ఇంత నిర్లక్ష్యమా?: గాంధీ ఆస్పత్రిలో జనరల్ వార్డ్‌లోనే స్వైన్‌ఫ్లూ చికిత్స

  • Publish Date - February 19, 2020 / 04:49 AM IST

ఎన్ని విమర్శలు వస్తున్నా కూడా మహా నగరం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో వైద్యుల తీరు మారట్లేదు. ఇప్పటికే ఎన్నో ఆరోపణలు, అయినా కూడా వారు చేస్తున్న తప్పులు రోజుకొకటి బయటపడుతూనే ఉన్నాయి. వారి నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణాలు అని తెలిసినా కూడా అదే తీరుతో రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

లేటెస్ట్‌గా గాంధీ ఆస్పత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి వెలుగు చూసింది. స్వైన్ ప్లూ పేషంట్‌కు చికిత్స అందించడంలో సిబ్బంది నిర్వాకం అందరినీ షాక్‌కు గురి చేసింది. సాధారణ పేషంట్లకు చికిత్స అందిస్తున్న జనరల్ వార్డులోనే ఇతర రోగులతో పాటు స్వైన్ ప్లూ పేషంట్‌కు చికిత్స అందించడం ఇప్పుడు విమర్శలకు తావిస్తుంది.

అసలే ప్రాణాంతక వైరస్‌లు ప్రజలకు నిద్ర పట్టకుండా చేస్తుంటే.. మాములు పేషంట్ల మధ్యలో స్వైన్ ప్లూ పేషంట్‌కు బెడ్‌ను కేటాయించడంతో వివాదాస్పదం అయ్యింది. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా కనీసం మాస్కులు కూడా అందుబాటులో ఉంచకుండా.. అర్థరాత్రి నుంచి వైద్యులు, నర్సులు పత్తా కూడా లేరని ఇతర రోగులు వాపోతున్నారు.