నిధులపై ప్రశ్నలు.. సమ్మెపై ఆగ్రహం.. చర్చల జరిగిన తీరుపై ఆరా.. విలీనం పక్కనపెట్టి చర్చలు జరపాలంటూ సూచనలు… బస్సులు సరిగా నడవక ఓ చిన్నారి చనిపోతే బాధ్యత ఎవరిదంటూ మొట్టికాయలు.. ఈదీ… ఆర్టీసీ సమ్మెపై విచారణ సమయంలో హైకోర్టు స్పందించిన తీరు. నాలుగు డిమాండ్లు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని.. మిగతా వాటితో ఆర్థిక భారం పడుతోందని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరిస్తే… అన్ని డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మంగళవారం(అక్టోబర్ 29,2019) కోర్టు ఏం చెబుతుందా అనే విషయంపై ఉత్కంఠ ఏర్పడింది.
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి. అటు ప్రభుత్వం.. ఇటు కార్మికుల తరఫున సుదీర్ఘంగా వాదనలు విన్న న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సమ్మె కారణంగా బస్సులు సరిగా నడవక ఓ చిన్నారి చనిపోతే బాధ్యత ఎవరిదంటూ నిలదీసింది. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం నియమించిన కమటీ జరిపిన చర్చల సారాంశాన్ని యాజమాన్యం కోర్టు ముందుంచింది. 21 డిమాండ్లపై చర్చిద్దామన్నా ఆర్టీసీ జేఏసీ వినలేదని వివరించింది. 45 డిమాండ్లపై చర్చకు కార్మిక సంఘాలు పట్టుబట్టాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది వివరించారు. అయితే… ఆర్థికపరమైన అంశాల ప్రస్తావన లేకపోవడంతో… బయటకు వచ్చేశారంటూ కార్మిక సంఘాల తరఫు న్యాయవాది కోర్టుకు స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఆర్టీసీ 4 వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. రూ.340 కోట్లు వివిధ బ్యాంకుల దగ్గర బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని.. సమ్మె కాలంలో ఆర్టీసీకి 175 కోట్లు నష్టం కలిగిందని ప్రభుత్వం చెప్పింది. కార్మికుల 21 డిమాండ్లలో రెండు మాత్రమే సంస్థ భరించే విధంగా ఉన్నాయని.. మిగతా 16 డిమాండ్లతో ఆర్థిక భారం పడనుందని వివరించింది. 4 డిమాండ్లు నెరవేర్చేందుకే 47 కోట అవుతాయని… ప్రస్తుతం ఆర్టీసీ దగ్గర కేవలం పది కోట్లే ఉన్నాయని… ఈ పరిస్థితుల్లో కార్మికుల డిమాండ్లు పరిష్కరించడం సాధ్యం కాదని ప్రభుత్వం చెప్పింది.
ఇద్దరి వాదనలు విన్న న్యాయస్థానం.. విలీనం డిమాండ్‌ను పక్కనబెట్టి మిగతా వాటిపై ఎందుకు చర్చించలేదని ప్రశ్నించింది. 21 డిమాండ్లపై చర్చ జరిగితే… కార్మికుల్లో కొంత ఆత్మస్థైర్యం పెరుగుతుందని అభిప్రాయపడింది. విలీనం డిమాండ్ పక్కనబెట్టి… మిగతా వాటిపై చర్చించకుంటే ప్రతిష్టంభన ఇలాగే కొనసాగుతందనే కోర్టు తెలిపింది. ఇద్దరి మధ్యన సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని గుర్తు చేసింది. రైల్వేస్ కంటే కూడా.. బస్సుల్లోనే ప్రజలు ఎక్కువగా ప్రయాణిస్తారని… అటవీ ప్రాంతాల్లో ఆరోగ్య సమస్యలతో చిన్నారులు చనిపోతే ఎవరు బాధ్యత తీసుకుంటారని కోర్టు ప్రశ్నించింది. సమ్మె చట్ట విరుద్ధమంటూ వాదనలు వినిపించింది. దీంతో.. సమ్మె విరుద్ధమైతే కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని హైకోర్టు కోరింది. టూల్స్, స్పేర్ పార్ట్స్‌కు సంబంధించి బడ్జెట్ ఎందుకు కేటాయించలేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
సమ్మెపై సుదీర్ఘ వాదనలను విన్న హైకోర్టు.. ఆర్టీసీకి ప్రభుత్వం ఇవాల్సిన బకాయిలు.. చెల్లింపులకు సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అయితే… బుధవారం వరకు గడువు ఇవ్వాలని ప్రభుత్వం కోరినా… మంగళవారం మధ్యాహ్నానికి పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తర్వాతి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. ఈ పరిస్థితుల్లో ఇవాళ.. ఎలాంటి వాదనలు జరుగుతాయి. ప్రభుత్వం ఏం నివేదిక ఇస్తుంది.. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే విషయంపై ఆసక్తి పెరుగుతోంది.