ఢిల్లీలో సీఎం కేసీఆర్, డే – 01 : నష్టపోయాం ఆదుకోండి

  • Publish Date - December 12, 2020 / 06:29 AM IST

CM KCR Delhi Tour Day 01 : సీఎం కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌లో బిజీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రం పెద్దలను కలుస్తున్నారు. మూడు రోజుల పర్యనలో భాగంగా.. ఆదివారం వరకూ సీఎం అక్కడే ఉంటారంటున్నాయి టీఆర్‌ఎస్‌ వర్గాలు. మరి ఆయన కలుస్తున్న కేంద్రం పెద్దలెవరు..? వారితో చేస్తున్న చర్చలేంటి..? హస్తినలో బిజీ షెడ్యూల్‌లో ఉన్నారు సీఎం కేసీఆర్‌. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, వరద సాయం రాబట్టడమే ఎజెండాగా తెలంగాణ సీఎం ఢిల్లీ పర్యటన సాగుతోంది. తొలిరోజు పర్యటనలో భాగంగా కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో భేటీ అయిన కేసీఆర్.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై వీరిద్దరూ చర్చించారు.

ముఖ్యంగా హైదరాబాద్‌ వరదలు, అకాల వర్షాల సమయంలో విపత్తు నిర్వహణ కింద రావాల్సి నిధులు, కేంద్ర హోంశాఖ నుంచి పోలీసు వ్యవస్థ ఆధునీకరణకు, వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధుల అంశాలపై కేసీఆర్‌ కీలకంగా ప్రస్తావించారు. హైదరాబాద్‌లో వరదలకు పాడైన రోడ్ల అభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనా అమిత్‌షాతో కేసీఆర్ చర్చించారు. అమిత్ షాను కలవడానికి ముందు సీఎం కేసీఆర్.. జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు సీఎం .. షెకావత్‌తో వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులు, కేంద్ర సహకారంపై కేసీఆర్‌ కేంద్రమంత్రితో చర్చించారు.

తెలంగాణకు నష్టం చేకూర్చేలా ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అభ్యంతరాలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నిత్యం 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. సీఎం కేసీఆర్‌ ఆదివారం కూడా ఢిల్లీలోనే ఉంటారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, నితిన్‌ గడ్కరీ, హర్దీప్‌సింగ్‌ పురి‌, నరేంద్రసింగ్‌ తోమర్‌లతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది. ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ కార్యాలయం కోసం కేంద్రం కేటాయించిన స్థలాన్ని సీఎం కేసీఆర్‌ పరిశీలించి.. శంకుస్థాపనపై నిర్ణయం తీసుకుంటారంటున్నాయి టీఆర్ఎస్‌ వర్గాలు.