కరోనా కాలంలో విద్యార్ధులకు ఆన్ లైన్ చదువులు పిల్లల్లో మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. చదువులో వెనకబడిపోతామేమో అనే భయం..తరువాత భవిష్యత్తు ఎలా ఉంటుందోనని భయం మరోపక్క..ఆన్ లైన్ పాఠాలు అర్థం కాక మరికొందరు విద్యార్ధులు ఇలా పలు కారణాలతో ఆన్ లైన్ క్లాసులతో పిల్లల్లో మానసిక ఒత్తిడి పెరిగిపోతోందని మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఇక కార్పొరేట్ పాఠశాలల విషయానికొస్తే… దాదాపు నెల రోజులుగా అన్ని స్కూల్స్ పిల్లలకు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. లాక్‌డౌన్ సమస్త మానవాళి జీవన విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. లాక్‌డౌన్ సమయంలో ఇంటి నుంచి కాలు బయట పెడితే.. కరోనా కాటు వేస్తుందన్న భయంతో పిల్లల్ని బయటికి పంపే పరిస్థితి లేదు. దీంతో వారు ఇంటికే పరిమితం అయిపోతూ ఆంక్షల మధ్య ఒత్తిడికి గురవుతున్నారు. మునుపటిలా ఫ్రెండ్స్ తో కూడా ఉత్సాహంగా మాట్లాడలేకపోతున్నారు.
ఏమాత్రం ఆటలు లేకపోవటం వల్ల కూడా వారిలో ఉత్సాహం తగ్గిపోతోంది. ఎవ్వరికీ ఏం చెప్పుకోలేక..ఏం చెప్పాలతో తెలీక ఒత్తిడికి గురై చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటున్నారు. పిల్లల్లో ఈ ఆకస్మిక ప్రవర్తన చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోతున్నారు. ఏంటీ పిల్లాడు ఇలా అయిపోతున్నాడులేక పాప ఇలా అయిపోతోందేంటీ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి పిల్లల్లో కనిపిస్తోన్న ఈ విపరీత ధోరణికి కారణం వారికి తగినంత శారీరక శ్రమ లేకపోవడం..ఆటలు పాటలు..సరదా సరదా ముచ్చట్లు లేకపోవటం..దానికి తోడు ఆన్ లైన్ క్లాసులంటూ స్కూల్స్ ఊదరగొట్టేస్తుండటంతో సతమతమైపోతున్నారు చిన్నారులు.
ప్రతిరోజూ పిల్లలు ఇంటి వద్ద లేదా బడిలో ఎంతోకొంత సమయం ఆడుకునేవారు. ఆటల వల్ల శరీరంలో ఒత్తిడిని తగ్గించే ఎండార్ఫిన్ లాంటి పలు హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి శరీరాన్ని ఒత్తిడి నుంచి దూరంగా ఉంచి..మానసిక ప్రశాంతత చేకూరుస్తాయి. అంతేకాదు, ఆటల వల్ల శరీరం అలసి మంచి నిద్ర కూడా వస్తుంది. కానీ..ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకపోవడంతో విద్యార్థుల లైఫ్‌స్టైల్ పూర్తిగా మారిపోయింది.
శారీరక శ్రమ అస్సల్లేదు. ఎప్పుడు పడుకుంటున్నారో.. ఎప్పుడు లేస్తున్నారో.. ఎప్పుడు తింటున్నారో.. ఏం తింటున్నారో వారికే తెలియడం లేదు. వేళాపాళా లేని జీవనశైలి వల్ల చిన్న విషయాలకే ఒత్తిడికి గురవుతున్నారు. చికాకు పెరిగితే చిక్కులే అంటున్నారు చిన్నపిల్లల నిపుణులు.
Read: మనం ఇంధనంపై ఎక్కువ పన్ను చెల్లిస్తున్నామా?