కావాల్సిన డాక్యుమెంట్లు:
తెల్ల రేషన్ కార్డు, ఆదాయ ధ్రువపత్రం తప్పనిసరిగా సమర్పించవలసి ఉంటుంది.
ముఖ్యమైన తేదీ:
ఈ అర్హతలు ఉన్న వారు మే 18, 2026వ తేదీలోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో నేరుగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
ఇతర వివరాలకు అధికారిక వెబ్ సైట్ లేదా info@healparadise.org ద్వారా సంప్రదించవచ్చు. మరిన్ని వివరాల కోసం 9100024438, 9100024435 ఫోన్ నంబర్లకు కాల్ చేయవచ్చు.
