కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ర్యాలీకి అనుమతివ్వవని పోలీసులు.. ఆర్ఎస్ ఎస్, ఎంఐఎం ర్యాలీలకు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ర్యాలీకి అనుమతివ్వవని పోలీసులు.. ఆర్ఎస్ ఎస్, ఎంఐఎం ర్యాలీలకు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ 135 వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఏఏ, ఎన్ఆర్ సీలకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని రక్షించండి అనే నినాదంతో టీపీసీసీ తిరంగా ర్యాలీకి పిలుపు ఇచ్చింది. అయితే దీనికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. తిరంగా ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడంతో శనివారం (డిసెంబర్28, 2019) హైదరాబాద్ లోని గాంధీభవన్ ముందు కాంగ్రెస్ నేతలు దీక్షకు దిగారు. ఈ సందర్భంగా వి.హనుమంతరావు మాట్లాడుతూ హైదరాబాద్ లో ఆర్ఎస్ ఎస్ ర్యాలీ, నిజామాబాద్ లో ఎంఐఎం ర్యాలీలకు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు.
రాజకీయ కక్షతోనే ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు :
రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కక్షతోనే తిరంగా ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని అన్నారు. డీజీపీని అడ్డుపెట్టుకుని పర్మీషన్ ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. డీజీపీని అడ్డుపెట్టుకుని కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని ఆరోపించారు. శాంతిభద్రతల సమస్య అయితే నిజామాబాద్ లో మజ్లిస్ సభ, హైదరాబాద్ లో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. రెండు రోజుల క్రితం జరిగిన ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భగవత్ ర్యాలీకి అనుమతి ఇచ్చి, రోడ్డుపై నడిచేందుకు..రెండు పక్కల పబ్లిక్ ను ఆపి..ర్యాలీకి సహకరించారని తెలిపారు. ఎల్ బీ నగర్ నుంచి సరూర్ నగర్ వరకు ఆర్ఎస్ఎస్ కార్యర్తలు కట్టెలు పట్టుకుని ర్యాలీ తీశారని…వారికి ఎలా పర్మీషన్ ఇచ్చారని నిలదీశారు.
నిజామాబాద్ లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి..మజ్లిస్ సభకు ఎలా అనుమతిచ్చారని నిలదీశారు. పబ్లిక్ మీటింగ్ పెట్టాలో, ర్యాలీలో తీయాలో చెప్పేందుకు పోలీసులు ఎవరని ప్రశ్నించారు. తాము ఏమేమీ కార్యక్రమాలు చేయాలో పోలీసులు ఎలా ఆదేశిస్తారని మండిపడ్డారు. మీటింగ్ లే పెట్టాలి, ర్యాలీలు తీయొద్దని పోలీసులు చెప్పడం సరికాదన్నారు. అలా అయితే ఆర్ఎస్ఎస్, ఎంఐఎంలకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు.
సెక్యులర్ సిద్ధాంతాలను నమ్ముతున్నాం :
సెక్యులర్ దేశంలో కొత్త సవరణ బిల్లు తీసుకొచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. దేశంలో ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ సెక్యులర్ సిద్ధాంతాలను నమ్ముతుందన్నారు. దేశంలోని హిందువులు, ముస్లీంలు, సిక్కు, ఇసాయిలతోపాటు అందరూ దేశ సమైక్యతను కాపాడాలని మహాత్మ గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ సందేశాన్ని ప్రజలకు తెలిపేందుకు వెళ్తే అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. అంబేద్కర్.. రాజ్యాంగంలో ఆర్టికల్ 3 రాయకపోతే తెలంగాణ రాకపోయేదన్న విషయాన్ని సీఎం కేసీఆర్ తెలుసుకోవాలన్నారు.