కులవృత్తులకు పెద్దపీఠ : ట్యాంక్ బండ్ వద్ద నీరా స్టాల్ – శ్రీనివాస్ గౌడ్

  • Publish Date - September 26, 2019 / 02:17 AM IST

హైదరాబాద్ ట్యాంక్ బండ్ పరిసరాల్లో నీరా స్టాల్ ఏర్పాటు చేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. కులవృత్తులకు సీఎం కేసీఆర్ పెద్దపీఠ వేస్తున్నారని, గౌడ కులస్థులు ఆత్మగౌరవంతో బతికేలా నీరా పాలసీని ప్రకటించారని తెలిపారు. సెప్టెంబర్ 25వ తేదీ బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్‌లో అన్ని జిల్లాలకు విస్తరించి పెద్ద పరిశ్రమగా చేయాలనే ఆలోచనతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రభుత్వం తరపున నీరా స్టాల్ ఏర్పాటు చేయడమే కాకుండా..రుచికరమైన తెలంగాణ వంటకాలతో ఒక రెస్టారెంట్ కూడా పెట్టే ఆలోచనలో ఉన్నామన్నారు. నీరాలోని ఔషధ గుణాలతో షుగర్, మదుమేహం, క్యాన్సర్, లివర్, గుండె సంబంధిత వ్యాదుల నుంచి రక్షణ పొందవచ్చన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వందల ఏండ్ల నుంచి నీరాను ఉత్పత్తి చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

అనేక వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుందని నేషనల్ కెమికల్ ల్యాబరేటరీ నివేదికలు స్పష్టం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. సంప్రదాయ పానీయాల వల్ల ప్రజల ఆరోగ్యం కాపాడటమే కాకుండా గౌడన్నలకు ఉపాధి అవకాశాలు కల్పించిన వారమౌతామన్నారు. వారం రోజులుగా నీరా పాలసీపై సీఎం కేసీఆర్ స్టడీ చేసి ఎట్టకేలకు ఆమోదం తెలపడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు కేరళ, మహారాష్ట్రల్లో మాత్రమే నీరా పాలసీ అమల్లో ఉన్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు కల్లును నిషేధిస్తే..తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ మళ్లీ వాటిని తెరిపించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.