Gold Rate : మళ్లీ బంగారం దూకుడు.. కారణాలివే.. తులం గోల్డ్ రూ. 2 లక్షలు కాబోతోందా ? నిపుణులు ఏమన్నారంటే?
Gold Rate Rising Again : రాబోయే రోజుల్లో ఫెడ్ రేట్ల అంచనాలు, యూఎస్ డాలర్, ట్రెజరీ ఈల్డ్స్ కదలికలను పెట్టుబడిదారులు నిశితంగా గమనించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. ఇక ఈ నెలలో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
- Harish Thanniru
- Updated on- August 7, 2026 / 08:37 AM IST
Gold Rate Rising Again : భారతీయ సంప్రదాయంలో బంగారానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. పెద్దలు చెప్పే ప్రతీ కథలో బంగారం వినిపించేది అందుకే ! గోల్డ్ అంటే ట్రెడిషన్ మాత్రమే కాదు.. సెక్యూరిటీ కూడా ! అలాంటి బంగారం ఆగేదే లే అంటోంది. ఈ మధ్య తగ్గినట్లే తగ్గి.. ఇప్పుడు మళ్లీ వాయించి వదిలేస్తోంది. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది. ధరలు తగ్గుతున్నాయ్.. కొందామా వద్దా అనే కన్ఫ్యూజన్ నుంచి ఓ క్లారిటీకి వచ్చే టైమ్‌లోనే.. మళ్లీ పసిడి పరుగులు మొదలయ్యాయ్. వరుసగా మూడు రోజులు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి.
Also Read : Vande Bharat Double Decker: వందే భారత్ డబుల్ డెక్కర్ రైలు.. 160 కి.మీ వేగం.. ప్రయాణికులు, సరుకులు ఒకేసారి!
ఆగస్ట్ ఆరు నాటికి హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో పన్నులతో కలిపి 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం లక్షా 52వేలు పలకగా.. కిలో వెండి ధర 2లక్షల 31వేలుగా నమోదయింది. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 4వేల 257 డాలర్ల దగ్గర కొనసాగుతుండగా.. వెండి ధర 61.83 డాలర్లు దగ్గర ఉంది. ఓవరాల్‌గా గోల్డ్ ఆరు వారల గరిష్టానికి చేరుకుంది.
అమెరికా, ఇరాన్ యుద్ధంతో బంగారం, వెండి ధరలు భారీగా దిగి వచ్చాయి. వార్ కారణంగా ద్రవ్యోల్బణ భయాలు నెలకొనడం, వడ్డీ రేట్లు పెరుగుతాయన్న అంచనాలతో ఈ లోహాల ధరలు క్షీణించాయి. బంగారం ధర గరిష్ఠాల నుంచి దాదాపు 19 శాతం మేర పతనమైంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో శాంతివైపుగా అడుగులు పడుతున్నాయ్. హార్ముజ్ జలసంధిని తెరిచే విషయంలో ఇరాన్, ఒమన్ మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతి కనిపిస్తోంది. దీంతో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర మళ్లీ 80 డాలర్ల దిగువకు చేరింది. దీనికితోడు అమెరికా డాలర్ బలహీన పడడం, ట్రెజరీ ఈల్డ్స్ తగ్గుముఖం పట్టడం, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపు ఉండకపోవచ్చన్న అంచనాలు బలపడడంలాంటి పరిస్థితులు బంగారం, వెండికి అనుకూలంగా మారాయి. వీటికి మళ్లీ డిమాండ్ ఏర్పడడంతో.. ధరలకు రెక్కలొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది.
అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ప్రక్రియ కొంత మేర ముందుకు సాగుతున్నా.. పరిస్థితులు ఇంకా బలహీనంగానే ఉన్నాయి. దౌత్యపరమైన పరిణామాలు, రక్షణ ఆస్తిగా బంగారానికి ఉన్న ఆకర్షణ ప్రస్తుత ధరకు మద్దతుగా నిలుస్తున్నాయని నిపుణులు అంటున్నారు. దీనికితోడు అంతర్జాతీయంగా అమెరికన్ డాలర్ బలహీనపడటం.. ఇతర కరెన్సీల రూపంలో పసిడి కొనుగోలును చౌకగా మార్చింది. అదే సమయంలో యూఎస్ ట్రెజరీ బాండ్ దిగుబడులు తగ్గడంతో.. వడ్డీ లేని ఆస్తి అయిన బంగారంపై పెట్టుబడులకు అవకాశ వ్యయం తగ్గి ఆకర్షణ పెరిగింది.
చమురు ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణ భయాలు తగ్గి.. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే ఆందోళనలు సడలడం కూడా బంగారానికి సానుకూలంగా మారింది. ఇక రాబోయే రోజుల్లో గోల్డ్ నెక్ట్స్ దిశను నిర్దేశించడంలో యూఎస్ నాన్‌ఫార్మ్ పేరోల్స్ ఉద్యోగాల గణాంకాలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఉపాధి డేటా బలహీనంగా వస్తే పసిడి మరిన్ని లాభాలను సాధించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఊహించిన దానికంటే డేటా మెరుగ్గా ఉంటే డాలర్ పుంజుకుని బంగారంపై కొంత ఒత్తిడి పెరిగే అవకాశముంది.
రాబోయే రోజుల్లో ఫెడ్ రేట్ల అంచనాలు, యూఎస్ డాలర్, ట్రెజరీ ఈల్డ్స్ కదలికలను పెట్టుబడిదారులు నిశితంగా గమనించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. ఇక ఈ నెలలో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత వాతావరణంలో మందగించిన ఆర్థిక వృద్ధి, అధిక ద్రవ్యోల్బణం కారణంగా బంగారం ధరలు ప్రస్తుత స్థాయిల నుంచి 5 శాతం పరిధిలోనే స్థిరంగా ఉంటాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ భావిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత బలహీనపడినా.. భౌగోళిక ఉద్రిక్తతలు ముదిరినా.. బంగారం మళ్లీ సరికొత్త రికార్డుల వైపు పయనించే చాన్స్ ఉంటుందని చెప్తోంది. ఇన్వెస్టర్లు మళ్లీ బంగారం, గోల్డ్ మైనింగ్ షేర్లను కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం అని.. రాబోయే రోజుల్లో ఆర్‌బిఐ, ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలతో పాటు పండుగ సీజన్ డిమాండ్ బంగారం ధరలను ప్రభావితం చేస్తుందని మరికొందరి ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఓవరాల్‌గా అమెరికా ఫెడ్ పాలసీలు, US డాలర్ కదలికలతో స్వల్పకాలికంగా బంగారం ధరల్లో అస్థిరత కొనసాగుతున్నా.. ప్రపంచ భౌగోళిక పరిస్థితులు, వడ్డీ రేట్ల తగ్గుదల అంచనాల కారణంగా దీర్ఘకాలికంగా బంగారం మార్కెట్ అనుకూలంగానే ఉండే అవకాశం ఉంది.
