Inter Admission 2026 Cancel: విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్ అడ్మిషన్లు రద్దు.. కొత్త షెడ్యూల్ ఎప్పుడంటే..!
TS Inter Admissions 2026 : ఇంటర్ విద్యార్థులకు కీలక అలర్ట్.. అడ్మిషన్లు తాత్కాలికంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
- Dharani Pilli
- Updated on- May 6, 2026 / 10:25 AM IST
telangana intermediate board cancelled admission-schedule 2026 and revised-instructions will be issued soon
TG Inter Admissions 2026 : తెలంగాణలో ఇంటర్ లో చేరబోయే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కీలక అలర్ట్. రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి కీలక ప్రకటన చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల వెల్లడించిన ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి మే 4న విడుదల చేసిన సర్క్యులర్‌ను తక్షణమే రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ప్రకటించారు. రాష్ట్ర విద్యాశాఖ, ఇంటర్ బోర్డు ఈ సంవత్సరం విద్యా రంగంలో పలు కీలక సంస్కరణలు ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ సంస్కరణల వల్ల విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను అందించడంతో పాటు, అడ్మిషన్ల ప్రక్రియను మరింత పారదర్శకంగా మారుస్తాయని అధికారులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు.. పాత షెడ్యూల్‌ను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు సమాచారం. అన్ని రకాల ప్రభుత్వ, ఎయిడెడ్, అన్-ఎయిడెడ్, గురుకుల, మోడల్ జూనియర్ కాలేజీలతో పాటు ప్రైవేటు ఇంటర్ కాలేజీలు కూడా ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని బోర్డు స్పష్టం చేసింది. బోర్డు నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు.. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంటర్ అడ్మిషన్లు నిర్వహించకూడదని అధికారులు స్పష్టం చేశారు.
Also Read: *ప్రశాంత్ కిశోర్ నెక్స్ట్ స్టెప్ తెలంగాణలోనేనా? ఏ పార్టీ కోసం పని చేయబోతున్నారు? టార్గెట్ ఎవరు?
అడ్మిషన్ల తాత్కాలిక రద్దు గురించి బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. సవరించిన అడ్మిషన్ల షెడ్యూల్‌తో పాటు పూర్తి స్థాయి నిబంధనలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని.. బోర్డు ఈ ప్రకటనలో తెలిపింది. పదో తరగతి ఫలితాల తర్వాత ఇంటర్ అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు.. తాజాగా బోర్డు తీసుకున్న నిర్ణయం వల్ల కొంతకాలం వేచి చూడాల్సి ఉంటుంది. అడ్మిషన్ల ప్రక్రియలో వచ్చే మార్పుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం కోసం విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. ప్రభుత్వం తీసుకురాబోయే ఆ కొత్త సంస్కరణలు ఏమిటో అన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
