DSC 2.0 Notification : ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు భారీ అప్డేట్.. నెల రోజుల్లోనే నోటిఫికేషన్!
DSC 2.0 Notification : ఏపీలో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ నెల రోజుల్లో విడుదలకు ఏర్పాట్లు, 1,523 యూనివర్సిటీ అధ్యాపక పోస్టుల భర్తీ, డిసెంబర్లో రాత పరీక్ష, జీరో డ్రాప్అవుట్ మిషన్పై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
DSC 2.0 Notification
- టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా?
- ఏపీలో టీచర్ పోస్టుల భర్తీకి కసరత్తు.. DSC 2.0పై కీలక ప్రకటన
- అధికారులకు మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు
DSC 2.0 Notification : ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల రోజుల్లోనే డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖలో నియామకాలు, విద్యా ప్రమాణాల మెరుగుదలపై నిర్వహించిన సమీక్షలో మంత్రి పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల నుంచి పోస్టింగ్స్ వరకు మొత్తం నియామక ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా, సమర్థంగా నిర్వహించాలని మంత్రి లోకేష్ సూచించారు. నియామక ప్రక్రియలో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు.
పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా ‘మిషన్ మార్చ్’ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలని మంత్రి సూచించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంచడంతో పాటు చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.
జీరో డ్రాప్అవుట్ మిషన్ :
విద్యార్థులు మధ్యలోనే చదువు మానేయకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇందుకోసం ‘జీరో డ్రాప్అవుట్ మిషన్’ అమలు చేయాలని సూచించారు. డ్రాప్అవుట్స్ను తగ్గించేందుకు కమ్యూనిటీ లీడర్లను భాగస్వాములను చేయాలని తెలిపారు. రాష్ట్రంలోని 175 పాఠశాలలను ‘లీప్ స్కూల్స్’గా అభివృద్ధి చేసే ప్రతిపాదనలపైనా రివ్యూ జరిగింది.
యూనివర్సిటీల్లో 1,523 పోస్టులు :
రాష్ట్రంలోని యూనివర్శిటీల్లో ఖాళీగా ఉన్న 1,523 అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పోస్టులకు సంబంధించి డిసెంబర్లో రాత పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే, రాష్ట్రంలో క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు జాతీయ, అంతర్జాతీయ యూనివర్శిటీలు ఆసక్తి చూపుతున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.
ఉన్నత విద్యా రంగ అభివృద్ధికి ఈ అవకాశాలను వినియోగించుకోవాలని మంత్రి లోకేష్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 125 ప్రాంతాల్లో ఆటిజం సెంటర్ల ఏర్పాటు అంశంపైనా సమీక్ష జరిగింది. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు అవసరమైన సేవలు, సహాయక వ్యవస్థలను మరింత అందుబాటులోకి తీసుకురావడంపై అధికారులు చర్చించారు.
