వద్దంటే వానలు పడుతున్నాయి. దంచి కొడుతున్నాయి. హైదరాబాద్ ని వర్షాలు వెంటాడుతున్నాయి. బుధవారం(సెప్టెంబర్ 25,2019) హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది.
వద్దంటే వానలు పడుతున్నాయి. దంచి కొడుతున్నాయి. హైదరాబాద్ ని వర్షాలు వెంటాడుతున్నాయి. బుధవారం(సెప్టెంబర్ 25,2019) హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రం 5.30 గంటలకు వర్షం మొదలైంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎర్రగడ్డ, ఎస్ ఆర్ నగర్, మూసాపేట, ఖైరతాబాద్, కోఠి, ఉప్పల్, కూకట్ పల్లి ప్రాంతాల్లో కుండపోత వాన పడుతోంది. సిటీ అంతటా దట్టమైన మబ్బులు కమ్మేశాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతోంది. వర్షం దంచికొట్టడంతో రోడ్లు జలమయం అయ్యాయి. రహదారులు వాగులను తలపిస్తున్నాయి. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కరెక్ట్ గా ఆఫీసుల నుంచి ఇళ్లకు బయలుదేరే సమయంలో వాన విజృంభించింది. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ముందుకు పోలేక, వెనక్కి రాలేక..వాహనదారులు నరకం చూస్తున్నారు. రెండు రోజుల నుంచి దంచి కొడుతున్న వానలతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దైంది. తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందే చెప్పింది. మూడు రోజుల నుంచి వానలు కురుస్తుండటంతో నగరవాసులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. వరద నీరు, మురికి నీరు ఇళ్లలోకి చేరి నరకం చూస్తున్నారు. మంగళవారం(సెప్టెంబర్ 24,2019) హైదరాబాద్ నగరంలో రికార్డ్ స్థాయిలో వర్షం పడింది. వాన బీభత్సం సృష్టించింది. నగరవాసుల వెన్నులో వణుకు పుట్టించింది.
ఈ వర్షాలకు పాత భవనాలు ఎక్కడ కూలుతాయోనని భయపడుతున్నారు. హోర్డింగులు పడిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి పెట్టారు. ఆదివారం( సెప్టెంబర్ 22, 2019) కూడా భారీగా వర్షం పడగా.. అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో యువతిపై పెచ్చులు ఊడిపడి చనిపోయింది. అటువంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో హుస్సేన్ సాగర్ నిండిపోయింది. వాటర్ లెవల్స్ ప్రమాదకర స్థాయికి చేరాయి. మళ్లీ వాన పడుతుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. నీటిని కిందికి వదిలే అవకాశం ఉందని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.