బంగారానికి సంబంధించి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) అనే సంస్థ ఒకటుంది. అయితే, రాబోయే రోజుల్లో గోల్డ్ రేట్లు భారీగా తగ్గే అవకాశం ఉంటుందని.. ఈ సంస్థ అంచనా వేస్తోంది. ప్రస్తుతం 4,200 డాలర్లకుపైన ఉన్న ఔన్స్ బంగారం ధర.. 3వేల 857డాలర్ల కంటే తక్కువకు పడిపోతే.. మార్కెట్ మరింత క్షీణించే అవకాశం ఉందని డబ్ల్యూజీసీ అంటోంది. ఒకవేళ ఈ స్థాయి కంటే మరింత కిందకు పడిపోతే.. తదుపరి ప్రధాన మద్దతు ధర 3వేల 500డాలర్లకు చేరవచ్చు. జనవరిలో నమోదైన గరిష్ట ధరలతో పోలిస్తే.. ఔన్సుకు 3వేల 5వందల డాలర్ల స్థాయి అనేది సుమారు 37శాతం క్షీణతను సూచిస్తుంది. బంగారం మార్కెట్‌లో గతంలో వచ్చిన ప్రధాన సంక్షోభాల మాదిరిగానే ఈ క్షీణత కూడా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జపనీస్ యెన్ బలపడటం, యూఎస్ ఫెడ్ రేట్లపై అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, గోల్డ్ ఈటీఎఫ్‌ల నుండి పెట్టుబడుల ఉపసంహరణ వంటివి బంగారం ధరలపై గణనీయమైన ఒత్తిడిని కలిగిస్తున్నాయని అంచనా. ఒకవేళ గ్లోబల్ మార్కెట్ అంచనా వేసినట్లుగా 37శాత మేర పతనం అయితే.. తులం బంగారంపై ఏకంగా 53వేల వరకు తగ్గి 10గ్రాముల బంగారం ధర 89వేల స్థాయికి పడిపోయే అవకాశం ఉంటుంది. ఇదే సంస్థ కేంద్ర ప్రభుత్వానికి ఈ మధ్య ఓ రిక్వెస్ట్ పెట్టింది. ఇండియాలో బంగారాన్ని సాధారణ లోహంగా కాకుండా ఒక వ్యూహాత్మక ఖనిజంగా అధికారికంగా గుర్తించాలని కోరింది. స్వర్ణిమ్ ఉడాన్ 2047 పేరుతో రిపోర్టును రిలీజ్ చేసిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్.. అందులో ఈ విషయాన్ని పొందుపరిచింది.
ఇక అటు ఈ లెక్కలు అన్నీ ఎలా ఉన్నా.. రాబోయేది పెళ్లిళ్లు, పండగ సీజన్.. దీంతో బంగారం ధరలు రాబోయే రెండు మూడు నెలల్లో ఎలా ఉండబోతున్నాయని జనాల్లో ఆసక్తి కనిపిస్తోంది. ప్రస్తుత ధరల సంగతి ఎలా ఉన్నా.. రాబోయే పదేళ్లలో బంగారం ధరలు డబుల్ అయ్యే అవకాశం ఉందనేది మరికొందరి అభిప్రాయం. గత నాలుగైదేళ్లలో బంగారం రేటు భారీగా పెరిగింది. 2035 నాటికి బంగారం ధర గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి.. కొత్త శిఖరాలను చేరుకోవచ్చనే చర్చ జరుగుతోంది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల డేటాను, ప్రస్తుత ధరల పెరుగుదల రేటును విశ్లేషిస్తే, రాబోయే కొన్నేళ్లలో బంగారం ధర రెట్టింపు కావచ్చని తెలుస్తోంది. డబ్బుకు కొనుగోలు శక్తి తగ్గుతుంది. దీర్ఘకాలంలో బంగారం ధర సాధారణంగా పెరుగుతుంది. ఇక గనుల నుంచి బంగారాన్ని వెలికితీసే ఖర్చు ఏటా పెరుగుతోంది. ప్రపంచంలో అందుబాటులో ఉన్న బంగారు నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయ్. ఒకవైపు సరఫరా తగ్గుతుండగా, మరోవైపు డిమాండ్ పెరుగుతోంది. దీంతో బంగారం ధర పెరుగుతూనే ఉండొచ్చని మరికొందరు నిపుణులు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో బంగారం పెరుగుతుందా.. తగ్గుతుందా.. ఇప్పుడు అమ్మేసుకోవడం బెటరా కాదా అనే సంగతి ఎలా ఉన్నా.. గోల్డ్ మార్కెట్‌లో మాత్రం ఇప్పుడు కొత్త ట్రెండ్ కంటిన్యూ అవుతోంది.
