వదంతులు నమ్మొద్దు..రాష్ట్రంలో ఉన్నవారెవ్వరికీ కరోనా సోకలేదు : మంత్రి ఈటెల

రాష్ట్రంలో ఉన్న వారెవరికి కరోనా సోకలేదని మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. బయట దేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా లక్షణాలున్నాయని చెప్పారు.

  • Publish Date - March 4, 2020 / 03:03 PM IST

రాష్ట్రంలో ఉన్న వారెవరికి కరోనా సోకలేదని మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. బయట దేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా లక్షణాలున్నాయని చెప్పారు.

రాష్ట్రంలో ఉన్న వారెవరికి కరోనా సోకలేదని మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. బయట దేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా లక్షణాలున్నాయని చెప్పారు. కరోనాపై వాట్సప్, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయొద్దన్నారు. కరోనాపై వదంతులు నమ్మొద్దన్నారు. బుధవారం (మార్చి 4, 2020) ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి రానక్కర్లేదని.. ఐసోలేషన్ ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కరోనాకు చికిత్స తీసుకోవచ్చన్నారు. ఇంట్లో ఒక వ్యక్తికి కరోనా ఉంటే కుటుంబ సభ్యులందరికీ వ్యాధి రావాలని లేదన్నారు. మైండ్ స్పేస్ లో ఒకరికి కరోనా వచ్చిందని మొత్తం ఖాళీ చేస్తున్నారని….అది కరెక్ట్ కాదన్నారు. మహేంద్రహిల్స్ లో సొంత ఇంటిలో గడిపిన వారికే రానప్పుడు, అపోలో ఆస్పత్రిలో చికిత్స చేసిన 40 మంది డాక్టర్లకు నిర్ధారణ కానప్పుడు గాలి వార్తలు విని ఐటీ సెక్టార్లను ఖాళీ చేస్తామన్న భావన మంచిదికాదన్నారు. ఇది మరింత మందికి భయం కల్గించే చర్యకు దారి తీస్తుందన్నారు.

కరోనా గాలితో వ్యాపించేది కాదు..
కరోనా వైరస్ గాలితో వ్యాపించేది కాదు..ఒక రూమ్ లో ఉన్న అందరికీ వస్తుందనే నిజం కాదన్నారు. బస్సుల్లో, ట్రెయిన్స్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు అందరికీ వస్తుందన్న భావన ఉందన్నారు. వైరస్ సోకి ఉన్న వ్యక్తి తుమ్మితే, దగ్గితే ఆ తుంపర్లు నేరుగా వేరొక వ్యక్తి నోరు, ముక్కు, కంటిలో పడితే వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. వైరస్ కల్గి ఉన్న సెలైన్ ను తాకినప్పుడు, నోటిలో పడ్డప్పుడు మాత్రమే వైరస్ సోకుందన్నారు. వేరే వైరస్ లాగా ఇది ఎయిర్ బార్న్ వైరస్ కాదన్నారు. ఈ సమాచారాన్ని కరపత్రాలు, టీవీలు, రేడియోలు, సోషల్ మీడియా, సిటీల్లో ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ల రూపంలో పూర్తిస్థాయిలో ప్రచారం మొదలైందన్నారు. 104 ద్వారా ఎలాంటి సమాచారం కావాలన్న లభిస్తుందన్నారు. 104 ను వినియోగించుకోవాలని..నిర్ధారణ చేసుకున్నాకే చర్యలు ఉపక్రమించాలని కోరారు. 

రాష్ట్రంలో మొత్తం 47 అనుమానిత కేసులు
రాష్ట్రంలో మొత్తం 47 అనుమానిత కేసులు నమోదయ్యాయని తెలిపారు. 45 మందికి కరోనా నెగెటివ్ రిపోర్టులు వచ్చాయని అన్నారు. వారందరినీ వారి ఇళ్లకు పంపించామని తెలిపారు. వారి ఇళ్లల్లో తమ అబ్జర్వేషన్ లో ఉంటారని తెలిపారు. ఇళ్లు లేని వారు, వసతి లేని వారు మినహా అందరినీ వారి ఇళ్లకు పంపించామని తెలిపారు. ఇద్దరి కరోనా రిపోర్టుల్లో స్పష్టత లేదన్నారు. ఇద్దరి రిపోర్టులను పూణె ల్యాబ్ కు పంపామని చెప్పారు. ఇద్దరి రిపోర్టులు వచ్చిన తర్వాత స్పష్టత వస్తుందన్నారు. ల్యాబ్ లు అన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్నాయని తెలిపారు. కేంద్రం నిర్ధారించిన తర్వాత కరోనాపై ప్రకటిస్తామని చెప్పారు.

ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కరోనాకు చికిత్స
స్వైన్ ఫ్లూ లాంటి వ్యాధులను ఎదుర్కొన్నామని చెప్పారు. పెద్ద పెద్ద ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎక్కడైతే ఐసోలేష్ వార్డులు ఉన్నాయో..ట్రీట్ మెంట్ ఇవ్వగలిగే అవకాశం ఉందో వారికి కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కూడా అనుమతి ఇచ్చామని తెలిపారు. కరోనా లక్షణాలున్న ప్రతి వ్యక్తి గాంధీ ఆస్పత్రికి రావాల్సిన అవసరం లేదని… ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి ట్రీట్ మెంట్ చేసుకోవచ్చన్నారు. వారి శాంపిల్స్ కోసం కూడా గాంధీకి రావాల్సిన అవసరం లేదన్నారు. ఆ శాంపిల్స్ అదే ఆస్పత్రిలో కలెక్ట్ చేసుకుని గాంధీ ఆస్పత్రికి పంపిస్తే రిపోర్టులు నేరుగా సంబంధిత ఆస్పత్రికి పంపిస్తామని చెప్పారు. ఆర్థికంగా ఉన్నవారు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందాలని ఆరాటపడతారు..కాబట్టి అలాంటి వారి కోసం ప్రైవేట్ ఆస్పత్రుల్లో ట్రీట్ మెంట్ చేయించుకునేందుకు అనుమతి ఇచ్చామని తెలిపారు. 

కరోనాపై కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందుతోందని ప్రచారం చేస్తున్నారు..కరోనా వ్యాధి అనేది గాలి ద్వారా వచ్చే రోగం కాదన్నారు. ఐటీ కంపెనీలన్నీ ఖాళీ చేస్తున్నాయని వదంతులు సృష్టిస్తున్నారని చెప్పారు. కరోనాపై కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 24 గంటల అప్రమత్తంగా ఉంటామని చెప్పారు. 24/7 ఇక్కడే ఉండి మానిటరింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నలుగురు ఎక్స్ పర్ట్ ఐఏఎస్ అధికారులతో ఆస్పిటల్ మేనేజ్ మెంట్ కమిటీ, సర్వలెన్స్ కమిటీ, ఐఈసీ కమిటీ, ప్రొక్యూర్ మెంట్ కమిటీ వేశామని తెలిపారు. ప్రాణాలు తీసే శక్తి కరోనాకు లేదన్నారు. కరోనాపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు. తెలంగాణ కరోనా వైరస్ ఫ్రీ స్టేట్ గా ఉండాలని ప్రభుత్వం కోరుతుందన్నారు.