మా జిల్లాలో పెత్తనం ఏంటీ? : రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి కౌంటర్

  • Publish Date - September 19, 2019 / 09:51 AM IST

హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక వ్యవహారం  కాంగ్రెస్ పార్టీలో మరోసారి రాజకీయం హీటెక్కిస్తుంది. ఈ విషయంపై భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అభ్యర్థి ఎంపికపై కామెంట్ చేయగా దానికి కౌంటర్ ఇచ్చిన కోమటిరెడ్డి.

మా జిల్లాల్లో వేరే జిల్లాల వారి పెత్తనం ఏంటీ? అని ప్రశ్నించారు కోమటిరెడ్డి వెంకట రెడ్డి. కార్యకర్తలంతా ఉత్తమ్ పద్మావతిని పెట్టాలని అంటున్నారని, హుజూర్‌నగర్‌లో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలో తమకు తెలుసని, ఇప్పుడు కొత్తగా వచ్చినవారు నోరు పారేసుకోవద్దు అని, పార్టీలోకి వచ్చినవారి సలహాలు, సూచనలు తమకు అక్కరలేదని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు.

హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతియే సరైన అభ్యర్థి అని.. రేవంత్‌రెడ్డి చెప్పే పేరు ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. హుజూర్‌నగర్‌లో పోటీచేసేది పద్మావతియే.. గెలిచేది కాంగ్రెస్ పార్టీయే అన్నారు కోమటిరెడ్డి.

గతంలో కొన్ని అభిప్రాయబేధాలు ఉన్నది వాస్తమే అయినా.. ఇప్పుడు జానారెడ్డి, ఉత్తమ్, తాను ఒక్కటి అయ్యామని ఇప్పుడు మా మధ్య ఎటువంటి విభేదాలు లేవని అన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌లోని సీనియర్ నేతలు అంతా పీసీసీ అధ్యక్షుడిగా తననే ఉండమని కోరుతున్నట్లు కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.