కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్.. గడ్డ కట్టిన మాంసం, చేపలపై కొవిడ్ వైరస్ 3 వారాల వరకు జీవించగలదు

  • Publish Date - August 24, 2020 / 09:40 AM IST

ఆహార పదార్దాలపై కరోనా వైరస్ ఉంటుందా? ఏయే ఆహార పదార్దాలపై ఉంటుంది? ఎన్ని రోజుల వరకు యాక్టివ్ గా ఉంటుంది? ఇప్పుడీ ప్రశ్నలు అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి, నిద్ర లేకుండా చేస్తున్నాయి. అయితే, ఆహారం ద్వారా కరోనా సోకదని ఇటీవలే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కీలక ప్రకటన చేసింది. ఆహారం ద్వారా కానీ, ప్యాకేజింగ్ ల ద్వారా కానీ కరోనా సోకినట్టు ఇంత వరకు ఒక్క కేసు కూడా రాలేదని తెలిపింది. ఆహార పదార్థాలను కొనుగోలు చేయడానికి భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి చైనా చేసిన ఓ పరిశోధనా ఫలితాలను WHO ఆధారాలుగా చూపింది. దీంతో జనాలు కొంత రిలాక్స్ అయ్యారు. హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నారు.



గడ్డకట్టిన మాంసం, చేపలపై వైరస్:
ఇంతలోనే మరో కొత్త అధ్యయనం బాంబు పేల్చింది. డబ్ల్యూహెచ్ఓ ప్రకటనకు భిన్నంగా కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆహార పదార్ధాలపై కరోనా వైరస్ ఉంటుందని, అది కూడా మూడు వారాల వరకు జీవించి ఉండగలదని ఆ అధ్యయనంలో తేలింది. BioRxiv అనే జర్నల్ లో ప్రచురితమైన ఓ కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు తెలిశాయి. కొవిడ్ 19కు కారణమైన వైరస్.. గడ్డకట్టిన మాంసం(frozen meat), చేపలపై(fish) మనుగడ సాగించగలదని అధ్యయనంలో తేలింది. అది కూడా ఏకంగా మూడు వారాల పాటు వైరస్ యాక్టివ్ గా ఉంటుందని నిర్ధారించింది.



ఫ్రొజన్ చికెన్ వింగ్స్ పై కరోనా:
దక్షిణ కొరియాలో కొత్తగా కరోనా కేసులు నమోదుకావడానికి కలుషితమైన ఆహారం కారణం అని గుర్తించారు. దీంతో కలుషితమైన ఆహారాన్ని ల్యాబ్ కి పంపి పరిశోధనలు నిర్వహించారు. ఈ పరిశోధనలో గడ్డకట్టిన ఆహారంపై కరోనా వైరస్ మూడు వారాల పాటు సజీవంగా ఉన్నట్టు గుర్తించారు. చైనాలోని షెంజెన్ లో గడ్డకట్టిన చికెన్ రెక్కల మాంసంలో కరోనా వైరస్ ఉన్నట్టు ఇటీవలే అధికారులు గుర్తించడం సంచలనం రేపింది. బ్రెజిల్ నుంచి చైనాకు ఇంపోర్ట్ అయిన ఫ్రోజెన్ చికెన్ పై వైరస్ ను కనుగొన్నారు. ఇది మరువక ముందే, మూడు వారాల పాటు గడ్డకట్టిన మాంసంపై కరోనా వైరస్ ఉంటుందనే వార్త ఆందోళనకు గురి చేస్తోంది.



బ్యాక్టీరియాలతో పోలిస్తే వైరస్ లు భిన్నం. సజీవ హోస్ట్ లేకుండా అవి సొంతంగా మనుగడ సాగించలేవు. చైనాలోని యాంటాయ్ లోనూ గడ్డ కట్టిన సముద్ర ఆహారం ప్యాకింగ్ పై వైరల్ జెనిటిక్ పదార్ధాన్ని ఇటీవలే గుర్తించారు. ప్రస్తుతం నోరు, ముక్కు తుంపర్ల ద్వారానే వ్యక్తి నుంచి వ్యక్తికి వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఉపరితలాల నుంచి వైరస్ వ్యాప్తి చెందడం లేదు.





3 వారాల పాటు కొవిడ్ వైరస్ ఉంటుంది:
పరిశోధకులు సింగపూర్ లోని సూపర్ మార్కెట్ల నుంచి సాల్మన్, చికెన్, పోర్క్ శాంపుల్స్ తీసుకొచ్చారు. వాటిపై సార్స్ కోవ్ 2 పార్టికల్ హెవీ డోసులు ఉంచారు. ఆ తర్వాత మాంసాన్ని మూడు రకాల టెంపరేచర్లలో స్టోర్ చేశారు. కొన్ని శాంపుల్స్ రిఫ్రిజరేటర్ లో ఉంచారు. మరికొన్ని గడ్డ కట్టే చలిలో పెట్టారు. ఆ తర్వాత పరీక్షించి చూడగా.. రిఫ్రజరేట్ లో(4 డిగ్రీల సెంటీగ్రేడ్) అయినా ఫ్రొజోన్(-20 మరియు -80 డిగ్రీల సెంటీగ్రేడ్) చేసినా మూడు వారాల పాటు గడ్డకట్టిన మాంసంపై వైరస్ సజీవంగా ఉన్నట్లు గుర్తించారు.

