తెలంగాణ కాంగ్రెస్ ఖాళీ అవుతోంది. TDP ఇప్పటికే ఖాళీ అయిన సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పార్టీకి చెందిన పది మంది ‘చేయి’ ఇచ్చి ‘కారు’ ఎక్కారు. మాజీ ప్రజాప్రతినిధులు సైతం పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. డీకే అరుణ బీజేపీలో చేరగా..ఆమె బాటలోనే పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి రాజీనామా చేయడం ఆ పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజీనామా లేఖను మార్చి 31వ తేదీ ఆదివారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపించారు పొంగులేటి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయి..బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Read Also : ‘నాసా’ బంపర్ ఆఫర్ : ‘నిద్ర’ ప్రియులకు లక్షలిస్తాం
కాంగ్రెస్ అధిష్టానంపై పొంగులేటి కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొండి చేయి చూపడం..ఎంపీ సీటు దక్కుతుందని ఆశించినా అది నెరవేరకపోవడం..పార్టీ పట్టించుకోవడం లేదని ఆయన భావించినట్లు సమాచారం. దీనితో ఆయన TRS వైపు వెళుతారని తొలుత ప్రచారం జరిగింది. చివరకు పొంగులేటి కమలం గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బిచ్చిన వారికే టికెట్లు దక్కాయని..లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే పునరావృతం అవుతుందని..తాను పార్టీ వీడడానికి ఇదే కారణమని రాజీనామా లేఖలో పొంగులేటి పేర్కొన్నట్లు తెలుస్తోంది. రెండు దఫాలుగా ఎమ్మెల్సీగా సుధాకర్ రెడ్డి పని చేశారు. యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా సుధాకర్ రెడ్డి పని చేశారు. గుజరాత్ రాష్ట్ర ఇన్ ఛార్జీగా కూడా ఉన్నారు.
Read Also : కేజ్రీవాల్ కు బాబు రూ.50 కోట్లిచారట: ఇదో లెక్కా అంటున్న వైసీపీ