Assembly Elections 2023: రాజస్థాన్‭లో ఆ రికార్డ్‭ను కాంగ్రెస్ బీట్ చేస్తుందా? బీజేపీ పరిస్థితి ఏంటి?

ప్రజల ఆలోచనలు పక్కన పెడితే.. ఇరు పార్టీల్లోనూ గందరగోళం ఉంది. ఒక పార్టీతో మరొకరు తలపడడం అటుంచితే అంతర్గతంగానే ఎక్కువ కుమ్ములాటలు ఉంటున్నాయి. ఇరు పార్టీల నుంచి ఢిల్లీ నుంచి వచ్చే పెద్దలే విపక్ష పార్టీల మీద విమర్శలు చేస్తున్నారు కానీ, రాష్ట్రంలోని నేతలు మాత్రం సొంత పార్టీలోనే ఎక్కువ కుమ్ములాడుకుంటున్నారు

Rajasthan Politics: రాజస్థాన్ రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలదే హవా అయినప్పటికీ.. ప్రతి ఐదేళ్లకు ఒకసారి అక్కడి ప్రజలు ప్రభుత్వాన్ని మార్చేస్తుంటారు. ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా తలపడుతుంటాయి. 1990 అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. అనంతరం బైరోన్ సింగ్ షేకావత్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక 1993లో జరిగిన ఎన్నికల్లోనూ ఇదే రిపీట్ అయింది. ఆ తర్వాత 1998లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక అప్పటి నుంచి ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వాలు మారుతూ వస్తున్నాయి.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్క్ సాధించనప్పటికీ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించి బహుజన్ సమాజ్ పార్టీ సహా స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. ఇదే జరిగితే 1993 తర్వాత నుంచి ఆగిపోయిన రికార్డును కాంగ్రెస్ తిరగరాసినట్లు అవుతుంది. ఒకవేళ బీజేపీ గెలిస్తే.. రాజస్థానీ ఓటర్ల సంప్రదాయం కొనసాగినట్లే.

ఇది కూడా చదవండి: Assembly Elections 2023: బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల కాగానే రాష్ట్ర అధ్యక్షుడి ఇంటిపై రాళ్ల దాడి

అయితే ప్రజల ఆలోచనలు పక్కన పెడితే.. ఇరు పార్టీల్లోనూ గందరగోళం ఉంది. ఒక పార్టీతో మరొకరు తలపడడం అటుంచితే అంతర్గతంగానే ఎక్కువ కుమ్ములాటలు ఉంటున్నాయి. ఇరు పార్టీల నుంచి ఢిల్లీ నుంచి వచ్చే పెద్దలే విపక్ష పార్టీల మీద విమర్శలు చేస్తున్నారు కానీ, రాష్ట్రంలోని నేతలు మాత్రం సొంత పార్టీలోనే ఎక్కువ కుమ్ములాడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వర్గం ఒకవైపు మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వర్గం మరొకవైపు గత మూడేళ్లుగా హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ రెండు వర్గాలకు బీజేపీని టార్గెట్ చేయడం ఎప్పుడో మానేశాయి.

ఇక బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. రాష్ట్రంలో ఒక వర్గం అంటూ ప్రధానంగా ఏమీ లేదు. టికెట్ల పంపిణీకి సంబంధించి రాష్ట్రంలోని చాలా చోట్ల నేతలు, కార్యకర్తలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు రాష్ట్రంలో పార్టీకి పెద్ద ముఖంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేను పక్కన పెట్టడం కూడా పెద్ద సమస్యగానే మారింది. రాజస్థాన్ పార్టీ మీద నాయకులకు పూర్తిగా కంట్రోల్ తప్పింది. అమిత్ షా రంగంలోకి దిగినప్పటికీ పరిస్థితి సద్ధుమణగడం లేదు. నిజానికి ఇరు పార్టీలకు తమ తగాదాలను దాటి ప్రజల్లోకి వెళ్లే తీరిక లేదు. కనీసం విపక్షాలపై దాడి చేసే సమయం కూడా లేదు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎటువైపు ఉంటారని చెప్పడం రాజకీయ పండితులకు కూడా అంతు చిక్కడం లేదు.

ఇది కూడా చదవండి: Assembly Elections 2023: ఛత్తీస్‌గఢ్‭లో కాంగ్రెస్, బీజేపీలకు ఒకేసారి పెద్ద షాక్ ఎదురైంది