రూ.2వేల కోట్ల బ్లాక్‌మనీ ప్రచారం: వైసీపీపై జనసేన ఫిర్యాదు

  • Publish Date - August 23, 2019 / 11:19 AM IST

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్‌ మీడియా విభాగంపై జనసేన నేతలు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్‌మీడియాలో జనసేనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు ఆ పార్టీ వెల్లడించింది. తమ పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ బ్లాక్‌మనీని వైట్‌మనీగా మార్చుకుంటున్నారంటూ వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని జనసేన నేతలు ఫిర్యాదు చేశారు.

పవన్‌ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని రూ.2వేల కోట్ల బ్లాక్‌మనీని జనసేన మార్చుకుందంటూ వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని జనసేన నేతలు మండిపడ్డారు. తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకొని బాధ్యులను అరెస్ట్‌ చేయాలని పోలీసులను కోరారు. తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు చేపట్టేలా ముందుకు వెళ్లాలని జనసేన లీగల్ సెల్‌ను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోరడంతో వాళ్లు పోలీసులకు కంప్లైంట్ చేశారు.