బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్…కాంగ్రెస్ మాజీలకు గాలం

  • Publish Date - November 20, 2020 / 07:36 PM IST

BJP operation akarsh in GHMC elections : గ్రేటర్ హైదరాబాద్ లో మెజార్టీ సీట్లు గెలుచుకుని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకనే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నిక విజయంతో దూకుడు మీద ఉన్న కమలనాధులు ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించే పనిలో పడ్డారు.

ఎలాగైనా సరే ఈ సారి గ్రేటర్ లో అత్యధిక డివిజన్లలో గెలుపోంది మేయర్ పీఠాన్ని అందుకోవాలనే లక్ష్యంతో బీజేపీ నాయకులు ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీశారు. అందులో భాగంగా కాంగ్రెస్ మాజీ  ఎంపీలపై దృష్టి పెట్టారు. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డికి బీజేపీ నాయకులు గాలం వేశారు.



పార్టీ ఎన్నికల ఇన్ చార్జి భూపేంద్రసింగ్ కొండాతో భేటీ అయి పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు. కాగా  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , కాంగ్రెస్ మాజీ   ఎంపీ సర్వే సత్యనారాయణతో భేటీ అయ్యారు. సంజయ్ సికింద్రాబాద్ లోని సర్వే నివాసానికి వెళ్లి  పార్టీలో చేరమని కోరారు.గ్రేటర్ ఎన్నికల వేళ వీరి భేటీ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.



మరి కొంత మంది కాంగ్రెస్ నాయకులపై బీజేపీ నాయకులు దృష్టి పెట్టారు. దుబ్బాక ఎన్నికల ముందు బీజేపీ నాయకులు మాజీ ఎంపీ విజయశాంతితో భేటీ అయి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ను బీజేపీ నాయకులు కలిసినట్లు వార్తలు వచ్చాయి. కాగా సర్వే బీజేపీలోకి చేరటానికి  సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. మిగిలిన వారి చేరికపై త్వరలో సస్పెన్స్ వీడనుంది.