ఆహార పదార్థాల ప్యాకెట్లపై కోవిడ్-19 ఆనవాళ్లు:
చైనాలో ఇటీవల ఆహార పదార్థాల ప్యాకెట్లపై కోవిడ్-19 జాడ కనిపించింది. దిగుమతి చేసుకున్న రొయ్యలు, కోడి మాంసం ప్యాకెట్లపై కరోనావైరస్ ఆనవాళ్లను గుర్తించారు. ఈ పరిణామంతో ఆహార పదార్థాల ప్యాకెట్లతో కరోనావైరస్ వ్యాపిస్తుందా అన్న విషయంపై మళ్లీ చర్చ మొదలైంది. నిజానికి ఆహార పదార్థాల ప్యాకెట్ల ద్వారా వైరస్ వ్యాపించే అవకాశాలను పూర్తిగా కొట్టిపారేసే పరిస్థితి లేదు. అట్టపెట్టెలు, ప్లాస్టిక్ ఉత్పత్తుల మీద కరోనావైరస్ రోజులపాటు ఉండకపోయినా, కొన్ని గంటలు జీవించి ఉండొచ్చని ఇదివరకు జరిగిన అధ్యయనాల్లో తేలింది. తక్కువ ఉష్ణోగ్రతల దగ్గర కరోనావైరస్ ఎక్కువ కాలం జీవించి ఉండే అవకాశం ఉంది. చాలావరకూ అహారపదార్థాల ప్యాకెట్లు, ముఖ్యంగా వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆహార ఉత్పత్తులను అత్యంత చల్లని ఉష్ణోగ్రతల వద్దే నిల్వ ఉంచుతారు.



నిర్జీవమైన ఉపరితలాల మీద వైరస్ ఎక్కువకాలం బతికి ఉండలేదు:
“నిర్జీవమైన ఉపరితలాల మీద వైరస్ ఎక్కువకాలం బతికి ఉండలేదు. వీటి ద్వారా వైరస్ సోకే అవకాశం చాలా తక్కువ. వైరస్ సోకిన వ్యక్తి తుమ్ము, దగ్గు ద్వారా వెలువడే వైరస్ కణాలు పడినచోటును… ఒకటి లేదా రెండు గంటలలోపు తాకితే వైరస్ సోకే ప్రమాదం ఉంది తప్పితే, అంతకన్నా ఎక్కువసేపు వైరస్ నిలవలేదు” అని నిపుణులు తెలిపారు. ఆహారపదార్థాల ప్యాకింగ్ సంస్థల్లో పనిచేస్తున్నవారు… వైరస్ ఉన్న ఉపరితలాలను తాకిన వెంటనే కళ్లు, ముక్కు, నోరు తుడుచుకుంటే వైరస్ సోకే అవకాశం ఉంది. అయితే, కోవిడ్-19 వ్యాప్తికి ఇది ప్రధాన మార్గమని శాస్త్రవేత్తలు భావించట్లేదు. “వైరస్ కణాలున్న ఉపరితలాన్ని తాకడం ద్వారా వైరస్ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. కానీ వైరస్ వ్యాప్తికి ఇది ప్రధాన మార్గం కాదని భావిస్తున్నారు” అని యూఎస్ హెల్త్ ఏజెన్సీ ద సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) వెబ్‌సైట్‌లో రాశారు.

కరోనావైరస్ వ్యాప్తి చెందే విధానాలు:
* 2 మీటర్ల భౌతిక దూరం పాటించకుండా ఉన్నప్పుడు, వ్యక్తుల మధ్య వ్యాపించవచ్చు.
* తుమ్ము, దగ్గు లేదా మాట్లాడుతున్నప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా సోకుతుంది.
* తుంపరలు నేరుగా ముక్కు లేదా నోట్లోకి పోయినప్పుడు లేదా శ్వాసలోకి వెళ్లినప్పుడు వైరస్ సోకుతుంది.



‘‘ఒక వ్యక్తికి ప్యాకెట్ ఉపరితలం నుంచి వైరస్ సోకిందని నిరూపించడం కూడా కష్టమే. ఇంకే, ఇతర ఆధారాలు లేవని కచ్చితంగా తెలిస్తే తప్ప ప్యాకెట్ల ద్వారా వ్యాధి సంక్రమించిందని నిర్ధరించలేం’’ అని నిపుణులు అంటున్నారు. కరోనావైరస్ ప్రధానంగా వ్యక్తుల నుంచి వ్యక్తులకే వ్యాపిస్తుందని అభిప్రాయపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు