Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు అలర్ట్.. రేపు రాత్రి వరకే దర్శనాలు.. మధ్యాహ్నం 12 గంటలకే నిమజ్జనం!
ఖైరతాబాద్ మహాగణపతి(Khairatabad Ganesh) నిమజ్జనోత్సవం ఈ నెల 25న (శుక్రవారం) అత్యంత వైభవంగా జరగనుంది.
khairatabad ganesh darshan ends on september 23 ahead of immersion
Khairatabad Ganesh: హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహాగణపతితో పాటు నగరం నలుమూలలా కొలువుదీరిన వినాయక విగ్రహాల సామూహిక నిమజ్జనోత్సవం ఈ నెల 25న (శుక్రవారం) అత్యంత వైభవంగా జరగనుంది. నిమజ్జనం రోజున ఉదయాన్నే మహాగణపతి(Khairatabad Ganesh) శోభాయాత్రను ప్రారంభించి, మధ్యాహ్నానికల్లా హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం పూర్తి చేయాలని ఉత్సవ కమిటీ ప్రతినిధులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం ఖైరతాబాద్‌లో భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని ఈ నెల 23వ తేదీ (బుధవారం) రాత్రి వరకే అందుబాటులో ఉంచనున్నట్లు పోలీసులు, ఉత్సవ నిర్వాహకులు స్పష్టం చేశారు. 24న మండపం షెడ్డు, బ్యారికేడ్ల తొలగింపు ప్రక్రియను చేపట్టనుండటంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
గురువారం ఉదయం నుంచే శోభాయాత్ర వాహన ఏర్పాట్లు:
మహాగణపతిని సాగరం వైపు తరలించేందుకు గురువారం ఉదయం నుంచే శోభాయాత్ర రథం/వాహనానికి సంబంధించి ముమ్మర ఏర్పాట్లు ప్రారంభించనున్నారు. 25న ఉదయం 6 గంటలకే వాహనాన్ని కదిలించి, మధ్యాహ్నం 12 గంటలకల్లా నిమజ్జనం ప్రక్రియను ముగించాలనే ఆలోచనతో గణేష్ ఉత్సవ కమిటీ ఉంది. నిమజ్జనోత్సవ ఘట్టాలను వీక్షించేందుకు, స్వామివారిని చివరిసారిగా దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాలకు తరలిరానున్నారు.
మూడు కార్పొరేషన్ల పరిధిలో లక్ష విగ్రహాల నిమజ్జనం:
హైదరాబాద్ పరిధిలోని జీహెచ్ఎంసీ, టీజీఎంసి, సీఎంసీ పరిధిలో నిమజ్జన వేడుకలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు లక్ష విగ్రహాలు గంగ ఒడికి చేరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 11వ రోజు జరిగే ప్రధాన నిమజ్జనం కోసం నగరం నలుమూలల నుంచి హుస్సేన్‌సాగర్‌కు దాదాపు 80 వేల విగ్రహాలు రానున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సాగర్ తీరంలో అదనంగా మరో 20 క్రేన్లను అందుబాటులోకి తెస్తున్నారు.
