Show Cause Notices : రిజల్ట్ తగ్గినందుకు సర్కార్ సంచలన నిర్ణయం.. 145 మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లకు
Show Cause Notices : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 145 మంది మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
- Dharani Pilli
- Updated on- April 19, 2026 / 08:28 PM IST
telangana school education director issue show cause notices to 145 model school principals over inter results 2026
Show Cause Notices : తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. అయితే ఈ రిజల్ట్ కొందరిని ఇబ్బందుల్లో పడేసింది. తాజాగా వెల్లడించిన తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో.. రాష్ట్ర సగటు కన్నా తక్కువ పాస్ శాతం సాధించిన మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. ఈ క్రమంలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నికోలస్ శనివారం సదరు మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో మూడు రోజుల్లోగా తెలపాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తాజాగా వెల్లడించిన ఇంటర్ ఫస్టియర్‌లో రాష్ట్ర సగటు ఉత్తీర్ణత 66.20 శాతం కాగా.. సెకండియర్‌లో 70.58 శాతం వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లు ఉండగా.. ఫస్టియర్ లో 145, సెకండియర్ లో 105 పాఠశాలల్లో పాస్ పర్సంటేజ్.. రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉంది. అత్యంత తక్కువగా వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో వచ్చింది. ఇక్కడ ఉత్తీర్ణత ఫస్టియర్‌లో కేవలం 10 శాతమే. ఆ తర్వాత నల్గొండ జిల్లా వేములపల్లిలో 10.75 శాతం. ఏకంగా 82 పాఠశాలల్లో పాస్ శాతం 50 లోపు ఉండటం గమనార్హం.
ఇక సెకండియర్ ఫలితాల విషయానికి వస్తే.. వరంగల్ జిల్లా పర్వతగిరిలో అతి తక్కువగా 20.25 శాతం మందే ఉత్తీర్ణులయ్యారు. 79 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. కేవలం 16 మందే పాసయ్యారు. సెకండియర్ రిజల్ట్ లో మొత్తం 39 పాఠశాలల్లో 50 శాతం కంటే తక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. దీంతో ఆయా మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో వీటిపై వారు స్పందించాల్సి ఉంది.
