హైదరాబాద్ లో డెంగీ జ్వరాల తీవ్రత రోజు రోజుకు తీవ్రంగా మారింది. గత మూడు దశాబ్దాల కంటే.. ఈ సంవత్సరం ఎక్కువగా వ్యాపించడంతో..సిటీలోని సీనియర్ డాక్టర్లు అంతా కలిసి రౌండ్ టేబుల్ చర్చలు చేశారు. అయితే ఈ సంవత్సరం జూన్ నెల మధ్య నుంచి డెంగీ, చికున్‌గున్యా కేసులు బాగా పెరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మాకు డెంగీ కేసులు వస్తాయి కానీ.. గత మూడు దశాబ్దాలలో ఇంత ఘోరంగా మాత్రం ఎప్పుడు జరగలేదు అని డాక్టర్ వసంత కుమార్ (జనరల్ ఫిజీషియన్) తెలిపారు.
అయితే రౌండ్ టేబుల్ చర్చలో పాల్గొన్న డాక్టర్లంతా కలిసి గురువారం (సెప్టెంబర్ 19, 2019)న వారి అభిప్రాయాలను వెల్లడించారు. ప్రస్తుతం వచ్చే కేసుల ప్రకారం చూస్తే.. మారిన వాతావరణం కారణంగా ఈ వ్యాధి చిన్నపిల్లలకే ఎక్కువగా వ్యాపిస్తోంది. స్కూల్స్, కాలేజీలకు వెళ్లే పిల్లలకు డెంగీ ఎక్కువగా వ్యాపిస్తోందని తెలిపారు.
ఎందుకంటే వారి స్కూలు పరిసరాల్లో పరిశుభ్రంగా లేకపోవడం, ఇంటి రోడ్లపై వర్షపు నీరు నిల్వ ఉండటంతో వీరు ఎక్కువగా డెంగీ బారిన పడుతున్నారని వెల్లడించారు. అలా వ్యాపించకుండా ఉండేందుకు విద్యార్థులు చేతులకు గ్లౌవ్స్, ఫుల్ ప్యాంట్ యూనిఫాం వేసుకోడానికి అనుమతించాలని సూచించారు.
డాక్టర్ విజయలక్ష్మీ సీనియర్ గైనకాలజిస్ట్ మాట్లాడుతూ.. ప్రస్తుతం వస్తున్న కేసుల్లో గర్భిణీలపై డెంగీ తీవ్రంగా వ్యాపిస్తోందని తెలిపారు. అంతేకాదు డెంగీ వచ్చిన తల్లులతో పాటు ప్రసవించే శిశువులకు కూడా ICUలో చికిత్స చేయలని చెప్పారు. జ్వరం కేసులు అధికంగా రావడంతో వైద్యులు, ఆస్పత్రులు ఒత్తిడికి గురవుతున్నాయని తెలిపారు. 6 వారాల గర్భిణీకి డెంగ్యూ సోకినట్టు నిర్ధారించిన సమయంలో అబార్షన్ అయిందని అన్నారు.
డెంగీ లక్షణాలు..
డెంగీ వచ్చిన వారిలో 3 నుంచి 5 రోజుల వరకు ఆ లక్షణాలు కనిపించవు. ఇక కొందరికి ఆ జ్వరం వచ్చిన వెంటనే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. డెంగీ వచ్చిన వారికి 104 డిగ్రీల జ్వరం ఉంటుంది. అలాగే తలనొప్పి, కండరాలు, ఎముకలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. వికారంగా వాంతులు వచ్చినట్లు అనిపిస్తుంది. కొందరికి వాంతులు కూడా అవుతాయి. కళ్ల వెనుక నొప్పిగా ఉన్నట్లు అనిపిస్తుంది. శరీరంపై కొందరిలో ఎర్రగా దద్దుర్లు కూడా వస్తాయి.