హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్ర కేబినెట్ విస్తరణ రాజ్ భవన్ లో మంగళవారం వైభవంగా జరిగింది. గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహాన్ 10 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రితో సహా ఇప్పుడు తెలంగాణా కేబినెట్ 12 కి చేరింది. సీఎం కేసీఆర్ నుంచి వచ్చే ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయించిందీ వెల్లడిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది.
మొదటగా నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా తలసాని శ్రీనివాస్ యాదవ్, గుంటకండ్ల జగదీశ్ రెడ్డి,ఈటల రాజేందర్,సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,కొప్పుల ఈశ్వర్,ఎర్రబెల్లి దయాకర రావు,వి శ్రీనివాసగౌడ్,వేముల ప్రశాంత్ రెడ్డి,చామకూర మల్లారెడ్డి,లు వరుసగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.
మంగళవారం రాజ్ భవన్ లో జరిగిన ప్రమాణ స్వీకారంలో మంత్రులు అందరూ తెలుగులో ప్రమాణ స్వీకారం చేయగా, జగదీష్ రెడ్డి, ఈటల రాజేందర్ పవిత్ర హృదయం అని వ్యాఖ్యానిస్తూ ప్రమాణ స్వీకారం చేయగా, మిగిలిన వారంతా దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, హోంమంత్రి మహముద్ అలీ, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.